Tuesday, July 8, 2025
E-PAPER
Homeజాతీయంకట్టుకథలు...!

కట్టుకథలు…!

- Advertisement -

– పేదరికంపై ప్రభుత్వం నోట అసత్యాలు, అర్థ సత్యాలు
– ఆకలితో అలమటిస్తున్న పేదలు
– పోషకాహార లోపంతో అనారోగ్యాలు
– విద్య, ఆరోగ్య రంగాల్లో వెనుకంజ
– సంక్షేమానికి నిధుల కేటాయింపులో నిర్లక్ష్యం
– రక్షిత మంచినీరూ కరువే

దేశంలో 64.3 శాతం మంది ప్రజలు…మరో మాటలో చెప్పాలంటే ప్రతి ముగ్గురు పౌరుల్లో ఒకరు ఏదో ఒక సామాజిక భద్రతా ప్రయోజనాన్ని పొందుతున్నారని ప్రభుత్వం విడుదల చేసిన డేటా చెబుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ గత ఆదివారం తన మన్‌ కీ బాత్‌ ప్రసంగంలో ఇది కేవలం సంఖ్యకు సంబంధించిన విషయం కాదని, భారతదేశం తన పౌరులకు ఏ విధంగా మద్దతు ఇస్తోందో తెలియజేస్తోందని చెప్పారు. ప్రభుత్వ డేటా ప్రకారం దేశంలో 95 కోట్ల మందికి కనీసం ఒక సామాజిక భద్రతా పథకం వర్తిస్తోంది. 2015లో కేవలం 28 కోట్ల మందికి మాత్రమే ఈ పథకాల ద్వారా లబ్ది చేకూరిందని ఆ డేటా చెబుతోంది. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ గత నెల 29న విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలను ప్రస్తావించింది.
న్యూఢిల్లీ : పేదరిక నిర్మూలన సూచికకు సామాజిక భద్రతను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. 2015-16లో దేశ జనాభాలో 24.85 శాతం మంది పేదలు ఉండగా 2019-21 నాటికి వారి సంఖ్య 14.96 శాతానికి పడిపోయిందని నివేదిక తెలిపింది. అయితే నివేదిక చెబుతు న్నట్లు దేశంలో పేదరికం నిజంగా తగ్గిపోయిందా? అసలు పేదరికాన్ని ఎలా లెక్కిస్తారు? భారత్‌కు దారిద్య్ర రేఖ ఉన్నదా? దేశంలో నిజమైన పేదలు ఎవరు? ఈ విషయాలన్నింటినీ పరిశీలిస్తే ప్రభుత్వ నివేదికలో వాస్తవాలు, అర్థసత్యాలు, డాంబికాలు బయటపడతాయి.


పాత డేటాతో తప్పుడు వాదనలు
రోజుకు రూ.107 కంటే తక్కువ ఆదాయం పొందే వారిని పేదలుగా పరిగణిస్తున్నారు. గత పది సంవత్సరాల కాలంలో…దినసరి ఆదాయం 2.15 డాలర్ల కంటే తక్కువగా ఉన్న 17.1 కోట్ల మంది నిరుపేదలను ఆ స్థితి నుండి బయటపడేశానని ప్రభుత్వం ఇటీవలే చెప్పుకొచ్చింది. తన వాదనకు మద్దతుగా ప్రపంచబ్యాంక్‌ నివేదికను చూపింది. అయితే ప్రపంచబ్యాంక్‌ గత నెలలో అంతర్జాతీయ దారిద్య్ర రేఖను సవరించింది. దీని ప్రకారం రోజుకు మూడు డాలర్ల కంటే తక్కువ ఆదాయం కలిగిన వారిని నిరుపేదలుగా గుర్తించాల్సి ఉంటుంది. అంతకుముందు అది 2.15 డాలర్లుగా ఉండేది. ఈ సవరణ కారణంగా ప్రపంచవ్యాప్తంగా నిరు నిరుపేదల సంఖ్య మరో 12.5 కోట్లు పెరిగింది. కానీ మోడీ ప్రభుత్వం మాత్రం ప్రపంచబ్యాంక్‌ పాత డేటానే ఉదహరిస్తూ పేదరికం తగ్గిపో యిందని సంతోషపడుతోంది. ‘నూతన దారిద్య్ర రేఖ ప్రపంచవ్యాప్తంగా నిరు పేదల సంఖ్యను 22.6 కోట్లు పెంచి ఉండవచ్చు. అయితే భారత డేటా సవరణ ప్రకారం ప్రపంచంలో నిరు పేదల నికర పెరుగుదల కేవలం 12.5 కోట్లే’ అని మంత్రిత్వ శాఖ నివేదిక చెప్పుకొచ్చింది.


