గ్లోబల్ లీడర్స్ ‘ఆశా’లకు కనీస వేతనం కరువు
యాప్‌తో మరింత పని ఒత్తిడి
పారితోషికం లేని పనులతో ఇబ్బందులు
ఈ నెల 26, 27 తేదీల్లో ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర మహాసభలు
ఆరోగ్య సంరక్షణలో ఆరోగ్య కార్యకర్తలది ముఖ్యమైన పాత్ర. కరోనా వంటి విపత్తు సమయంలో ప్రాణాలకు తెగించి వారు చేసిన సేవలు మరువలేనివి. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆశాలను గ్లోబల్ లీడర్స్‌గా గుర్తించింది. అయినా వారు ఎదుర్కొంటున్న సమస్యలు అనేకం. ఆర్థిక భద్రత లేదు. గుర్తింపు లేకపోవడం, పని ప్రదేశంలో ఎదురవుతున్న తదితర సమస్యలు వారిని వెంటాడుతున్నాయి. వేతనాలు పెంచకపోవడంతో పాటు యాప్‌ల పేరుతో మరింత పని ఒత్తిడి పెంచుతున్నారు. పారితోషికం లేని పనులతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు చేస్తున్నారు.
నవతెలంగాణ – మహబూబ్‌నగర్ ప్రాంతీయప్రతినిధి
రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 28వేల మంది ఆశా కార్యకర్తలు ఆరోగ్య కార్యక్తలుగా తమ సేవలను అందిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 4400 మంది ఉండగా, మహబూబ్‌నగర్ జిల్లాలో 800 మంది ఆశాలు ఉన్నారు. టీబీ, షుగర్, మలేరియా, క్షయ, ఎయిడ్స్, డెంగ్యూ వంటి రోగాలను ఎప్పటికప్పుడు గుర్తించి సమీప ప్రాథమిక ఆస్పత్రిలో వైద్యం అందేలా చూస్తారు. బాలింతలు, గర్భిణీలను సైతం ఆస్పత్రికి తీసుకెళ్తారు. అంతేకాదు, ఎక్కడైనా ప్రభుత్వపరంగా సభలు జరిగినా పరీక్షా కేంద్రాలు, జాతరల సందర్భంగా ఏర్పాటు చేసే ప్రాథమిక చికిత్సలకు వెళ్లినా ఎటువంటి పారితోషికం ఉండదు. అలాగే, యాప్‌లో ప్రతి రోజూ వీరు పనితో పాటు రోగుల స్టేటస్, తదితర అంశాలను పెట్టాలి. ఇలా రోజులో విశ్రాంతి లేకుండా 24 గంటలు పనిచేసినా ఉద్యోగ భద్రత లేదు. ఇచ్చే అరకొర వేతనాలతో కుటుంబాలు గడవక అప్పులపాలవుతున్నారు. మారుతున్న జీవన శైలి, వస్తున్న రోగాలతో ఆశాలపై పని భారం తీవ్రమయింది.
రవాణా సౌకర్యం, అవసరమైన వైద్య పరికారాలు సైతం వీరికి అందుబాటులో లేవు. స్థిరమైన గౌరవ వేతనం ఇవ్వాలని వీరు ఏండ్ల తరబడి పోరాటాలు చేస్తున్నా.. పాలకులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆశాలు చెబుతున్నారు. 2020లో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కమ్యూనిటీ కార్యకర్తల హోదాను క్రమబద్ధీకరించాలని సిఫార్సు చేసింది. అయినా ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. అనేక ఉద్యమాల కారణంగా కాస్త వేతనాలు పెంచి ఊరటనిచ్చినా అవి ఆశించిన స్థాయిలో లేవని ఆశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, మహబూబ్‌నగర్ జిల్లాలో తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర మహాసభలు ఈ నెల 26,27 తేదీల్లో జరగనున్నాయి. ఈ మహాసభల్లో ఆశాల సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తారు. ఈ సభల సందర్భంగా 26వ తేదీ జరిగే బహిరంగ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది హాజరు కానున్నారు. అలాగే, మహాసభలకు ప్రతినిధులుగా 500 మంది రానున్నారు.
ఉద్యోగ భద్రత కల్పించాలి : నిర్మల, యూనియన్ సహాయ కార్యదర్శి, మహబూబ్‌నగర్ జిల్లా
మేము ఆశాలుగా చిత్తశుద్ధితో విధులు నిర్వహిస్తున్నాం. కాని ఇతర ఉద్యోగుల మాదిరి మా జీతం ఎంత అంటే చెప్పుకోలేకపోతున్నాం. పిల్లల చదువులు, బట్టలు, పాలు ఇలా ప్రతి దానికి బయట అప్పులు తెచ్చి కుటుంబాన్ని పోషిస్తున్నాం. ప్రభుత్వం మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి.
కనీస వేతనం ఇవ్వాలి : హైమావతి, యూనియన్ ఉపాధ్యక్షులు, మహబూబ్‌నగర్ జిల్లా
అందరిలాగే మేము ప్రజలకు సేవలు అందిస్తున్నాం. ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా సంపూర్ణంగా సహక రిస్తున్నాం. కానీ మాకు మాత్రం కనీస వేతనం అమలు కావడం లేదు. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలి.
గౌరవ ప్రదమైన వేతనం ఇవ్వాలి : సావిత్రి, ఆశాయూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు, మహబూబ్‌నగర్
ఆశాలతో 24 గంటలు పని చేయించుకుంటూ వేతనంలో మాత్రం వివక్ష చూపుతున్నారు. పారితోషికంతో సంబంధం లేని పనులు చేయమని ఒత్తిడి చేస్తున్నారు. పరిధికి మించి పనులు కేటాయిస్తున్నారు. మాకు సమాజంలో గౌరవప్రదమైన వేతనంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలి.
ఆశాలకు కనీస వేతన చట్టం అమలు చేయాలి : దీప్లానాయక్, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు, మహబూబ్‌నగర్ జిల్లా
గ్రామీణ ప్రాంతాల్లో ఆశాలు శాఖా పరంగా అనేక సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా ఆశాలు 24 గంటలు పనిచేసినా వారికి కనీస వేతన చట్టం అమలు చేయడం లేదు. రూ.9 వేలు ఇస్తే.. వారి కుటుంబాలు ఎలా గడుస్తాయి? ఇప్పటికైనా వారికి కనీస వేతన చట్టం అమలు చేయాలి. విధినిర్వహణలో యూనిఫాం, ష్యూస్‌తో పాటు రవాణా సదుపాయాలు కల్పించి పనిభారం తగ్గించాలి.



