– 8 నుంచి 12 వరకు వెరిఫికేషన్
– 12 తర్వాత పది రోజుల్లో ఫైనల్ సెలక్షన్ జాబితా
– ఎంహెచ్‌ఎస్‌ఆర్బీ కార్యదర్శి భూపాల్ అరెస్ట్
– అభ్యర్థుల ఆందోళన…వెంటనే విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్టులకు సంబంధించిన ఫైనల్ లిస్ట్‌ను సెప్టెంబర్ 2న విడుదల చేయనున్నట్టు మెడికల్, హెల్త్ సర్వీసెస్ రిక్రూట్ మెంట్ బోర్డు కార్యదర్శి తెలిపారు. మంగళవారం తెలంగాణ యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) గౌరవాధ్యక్షులు భూపాల్ నేతృత్వంలో ల్యాబ్ టెక్నీషియన్ పరీక్ష రాసిన అభ్యర్థులు ఫైనల్ లిస్ట్ చేయాలంటూ బోర్డు కార్యదర్శికి వినతిపత్రం ఇచ్చేందుకు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వినతిపత్రం తీసుకునేందుకు లోపలికి అనుమతించకపోవడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వచ్చిన అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో ఉండటం, మెడికల్ బోర్డు పనితీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. అప్పటికే రంగంలోకి దిగిన పోలీసులు వారిని నిలువరించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అక్కడే ధర్నాకు బైఠాయించిన భూపాల్‌ను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి వాహనంలోకి ఎక్కించారు. అభ్యర్థులు పోలీసుల కారుకు అడ్డంగా నిలబడి ‘భూపాల్ నాయకత్వం వర్థిల్లాలి…భూపాల్ నాయకత్వం వర్థిల్లాలి.. ‘ అంటూ నినాదాలు చేశారు. అభ్యర్థులు పెద్ద సంఖ్యలో ఉండి పోలీసులను నిలదీశారు. దీంతో అభ్యర్థులకు, పోలీసులకు మధ్య కొద్ది సేపు వాగ్వాదం జరిగింది. ‘పోలీసుల జులుం నశించాలంటూ, తమకు న్యాయం చేయాలంటూ, ఇదేమీ రాజ్యం, ఇదేమి రాజ్యం…దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యమంటూ.. ‘ నినాదాలు చేశారు. దీంతో పోలీసులు భూపాల్‌ను వదిలేశారు. అనంతరం బోర్డు కార్యదర్శి ధర్నాకు వచ్చిన అభ్యర్థుల నుంచి వినతిని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 8 నుంచి 12 వరకు వెరిఫికేషన్ పూర్తి చేసి, మరో పది రోజుల్లో ఫైనల్ సెలక్షన్ లిస్ట్ విడుదల చేస్తామని చెప్పడంతో అభ్యర్థులు ధర్నా విరమించారు. అంతకుముందు ధర్నానుద్దేశించి భూపాల్ మాట్లాడుతూ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2కు సంబంధించి 1,284 పోస్టుల కోసం నోటిఫికేషన్ జారీ చేసి ఏడాది గడిచిందని తెలిపారు. నియామక ప్రక్రియ ఆలస్యం చేస్తుండటం, స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వస్తే మరింత ఆలస్యమవుతుందని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. వారి ఆందోళనను అర్థం చేసుకుని సాధ్యమైనంత తొందరగా నియమకాలను పూర్తి చేయాలని ప్రభుత్వానికి, అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాలకు చెందిన ల్యాబ్ టెక్నీషియన్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.