చెక్కు, ఇంటి నిర్మాణానికి మంజూరు పత్రం అందజేసిన కలెక్టర్, ఎస్పీ
మిగతా డిమాండ్లూ నెరవేర్చాలి : ప్రజాసంఘాల నేతల డిమాండ్
నవతెలంగాణ-ఆసిఫాబాద్
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం గెర్రె గ్రామానికి చెందిన శ్రావణి కుటుంబానికి ప్రభుత్వం సహాయం చేసేందుకు ముందుకొచ్చింది. గర్భిణి అయిన శ్రావణి కులదురహంకార హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు ప్రజాసంఘాలు నిరసనలు తెలపడంతో ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం స్పందించి మృతురాలి కుటుంబానికి సాయం చేసేందుకు ముందుకొచ్చాయి. ఈ మేరకు గురువారం కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఎస్పీ కాంతిలాల్ పాటిల్ బాధిత కుటుంబ సభ్యులకు రూ.4,12,500 ప్రొసీడింగ్, ఇందిరమ్మ ఇంటి పథకం కింద రూ.5 లక్షలతో ఇంటి నిర్మాణానికి మంజూరు పత్రం అందించారు.
అదనంగా, పొదుపు మహిళా సంఘం ద్వారా బాధిత కుటుంబానికి రూ.లక్ష చెక్కు రూపంలో అందజేశారు. మృతురాలి చిన్న తమ్ముడు తలండి ప్రసిక్‌ను ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో (నాల్గో తరగతి) చేర్పించినట్టు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. బాధితురాలి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా 100 లేదా నేరుగా పోలీసు లను సంప్రదించాలని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ చెప్పారు. ఈ కార్యక్రమంలో కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, అదనపు కలెక్టర్ డేవిడ్, కాగజ్‌నగర్ డీఎస్పీ వాహిదొద్దీన్, ఆర్డీఓ లోకేశ్వరరావు, డీఆర్‌డీఓ దత్తారావ్, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ రాణా ప్రతాప్, దహెగాం ఎస్‌ఐ విక్రమ్ పాల్గొన్నారు.
ప్రజా సంఘాల పోరాట ఫలితంగానే పరిహారం
ప్రజా సంఘాల దశలవారీ పోరాటం ఫలితంగానే శ్రావణి కుటుంబానికి ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం స్పందించి పరిహారం అందించిందని పలు ప్రజాసంఘాల నాయకులు అన్నారు. గురువారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఇందిరమ్మ ఇల్లు, ఆర్థిక సాయం, స్టడీ పరంగా మాత్రమే డిమాండ్లు నెరవేర్చారన్నారు. 5 ఎకరాల భూమి, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా కోసం ఈనెల 22న ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ కార్యక్రమం చేపడుతున్నామని, ప్రజలు తరలివచ్చి శ్రావణి కుటుంబానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్, డీవైఎఫ్‌ఐ అధ్యక్ష, కార్యదర్శులు గేడం టీకానంద్, గొడిసెల కార్తీక్, ఉపాధ్యక్షుడు దుర్గం నిఖిల్, సీఐఈయూ జిల్లా అధ్యక్షులు రాజేందర్ పాల్గొన్నారు.



