నాలుగు నెలలు పూర్తవుతున్న అందని వేతనం
భారమవుతున్న కుటుంబ పోషణ
ఆందోళనలో ఫీల్డ్ అసిస్టెంట్లు
నవతెలంగాణ – రామారెడ్డి
కూలీల వేతనాలు వారి చెమట ఆరే లోపు అందిస్తే, కుటుంబ పోషణ భారం కాదు. ఒకటి కాదు రెండు కాదు దాదాపు నాలుగు నెలల నుండి వేతనాలు అందకపోవడంతో కుటుంబ పోషణ భారమై, అప్పుల పాలవుతున్న ఉపాధి హామీ క్షేత్ర సహాయకులు జీతాలు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. అధికారులకు వినతి పాత్రాలు అందిస్తున్నాయి. అయినా ప్రభుత్వం స్పందించడం లేదని క్షేత్ర సహాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 535 గ్రామపంచాయతీగా పరిధిలో 321 మంది క్షేత్ర సహాయకులకు గాను 282 మంది క్షేత్ర సహాయకులు విధులు నిర్వహిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 2.5 లక్షల జాబ్ కార్డుల లో 4.81, ఉపాధి కూలీలు ఉన్నారు. 1. 57 లక్షల జాబ్ కార్డులో 2.54 లక్షల మంది పనులు నిర్వహిస్తున్నారు.
వీరందరికీ క్షేత్ర సహాయకులు ముందుండి పనులను గుర్తించి, పనులు నిర్వహించి, వేతనాలు అందే వరకు కూలీలకు అండగా నిలుస్తారు. నర్సరీ నిర్వహణ, మొక్కలు నాటడం, వాటికి నీరు అందించటం, చెరువుల్లో కూడిక తీత వంటి పనులను నిర్వహిస్తున్నారు. నూతనంగా గ్రామపంచాయతీలు ఏర్పడడంతో దాదాపు 3 నుండి4 గ్రామపంచాయతీలకు ఓకే ఫీల్డ్ అసిస్టెంట్ పని భారంతో విధులు నిర్వహిస్తున్నారు. అయినా ఏప్రిల్ నుండి ఇప్పటివరకు ప్రభుత్వం వేతనాలు విడుదల చేయకపోవడంతో దినదిన గండంగా, కుటుంబ పోషణ భారమై, అప్పుల పాలవుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూలీల హాజరు శాతాన్ని బట్టి, రూ.12120, రూ.10870, రూ.8770 గా ప్రభుత్వం చెల్లిస్తుంది.
అందరికీ ఒకే విధమైన గౌరవ వేతనాన్ని రూ.26 వేలు అందించాలని కోరుతున్నారు. శాసనసభ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం క్షేత్ర సహాయకులకు అనేక హామీలను ఇచ్చి, అమలు చేయడం లేదని , కాంగ్రెస్ హామీలు అందని చంద్రునిలా ఉన్నాయని, ప్రభుత్వం వెంటనే స్పందించి ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతున్నారు. వివరణ కోసం డి ఆర్ డి ఏ పి డి సురేందర్ కు నవ తెలంగాణ చరవాణిలో సంప్రదించగా స్పందించలేదు.
మూడు నెలల వేతనాలు వెంటనే చెల్లించాలి : బ్యాగరి కొండయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ల జిల్లా అధ్యక్షులు
ప్రభుత్వం ప్రతినెల మొదటి వారంలోని వేతనం చెల్లించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించాలి. 4779 జీవోను వెంటనే రద్దు చేయాలి. రూ.26000 గౌరవ వేతనం చెల్లించాలి. ప్రతి గ్రామపంచాయతీకి ఒక క్షేత్ర సహాయకున్ని నియమించాలి. స్థానిక సంస్థల ఎన్నికలలోపు సమస్యలు పరిష్కరించాలి. లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం.