Thursday, September 4, 2025
E-PAPER
spot_img
Homeప్రధాన వార్తలుఅవినీతి పంపకాల్లో తేడా వల్లే తగాదాలు..

అవినీతి పంపకాల్లో తేడా వల్లే తగాదాలు..

- Advertisement -

ఆనాడు ఎంతోమందిని జైల్లో పెట్టించారు
ఇప్పుడు వాళ్లకు వాళ్లే తన్నుకు చస్తున్నారు !
జనం వాళ్లను ఎప్పుడో బండకేసి కొట్టారు
మీ పంచాయితీల్లోకి మమ్మల్ని లాగొద్దు
బీఆర్‌ఎస్‌, కవిత వ్యాఖ్యలపై సీఎం రేవంత్‌రెడ్డి కౌంటర్‌
భద్రాద్రి-కొత్తగూడెం, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో సీఎం పర్యటన
నవతెలంగాణ – మహబూబ్‌నగర్‌,ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధులు

”కాంగ్రెస్‌ పార్టీని బతకనివ్వబోమన్నారు.. శాసనసభ్యుల మీద అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారు.. ఇవాళ వాళ్లే తన్నుకుని చస్తున్నారు.. ఒకరినొకరు కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకుంటున్నారు. వాళ్లను వాళ్లే పొడుచుకునే పరిస్థితి వచ్చింది. అవినీతి సొమ్ము పంపకాల్లో తేడా వచ్చి కుటుంబంలో తగాదాలు పెట్టుకుంటున్నారు. పాపం ఊరికే పోదు. ఒకరి వెనుక ఒకరు ఉన్నారని కొందరు మాట్లాడుతున్నారు. అంత చెత్తగాళ్ల వెనుక నేనెందుకు ఉంటాను. నేను నాయకుడిని. ఉంటే ముందుంటా. నా వాళ్లకు తోడుగా ఉంటా. వాళ్ల కుటుంబంలో వాళ్లు వాళ్లు కత్తులతో పొడుచుకుని హరీశ్‌, సంతోష్‌ వెనుక రేవంత్‌రెడ్డి ఉన్నారని ఒకరంటే.. లేదు లేదు కవిత వెనుకాల రేవంత్‌రెడ్డి ఉన్నారని ఇంకొకరంటున్నారు. మీరంతా దిక్కుమాలిన వారనే తెలంగాణ ప్రజలు బండకేసి కొట్టారు.. అన్నం తినేవారు ఎవరైనా మీ వెనుక ఉంటారా? దయచేసి మీ కుటుంబ పంచాయితీ, మీ కుల పంచాయితీలోకి మమ్మల్ని లాగకండి” అని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి అన్నారు.

బుధవారం కొత్తగూడెం భద్రాద్రి జిల్లా చండ్రుగొండ మండలం బెండలపాడులో ప్రభుత్వం తరపున నిర్వహించిన ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ”110 నెలలు అధికారంలో ఉండి నెలకు రూ.వెయ్యి కోట్ల చొప్పున రూ.లక్ష కోట్లు సంపాదించినాయన పిల్లలు నేడు కత్తులతో పొడుచుకుంటున్నారు’ అని సీఎం ఎద్దేవా చేశారు. పంపకాల్లో తేడా వచ్చి ఇంటిల్లిపాది తలా ఓ దిక్కు దయ్యాలై ఎవడికి వాడు బల్లేలు తీసుకుని వీపున పొడుచుకునే పరిస్థితి వచ్చిందన్నారు. ”లక్ష కోట్ల ఆస్తులిచ్చిండు. ఫాంహౌస్‌లు ఇచ్చిండు. టీవీలు, పేపర్‌లు ఇచ్చిండు. కానీ ప్రశాంతత ఇవ్వగలిగిండా?” అని ప్రశ్నించారు. దోపిడీ సొమ్ము కుటుంబంలో చిచ్చు పెట్టిందన్నారు. వాళ్లు వాళ్లు పొడుచుకునేది వదిలిపెట్టి.. తీసుకొచ్చి మనకు పూస్తున్నారని చెప్పారు. వారి పంచాయతీపై తమకెలాంటి ఆసక్తీ లేదన్నారు. 2023 డిసెంబర్‌లోనే బీఆర్‌ఎస్‌ అనే కాలనాగును జనం కట్టెలతో కొట్టి చంపారనీ, ఇప్పుడు వారిని చంపాల్సిన అవసరం తనకేమీ లేదన్నారు. ప్రకృతి అనేది ప్రతి నేరస్థుడ్నీ శిక్షిస్తుందన్నారు.
రైతులను ఒప్పించి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం : సీఎం రేవంత్‌
జాతీయ రహదారి, రైల్వే, విమానయానంతోపాటు మానవ వనరులు ఉన్న పాలమూరును పారిశ్రామిక కారిడార్‌గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి చెప్పారు. మహబూబ్‌నగర్‌ జిల్లా మూసాపేట మండలం వేముల గ్రామంలో బుధవారం కార్నింగ్‌ టెక్నాలజీస్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ కంపెనీ కొత్త యూనిట్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ.. ఎవరు కాదన్నా మొదటి ముద్ద పాలమూరుకే అందుతుందని చెప్పారు. ప్రజలు సహకరిస్తే.. రాబోయే రోజుల్లో మహబూబ్‌నగర్‌ జిల్లా నూతన పరిశ్రమలకు వేదిక కాబోతుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మొదలు పెట్టిన పాలమూరు-రంగారెడ్డి, జూరాల, నెట్టెంపాడు వంటి ప్రాజెక్టులు ఏవీ సంపూర్ణంగా పూర్తి కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాడు సోనియాగాంధీ పాలమూరు యూనివర్సిటీని మంజూరు చేసినా, అది పీజీ కాలేజీగానే మిగిలిపోయిదన్నారు.

విద్య ఒక్కటే మన తలరాతలు మారుస్తుందన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. పాలమూరు ప్రాజెక్టులకు గ్రీన్‌ ఛానల్‌ ద్వారా నిధులు అందించి పూర్తి చేస్తామన్నారు. భూసేకరణ విషయంలో రైతులతో మాట్లాడి ఒప్పించి మంచి పరిహారం అందించాలని అధికారులకు సూచిస్తున్నామన్నారు. ”కుర్చీలో కూర్చుంది మీ పాలమూరు బిడ్డ.. ఏదైనా మొదటి ముద్ద మీకే పెడతాను.. ఇది నా బాధ్యత, నైతిక ధర్మం.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.. రాజకీయ కారణాలతో అభివృద్ధిని అడ్డుకుంటే మనకు మనమే మరణ శాసనం రాసుకున్నవాళ్లం అవుతాం” అని సీఎం అన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad