Wednesday, February 25, 2026
E-PAPER
Homeక్రైమ్హెచ్‌యూఎల్‌ పరిశ్రమలో అగ్నిప్రమాదం

హెచ్‌యూఎల్‌ పరిశ్రమలో అగ్నిప్రమాదం

- Advertisement -

– మంటలను అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది
– ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఐ ప్రసాద్‌
– రంగారెడ్డి జిల్లా నందిగామలో ఘటన
నవతెలంగాణ-కొత్తూరు

రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని హిందూస్థాన్‌ యూనిలివర్‌ లిమిటెడ్‌(హెచ్‌యూఎల్‌) పరిశ్రమలో బుధవారం అగ్నిప్రమాదం సంభవించింది. పరిశ్రమ ఆవరణలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో కార్మికులు భయాందోళనకు గురయ్యారు. పరిశ్రమలో నిల్వ ఉంచిన వ్యర్థ పదార్థాల్లో ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. గాలి ధాటికి మంటలు వేగంగా వ్యాపించడంతో పరిశ్రమ నిర్వాహకులు వెంటనే అప్రమత్తమై షాద్‌నగర్‌ అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే షాద్‌నగర్‌ ఫైర్‌ స్టేషన్‌ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్‌ ఇంజన్ల సాయంతో శ్రమించి పరిశ్రమలోని ఇతర విభాగాలకు మంటలు వ్యాపించకుండా అదుపు చేశారు. అగ్నిమాపక సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో మంటలు పూర్తిగా ఆరిపోయాయి. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే నందిగామ సీఐ ప్రసాద్‌ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు అదుపులోకి వచ్చిన తీరును పరిశీలించిన ఆయన, ప్రమాదం సంభవించడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పరిశ్రమలో భద్రతా ప్రమాణాల గురించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ ప్రమాదంలో కేవలం నిల్వ ఉన్న చెత్త మాత్రమే దగ్ధమైందని, ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరగలేదని ఫైర్‌ అధికారులు వెల్లడించారు. సకాలంలో స్పందించి ప్రమాదాన్ని నివారించిన అగ్నిమాపక సిబ్బందిని పరిశ్రమ యాజమాన్యం, స్థానికులు ప్రత్యేకంగా అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -