Sunday, September 21, 2025
E-PAPER
Homeరాష్ట్రీయందేవాలయ భూములపై న్యాయపోరాటం చేయండి

దేవాలయ భూములపై న్యాయపోరాటం చేయండి

- Advertisement -

ఆరు నెలలకోసారి సమావేశం పెట్టి స్టేటస్‌ చెప్పాలి
ఆ భూముల్ని కబ్జా చేస్తే పీడీ యాక్టులు పెట్టండి : ఎండోమెంటు గవర్నమెంటు ప్లీడర్ల సమావేశంలో మంత్రి సురేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

దేవాలయాల భూముల రక్షణ కోసం న్యాయ పోరాటం గట్టిగా చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయంలో దేవాదాయ శాఖ మంత్రి పేషీలో ఎండోమెంటు అధికారులు, గవర్నమెంటు ప్లీడర్ల సమావేశం నిర్వహించారు. దేవాదాయ శాఖ భూముల అన్యాక్రాంతానికి సంబంధించి కేసుల పురోగతిపై సమీక్షించారు. 2002 నుంచి 2025 వరకు 1,500 కేసులు పెండింగ్‌లో ఉండగా 543 కోర్టు కేసులను పరిష్కరించామని న్యాయవాదులు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా న్యాయవాదుల పనితీరుపై మంత్రి సురేఖ అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్‌, యాదగిరిగుట్ట ఈవో వెంకటరావు, కమిషనర్లు క్రిష్ణ ప్రసాద్‌, క్రిష్ణవేణి, ఎండోమెంటు శాఖ గవర్నమెంటు ప్లీడర్‌(జీపీ) బీఎం నాయక్‌, ఏజీపీ శైలజ, విక్రమ్‌ తదితరులు పాల్గొన్నారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. కేసుల్లో పురోగతికి సంబంధించిన అంశాలు, జడ్జిమెంట్‌ కాపీ ఎండోమెంటు శాఖ కార్యదర్శికి ఎప్పటికప్పుడు అందజేయాలని లీగల్‌ టీమ్‌కు మంత్రి సూచించారు. ఎండోమెంటు కేసుల విషయంలో న్యాయవాదులతో ప్రతి ఆరు నెలలకొక సారి సమావేశం పెట్టి స్టేటస్‌ చెప్పాలని దిశానిర్దేశం చేశారు. ఎండోమెంటు ట్రిబ్యునల్‌ ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ట్రస్టీలకు సంబంధించిన కేసుల్లో గట్టిగా వాదించాలని సూచించారు. పురావస్తుశాఖ దగ్గర వివరాలు సేకరించాలనీ, దాన్ని సాక్ష్యంగా చూపెట్టాలని ఆదేశించారు. దానికోసం ఒక ఎక్స్‌పర్ట్‌ కమిటీ నియమించాలని సూచించారు. ఎండోమెంటు కేసుల్లోని కంటెప్ట్‌ ఆఫ్‌ కోర్టు అంశాల్లో తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్న విషయాన్ని ప్రస్తావించారు. కోర్టులు మందలించేదాకా ఎందుకు తీసుకెళ్ళాలని ప్రశ్నించారు. ఈ విషయంలో న్యాయ విభాగ టీం, వారి కింద వ్యవస్థ సరైన టైంలో ఎండోమెంటు ఉన్నతాధికారులను అలర్ట్‌ చేస్తే ఇబ్బందులుండవని సూచించారు. భూములకు సంబంధించిన అంశాలు, టెంపుల్‌ ఎంప్లాయీస్‌ సర్వీసు వ్యవహారాలు కూడా పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. వచ్చిన ఆర్డర్లను అమలు పరిచేందుకు కూడా ఒక వ్యవస్థ ఉండాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో ప్రత్యేక టాస్క్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేయాలని అధికారులు మంత్రికి సూచించగా..అందుకు కావాల్సిన పనులు చేయాలన్నారు. దేవుడి భూముల జోలికిస్తే పీడీ యాక్టులు పెట్టేందుకు వెనకాడొద్దని అధికారులను ఆదేశించారు. జిల్లాకో లీగల్‌ ఆఫీసర్‌ను నియమించాలన్నారు. హైకోర్టుకు కూడా లైజన్‌ ఆఫీసర్‌ను నియమించాలనీ, ఈవోల నుంచి ఒకరుండాలని న్యాయ విభాగ టీం సూచించగా మంత్రి అనుమతించారు. వెంటనే అందుకు సంబంధించిన ప్రపోజల్‌ తనకు పంపించాలని ఆదేశించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -