ముస్లింలకు అదనంగా 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్
ఇందిరా పార్క్ వద్ద నిరాహార దీక్ష
కోర్టు ఆదేశాలతో విరమణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
బీసీలకు విద్య, ఉద్యోగాలతో పాటు చట్ట సభల్లో 42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు తమ పోరాటం ఆగదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో 72 గంటల నిరాహార దీక్షను ఆమె చేపట్టారు. అంతకు ముందు డాక్టర్ బీఆర్ అంబేద్కర్, ఫూలే, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు నివాళులర్పించారు. అనంతరం కవిత మాట్లాడుతూ తెలంగాణలో బీసీలకు అన్ని రంగాల్లో న్యాయబద్దంగా వాటా కావాలని చేస్తున్న పోరాటం చరిత్రలో నిలిచిపోనుందని అన్నారు. ”కామారెడ్డి డిక్లరేషన్‌లో చెప్పినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు న్యాయం చేయాలి. అసెంబ్లీలో తీర్మానం చేసి చేతులు దులుపుకున్న రేవంత్ సర్కార్ బీజేపీ మీద నెపం పెట్టి తప్పించుకోవాలని చూస్తోంది. బీసీ బిల్లుపై కాషాయ నేతలు లేవనెత్తిన అనుమానాలను ప్రభుత్వం నివృత్తి చేయాలి. ముస్లింలకు అదనంగా 10 శాతం రిజర్వేషన్లు ఇస్తామని రేవంత్‌రెడ్డి హామీ ఇవ్వాలి. వారిని మినహాయించి బీసీలకే 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని ప్రకటించాలి” అని కవిత డిమాండ్ చేశారు. ముస్లింల రిజర్వేషన్ల కోసం పార్లమెంటులో ప్రత్యేక బిల్లు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం తన చిత్త శుద్ధిని నిరూపించుకోవాలని సూచించారు. బీసీ రిజర్వేషన్ల అంశం తేలకుండా లోకల్‌బాడీ ఎన్నికలకు వెళ్తే.. ఎలా ఆపాలో తమకు తెలుసని ఆమె హెచ్చరించారు. నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపిన ఆర్. కృష్ణయ్యకు ఈ సందర్భంగా కవిత కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమానికి పెద్దఎత్తున జాగృతి శ్రేణులు, కవిత అభిమానులు తరలివచ్చి ఆమెకు మద్దతు తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ కవిత దీక్ష విరమించారు. నిరాహార దీక్ష చేసేందుకు సాయంత్రం 5 గంటల వరకే అనుమతి ఉండగా, ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో ధర్నా చౌక్ వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇదే సమయంలో భారీ వర్షం కురవడం, హైకోర్టు ఆదేశాలతో కవిత దీక్షను విరమించారు.
దీక్షకు హర్యానా ఎమ్మెల్యే మద్దతు
నిరాహార దీక్షకు సంఘీభావంగా మాజీ ఉప ప్రధాని దేవీలాల్ మునిమనువడు, హర్యానా ఎమ్మెల్యే అర్జున్ సింగ్ చౌతాలా హాజరై మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కవిత చేస్తున్న పోరాటాన్ని కొనియాడారు. న్యాయమైన డిమాండ్ కోసం ఆమె పోరాటంలో భాగస్వాములవుతామని ప్రకటించారు.
అది కాంగ్రెస్ కమిషన్..
కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్ … కాంగ్రెస్ కమిషన్ అని కవిత విమర్శించారు. ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో కేసీఆర్ పేరును 36 సార్లు ప్రస్తావించినంత మాత్రాన ఆయన తప్పు చేసినట్టు కాదన్నారు. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా కమిషన్ నివేదిక పేరుతో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రాజెక్టులో అత్యధిక టెండర్లు దక్కించుకున్న మేఘా కృష్ణారెడ్డిని ఎందుకు విచారించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES