ప్రత్యామ్నాయ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలి : ఆర్‌ఎఫ్‌సీఎల్ అధికారులను ఆదేశించిన మంత్రి తుమ్మల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రామగుండంలోని ఆర్‌ఎఫ్‌సీఎల్ కంపెనీలో ఎరువుల ఉత్పత్తిలో ఆటంకాలు రాకుండా చూడాలనీ, ఉత్పత్తిలో ఆటంకాలొస్తే ప్రత్యామ్నాయ ప్రణాళికతో ముందుకెళ్లేలా సిద్ధంగా ఉండాలని అధికారులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు ఆదేశించారు. ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో ఉత్పత్తి అయ్యే యూరియాలో ఎక్కువ భాగంగా తెలంగాణకు కేటాయించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తామన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆర్‌ఎఫ్‌సీఎల్ అధికారులతో మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. గత ఖరీఫ్ సీజన్‌లో రామగుండంలో ఎరువుల ఉత్పత్తి నిలిచిపోవడం వల్ల తెలంగాణ రైతులకు యూరియా సరఫరాలో తీవ్ర ఇబ్బందులు ఎదురైన విషయాన్ని ఎత్తిచూపారు. కేంద్ర ఎరువుల రసాయనాల శాఖ నుంచి 2,05,315 మెట్రిక్ టన్నుల కేటాయింపులకు గానూ కేవలం 1,10,720 మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా కావడం వల్ల లోటు ఏర్పడిందని తెలిపారు. ఈ లోటును భర్తీ చేయాలని కేంద్రాన్ని పలుమార్లు కోరినప్పటికీ సమయానికి స్పందన లేకపోవడం వల్ల రైతులు నష్టపోయారని అన్నారు.
రామగుండంలో నెలకు సుమారు లక్ష టన్నుల యూరియా ఉత్పత్తి అవుతున్నప్పటికీ తెలంగాణకు కేవలం 40-50 శాతం మాత్రమే కేటాయింపులు జరుగుతున్నాయని చెప్పారు. ఇక్కడ ఉత్పత్తి అయ్యే యూరియాలో కనీసం 70 శాతం అయినా తెలం గాణకే కేటాయిస్తే రవాణా ఖర్చులు తగ్గి, రైతులకు వేగంగా ఎరువులు అందించవచ్చని సూచించారు. పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ..రబీ సీజన్‌కు సంబం ధించి ఆర్‌ఎఫ్‌సీఎల్ తీసుకుంటున్న చర్యలు, ఉత్పత్తిలో ఎలాంటి ఆటంకాలు రాకుండా చేపడుతున్న ఏర్పాట్లపై ఆరా తీశారు. రామగుండంలో తయారయ్యే యూరియాలో ఎక్కువ శాతం తెలంగాణకే కేటాంచేలా కేంద్రానికి లేఖ రాయాలని పరిశ్రమల శాఖ ఎమ్‌డీని ఆదేశిం చారు. కంపెనీ అధికారులు మాట్లాడుతూ.. అక్టోబర్, నవంబర్ నెలల్లో కేటాయింపుల మేరకు యూరియాను సరఫరా చేశామనీ, డిసెంబర్ నెలలో కూడా 50,450 మెట్రిక్ టన్నుల సరఫరా చేయనున్నామని తెలిపారు. ఇదే సమావేశంలో ఖమ్మం జిల్లా బుగ్గపాడు ఫుడ్ పార్క్‌లో నెలకొల్పనున్న పరిశ్రమల పురోగతిపై కూడా సమీక్ష జరిపారు. జనవరిలో శంకుస్థాపనలు జరిగేలా అనుమతులను వేగంగా మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు.



