Tuesday, September 30, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఅక్రమ కేసులు పెట్టడం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు

అక్రమ కేసులు పెట్టడం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు

- Advertisement -

కేసులను వెనక్కి తీసుకోవాలి
ప్రీ ప్రైమరీ, పీఎం శ్రీ విద్య అంగన్‌వాడీలకే కేటాయించాలి : అంగన్వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి


నవతెలంగాణ-కొడంగల్‌
అంగన్వాడీ హక్కుల కోసం ఉద్యమిస్తుంటే అక్రమంగా అరెస్టు చేసి, కేసులు బనాయించడం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు అని అంగన్వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి అన్నారు. సోమవారం వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌కు వచ్చిన ఆమె విలేకరులతో మాట్లాడారు. ప్రీ ప్రైమరీ, పీఎం శ్రీ విద్య అంగన్వాడీలకే కేటాయించాలని కోరుతూ ప్రజాస్వామ్య పద్ధతిలో మంత్రుల ఇండ్ల ముట్టడి పిలుపులో భాగంగా సీఎం ఇంటిని ముట్టడించామన్నారు. పోలీసులు మధ్యలోనే అడ్డుకొని మహిళలని కూడా చూడకుండా మగ పోలీసులు ఎక్కడపడితే అక్కడ చేతులు వేసి చట్టాన్ని తుంగలో తొక్కి ఇష్టానుసారంగా వ్యవహరించి తమపై కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనతోపాటు సీఐటీయూ వికారాబాద్‌ జిల్లా కార్యదర్శి రామకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు బుస్స చంద్రయ్య, నాయకులు నర్సమ్మ, సీఐటీయూ నారాయణపేట జిల్లా కార్యదర్శి బలరాంపై కేసులు నమోదు చేశారన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు. ఒకవైపు బతుకమ్మ సంబురాలు నిర్వహిస్తూనే.. మహిళలను పండగ జరుపుకోకుండా కేసులు చుట్టూ తిప్పడం అత్యంత దుర్మార్గమైన చర్య అని అన్నారు. సీఎం జోక్యం చేసుకుని వెంటనే తమపై పెట్టిన కేసులను కొట్టివేయాలని కోరారు. ప్రీ ప్రైమరీ పీఎం శ్రీ విద్య అంగన్వాడీలకే కేటాయించాలని, ప్రభుత్వం ముందు పెట్టిన 18 డిమాండ్లను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ విధానం మారకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి రామకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు బుస్స చంద్రయ్య. నాయకులు నర్సమ్మ, నారాయణపేట జిల్లా కార్యదర్శి బలరాం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -