Sunday, December 28, 2025
E-PAPER
Homeఆటలుఎట్టకేలకు బజ్‌బాల్‌

ఎట్టకేలకు బజ్‌బాల్‌

- Advertisement -

బాక్సింగ్‌ డే టెస్టులో ఇంగ్లాండ్‌ గెలుపు

మెల్‌బోర్న్‌ : 19 టెస్టులు, 15 ఏండ్లు… ఎట్టకేలకు కంగారూ గడ్డపై ఇంగ్లాండ్‌ ఓ టెస్టు విజయం రుచి చూసింది. యాషెస్‌ సిరీస్‌లో 0-3తో ఓటమి పాలైన ఇంగ్లాండ్‌.. నామమాత్రపు చివరి రెండు టెస్టుల్లో తొలి మ్యాచ్‌లో విజయం సాధించింది. మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన బాక్సింగ్‌ డే టెస్టు రెండు రోజుల్లోనే ముగియగా 4 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌ మెరుపు విజయం నమోదు చేసింది. 175 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్‌ 32.2 ఓవర్లలో ఛేదించింది. జాకబ్‌ బెతెల్‌ (40, 46 బంతుల్లో 5 ఫోర్లు), జాక్‌ క్రాలీ (37, 48 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌), బెన్‌ డకెట్‌ (34, 26 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) ఛేదనలో రాణించారు.

ఆసీస్‌ పేసర్లు మిచెల్‌ స్టార్క్‌ (2/55), జై రిచర్డ్‌సన్‌ (2/22), స్కాట్‌ బొలాండ్‌ (2/29) రెండేసి వికెట్లతో మెరిసినా.. ఇంగ్లాండ్‌ బజ్‌బాల్‌ జోరుతో 5.50 రన్‌రేట్‌తో లక్ష్యాన్ని ఛేదించారు. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 34.3 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. ట్రావిశ్‌ హెడ్‌ (46, 67 బంతుల్లో 4 ఫోర్లు), స్టీవ్‌ స్మిత్‌ (24, 39 బంతుల్లో 1 ఫోర్‌) ఆకట్టుకున్నారు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 152 పరుగులు చేయగా.. ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 110 పరుగులకు కుప్పకూలింది. ఇంగ్లాండ్‌ పేసర్‌ జోశ్‌ టంగ్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -