Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeప్రధాన వార్తలువిద్యుత్‌ అమరుల స్ఫూర్తితో మోడీ విధానాలపై పోరాటం

విద్యుత్‌ అమరుల స్ఫూర్తితో మోడీ విధానాలపై పోరాటం

- Advertisement -

– వామపక్ష నేతల పిలుపు
– అంబానీ, అదానీలకు విద్యుత్‌ రంగం ధారాదత్తం : జాన్‌వెస్లీ
– విద్యుత్‌ సంస్కరణలను రద్దు చేయాలి : పశ్యపద్మ
– బషీర్‌బాగ్‌ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

విద్యుత్‌ అమరవీరుల స్ఫూర్తితో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా సమస్యల విధానాలపై పోరాటం చేయాలని వామపక్ష నేతలు పిలుపునిచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణను ప్రతిఘటించా లని కోరారు. రాజ్యాంగాన్ని, లౌకికత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని చెప్పారు. మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాల న్నారు. విద్యుత్‌ అమరవీరుల 25వ వర్ధంతి సందర్భంగా వామపక్ష, కమ్యూ నిస్టు పార్టీల నేతలు గురువారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో ఉన్న షహీద్‌చౌక్‌ వద్ద పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ‘రామకృష్ణ, విష్ణువర్ధన్‌రెడ్డి, బాలస్వామి జోహార్‌ జోహార్‌, ప్రపంచబ్యాంకు విధానాలు నశించాలి. విద్యుత్‌ అమర వీరులకు జోహార్‌ జోహార్‌, స్మార్ట్‌మీటర్లకు వ్యతిరేకంగా పోరాడదాం, వర్ధిల్లాలి ప్రజాపోరాటాలు, ప్రయివేటీకరణ విధానాలు నశించాలి’అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. 2000, ఆగస్టు 28న విద్యుత్‌ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా వామపక్షాలు చేపట్టిన చలో హైదరాబాద్‌ కార్యక్రమంపై నాటి ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. పోలీసులు జరిపిన కాల్పుల్లో రామకృష్ణ, విష్ణువర్ధన్‌రెడ్డి, బాలస్వామి అసువులు బాసిన విషయం తెలిసిందే.

విద్యుత్‌రంగ ప్రయివేటీకరణ : పశ్యపద్మ
మోడీ ప్రభుత్వం విద్యుత్‌ రంగాన్ని ప్రయివేటుపరం చేస్తున్నదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు పశ్యపద్మ విమర్శించారు. అందులో భాగంగానే గతేడాది విద్యుత్‌ సంస్కరణలకు పూనుకుందని చెప్పారు. దేశంలో ఎక్కడైనా విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పించిందని అన్నారు. దానివల్ల అదానీ వంటి వారికే ప్రయోజనం కలుగుతుందన్నారు. విద్యుత్‌ భారాలు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్‌ సంస్కరణలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ అమరుల స్ఫూర్తితో పోరాటం చేయడమే వారికి నివాళి అని అన్నారు. సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం హన్మేష్‌ మాట్లాడుతూ ఆనాటి విద్యుత్‌ ఉద్యమం ఈనాటికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆ పోరాటం ఫలితంగానే ప్రభుత్వాలు ఉచిత విద్యుత్‌ను అమలు చేస్తున్నాయని చెప్పారు. సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె గోవర్ధన్‌ మాట్లాడుతూ నాటి ఉద్యమం ఫలితంగానే ప్రభుత్వాలు విద్యుత్‌ చార్జీలను పెంచలేద న్నారు. అమెరికా విధానాలకు మోడీ మోకరిల్లారని విమర్శించారు. టారిఫ్‌లకు వ్యతిరేకంగా మాట్లాడ్డం లేదన్నారు.

ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి మాట్లాడుతూ విద్యుత్‌ ఉద్యమం దిక్సూచి అని అన్నారు. ఎస్‌యూసీఐ(సీ) రాష్ట్ర కార్యదర్శి మురహరి మాట్లాడుతూ విద్యుత్‌ ఉద్యమం వల్ల కరెంటు చార్జీలను పెంచాలంటేనే ప్రభుత్వాలు భయపడే పరిస్థితి వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌ వీరయ్య, టి జ్యోతి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, టి సాగర్‌, ఎండీ అబ్బాస్‌, మల్లు లక్ష్మి, పాలడుగు భాస్కర్‌, బి రవికుమార్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు జె వెంకటేశ్‌, ఆర్‌ శ్రీరాంనాయక్‌, టి స్కైలాబ్‌బాబు, పి ఆశయ్య, లెల్లెల బాలకృష్ణ, ఉడుత రవీందర్‌, జె బాబురావు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటి నర్సింహ్మా, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు విఎస్‌ బోస్‌, హైదరాబాద్‌ కార్యదర్శి స్టాలిన్‌, నాయకులు ఛాయాదేవి, సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌ నాయకులు ఎస్‌ఎల్‌ పద్మ, ప్రదీప్‌, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ నాయకులు ఝాన్సీ, అరుణ, ఎం శ్రీనివాస్‌, ఎంసీపీఐ(యూ) నాయకులు ఉపేందర్‌రెడ్డి, వనం సుధాకర్‌, ఎస్‌యూసీఐ(సీ) నాయకులు తేజ తదితరులు పాల్గొన్నారు.

సామాన్యులు విద్యుత్‌ వాడుకోలేని పరిస్థితి : జాన్‌వెస్లీ
నాడు చంద్రబాబు ప్రభుత్వం విద్యుత్‌ సంస్కరణలను తెచ్చిందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. ప్రజలపై భారాలు మోపిందని విమర్శించారు. దానికి వ్యతిరేకంగా వామపక్షాలు, ప్రతిపక్షాలు చేసిన ఉద్యమాలను అణచివేసిందన్నారు. కానీ చర్చలు జరిపి విద్యుత్‌ భారాలను తగ్గించేందుకు చర్యలు చేపట్టలేదని చెప్పారు. లాఠీచార్జీ చేసిందనీ, కాల్పులు జరిపిందనీ, ముగ్గురిని పొట్టనపెట్టుకుందని విమర్శించారు. యుద్ధవాతావరణాన్ని సృష్టించిందని అన్నారు. ప్రజాఉద్యమంపై నిర్బంధాలు మోపినా వామపక్షాలు పోరాట స్ఫూర్తిని కొనసాగించాయని చెప్పారు. ఇది దేశవ్యాప్తంగా ప్రభావితం చేసిందన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం విద్యుత్‌ రంగాన్ని ప్రయివేటుపరం చేస్తున్నదని విమర్శించారు. అంబానీ, అదానీలకు విద్యుత్‌రంగాన్ని ధారాదత్తం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నదని చెప్పారు. సామాన్యులు విద్యుత్‌ను వాడుకోలేని పరిస్థితి ఉండబోదని అన్నారు. దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెడుతున్నదని విమర్శించారు. మతోన్మాదం పేరుతో ప్రజలను విభజిస్తున్నదని చెప్పారు. విద్యుత్‌ అమర వీరుల స్ఫూర్తితో మోడీ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad