మంత్రి దామోదర రాజనర్సింహ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రభుత్వాస్పత్రుల్లో అన్ని రకాల పోస్టులు భర్తీ చేస్తున్నట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. రెండేండ్లలో 10 వేల పోస్టులు భర్తీ చేశామనీ, మరో 7 వేలకు పైగా పోస్టుల నియామక ప్రక్రియ చివరి దశలో ఉందని ఆయన వెల్లడించారు. సోమవారం శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. మెడికల్ కాలేజీల్లో 1,200 టీచింగ్ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేశామనీ, రెగ్యులర్ ప్రాతిపదికన 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చామనీ, ఏప్రిల్‌లో భర్తీ ప్రక్రియ పూర్తి అవుతుందని తెలిపారు.
తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో 1,616 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీ ప్రక్రియ మరో నెల రోజుల్లో పూర్తి అవుతుందన్నారు. ఇప్పటికే 7 వేలకుపైగా నర్సింగ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేశామని, మరో 2,312 పోస్టుల భర్తీ ప్రక్రియ ఏప్రిల్‌లో పూర్తవుతుందని మంత్రి వెల్లడించారు. 1,500లకు పైగా ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేశామని తెలిపారు. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రయివేటు మెడికల్ షాపులకు అనుమతులు ఇవ్వలేదనీ, అంతకు ముందు ఉన్న వాటిని కోర్టు నుంచి అనుమతి రాగానే తొలగిస్తామని చెప్పారు. తక్కువ ధరలో ఔషధాలు లభించే జనరిక్ మెడికల్ షాపులను ప్రోత్సహిస్తామని మంత్రి వెల్లడించారు.
హామీలన్ని నెరవేరుస్తాం : మంత్రి సీతక్క
హామీలన్నింటిని నెరవేరుస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. సోమవారం శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు. విధులు, నిర్వహణపై సర్పంచ్‌లకు, వార్డు మెంబర్ లకు శిక్షణ ఇచ్చినట్టు ఆమె చెప్పారు. పారిశుద్ధ్య కార్మికులకు రెగ్యులర్‌గా జీతాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నట్టు వెల్లడించారు. బీఆర్‌ఎస్ పాలనలో నెలల తరబడి పారిశుధ్య కార్మికులకు జీతాలు ఇవ్వలేదనీ, కారోబార్లకు ,పారిశుద్ధ్య కార్మికులకు తేడా లేకుండా చేసిందనీ, జీవ్ 51 తెచ్చి కారోబార్లకు అన్యాయం చేసిందని సీతక్క విమర్శించారు. వారు చాలా రోజుల నుంచి పోరాడుతున్న అంశం తమ పరిశీలనలో ఉందనీ, అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ప్రభుత్వాస్పత్రుల్లో అన్ని రకాల పోస్టుల భర్తీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