దారిద్య్ర రేఖే లేదు
ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయమేమంటే మన దేశంలో అందరికీ ఆమోదయోగ్యమైన దారిద్య్ర రేఖ అనేదే లేదు. గృహ వినియోగ వ్యయ సర్వేల ఆధారంగా పేదరికాన్ని అంచనా వేస్తున్నారు. 2011-12లో గ్రామీణ ప్రాంతాలలో దారిద్య్ర రేఖ నెలకు రూ.816 (తలసరి) ఉండగా పట్టణ ప్రాంతాలలో వెయ్యి రూపాయలుగా ఉంది. అప్పటి నుంచి ప్రజల జీవన స్థితిగతులు అనేక విధాలుగా మారిపోయాయి. జీవన వ్యయం కూడా పెరిగింది. అయితే ఇవి పేదల వినియోగంలో ఎలాంటి మార్పులు తీసుకురాలేదు. దారిద్య్ర రేఖను ద్రవ్యోల్బణం ఆధారంగా సవరిస్తారు. అయితే క్షేత్ర స్థాయిలో పేదరికం కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న సంక్లిష్ట పరిస్థితులను విస్మరించినప్పుడు దానికి విలువే ఉండదు. ప్రభుత్వ నివేదిక ప్రకారం చూసుకున్నా దేశంలో ఇప్పటికీ సుమారు 21.6 కోట్ల పేదలు ఉన్నారు.


సంక్షేమానికి పెరగని నిధులు
దేశంలో వృద్ధులు, మహిళలు, చిన్నారులు, గర్భిణులు, దివ్యాంగుల కోసం ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల రూపంలో 64.3 శాతం మందికి సామాజిక భద్రత లభిస్తున్న మాట నిజమే. అయితే విద్య, ఆరోగ్యం, సామాజిక రక్షణ వంటి అత్యవసర సేవలపై ప్రభుత్వం చేస్తున్న ఖర్చు గత పది సంవత్సరాల కాలంలో పెరిగింది లేదు. కోవిడ్‌ సమయంలో మాత్రం కొంత హెచ్చుతగ్గులు నమోదైనప్పటికీ సంక్షేమ పథకాలపై గత రెండు దశాబ్దాలుగా చేస్తున్న వ్యయం ఎదుగూ బొదుగూ లేకుండా అలాగే ఉండిపోయింది. కానీ ప్రభుత్వం మాత్రం గొప్పలు చెప్పుకుంటూనే ఉంది. దేశంలోని 84.75 శాతం మందికి ల్యాండ్‌లైన్‌ లేదా మొబైల్‌ ఫోన్‌ ఉన్నదని మంత్రిత్వ శాఖ నివేదిక తెలిపింది. 2024 నాటికి 99.06 శాతం మందికి కనీసం 4జీ నెట్‌వర్క్‌ ఉన్నదని కూడా చెప్పింది. అయితే పేదరికం తగ్గిపోయిందనడానికి ఇది సంకేతమా అంటే అదేమీ కాదని చక్రవర్తి చెప్పారు.
తాగునీటికీ కటకటే
నివేదిక ప్రకారం 2021-22 నాటికి దేశంలో ప్రతి వెయ్యి మందికి ఒక వైద్యుడు, లక్ష మందికి ఒక సైక్రియాట్రిస్ట్‌ కూడా లేరు. లక్ష మందికి 14 మంది సర్జన్లు మాత్రమే ఉన్నారు. అందరికీ నాణ్యమైన విద్యను అందించే విషయంలో కూడా భారత్‌ వెనుకబడే ఉంది. భాష, గణితంలో కనీస పరిజ్ఞానం కలిగిన విద్యర్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. దేశంలో పైపుల ద్వారా సురక్షిత నీటి సరఫరా మెరుగుపడినప్పటికీ గ్రామీణ జనాభాలో 20 శాతం మంది, పట్టణ జనాభాలో 25 శాతం మందికి నేటికీ సురక్షితమైన, చాలినంత తాగునీరు అందుబాటులో లేదు.


ఆకలి సూచీలో ‘సీరియస్‌’ కేటగిరీ
పేదరికం అనేది మోడీ ప్రభుత్వ ప్రాధాన్యతాంశాలలో లేదని రాజకీయ ఆర్థికవేత్త, కాలమిస్ట్‌ అనింద్యో చక్రవర్తి తెలిపారు. అయితే పేదలకు ఆహార ధాన్యాల పంపిణీ అనేది రాజకీయ ప్రాధాన్యత కలిగిన అంశమని ఆయన గుర్తించారని, అందుకే ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన పథకాన్ని పొడిగించారని ఆయన చెప్పారు. గత సంవత్సరం ఆగస్ట్‌ నాటికి ఈ పథకం కింద 80 కోట్లకు పైగా పేదలు లబ్దిదారులుగా ఉన్నారని వివరించారు. గత సంవత్సరం విడుదలైన అంతర్జాతీయ ఆకలి సూచికలో భారత్‌ 105వ స్థానంలో (మొత్తం దేశాలు 127) నిలిచిన విషయాన్ని ఇక్కడ గమనంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సూచిక భారత్‌ను 27.3 స్కోరుతో ‘సీరియస్‌’ కేటగిరీలో ఉంచింది. భారత జనాభాలో 13.7 శాతం మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారని, ఐదేండ్లలోపు వయసున్న పిల్లల్లో 35.5 శాతం మంది కుంగుబాటుకు గురవుతున్నారని ఆ సూచిక ఎత్తిచూపింది. అయితే ఈ గణాంకాలను మోడీ ప్రభుత్వం తోసిపుచ్చింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -