నవతెలంగాణ – హైదరాబాద్ : కేంద్ర హోంమంత్రి అమిత్‌షాపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపి మహువా మొయిత్రాపై ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. స్థానిక నివాసి గోపాల్ సమంటో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా, శనివారం మానా పోలీస్ స్టేషన్‌లో మెయిత్రాపై బిఆర్‌ఎస్ (బిఆర్‌ఎస్) సెక్షన్లు 196,197ల కింద కేసు నమోదు చేసినట్లు ఒక అధికారి పేర్కొన్నారు. గత గురువారం పశ్చిమబెంగాల్‌లోని నాడియా జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలోమహు వా మొయిత్రా మాట్లాడుతూ.. సరిహద్దు భద్రతపై మోడీ ప్రభుత్వం తన బాధ్యతలను విస్మరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే ఆ కార్యక్రమంలో ఆమె అమిత్‌షాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని గోపాల్ సమంటో ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలు రాజ్యాంగవిరుద్ధమని అన్నారు. 1971లో రాయ్‌పూర్‌లోని మానా క్యాంప్ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో బంగ్లాదేశ్ శరణార్థులు స్థిరపడ్డారని, మొయిత్రా ప్రకటన వారిలో భయాన్ని సృష్టించిందని అన్నారు. ఇటువంటి వ్యాఖ్యలు ఆ శరణార్థులపై ఇతర వర్గాల్లో ఆగ్రహాన్ని రేకెత్తించే అవకాశం ఉందని అన్నారు.