8మంది పేషెంట్లు మృతి షార్ట్ సర్క్యూట్‌తో చెలరేగిన మంటలు
రాజస్థాన్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం
జైపూర్ : రాజస్థాన్‌లోని జపూర్‌లో ఉన్న సవారు మాన్ సింగ్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాగం జరిగింది. ఈ ప్రమాదంలో అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్న ఎనిమిది మంది రోగులు మృతిచెందారు. క్షతగాత్రుల వివరాలు వెల్లడి కాలేదు. స్టోరేజ్ ఏరియాలో మంటలు చెలరేగిన సమయంలో ఐసీయూలో 11 మంది రోగులకు చికిత్స అందిస్తున్నామని డాక్టర్ అనురాగ్ తెలిపారు. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణంగా భావిస్తున్నామని పోలీసులు చెప్పారు.
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం: సీఎం
అగ్నిమాపక సిబ్బంది సుమారు రెండు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. మొదట పొగ అలుముకున్న సమయంలోనే ఆస్పత్రిని సిబ్బందిని హెచ్చరించినా వారు పట్టించుకోలేదని రోగుల తరఫున బంధువులు ఆరోపించారు. మరోవైపు ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మ వెంటనే అక్కడికి చేరుకున్నారు. సవారు మాన్‌సింగ్ ఆస్పత్రిని సందర్శించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం రోగుల కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ఇదిలా ఉండగా ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపించడానికి రాజస్థాన్ ప్రభుత్వం ఆరుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి వైద్య శాఖ కమిషనర్ ఇక్బాల్ ఖాన్ అధ్యక్షత వహించనున్నారు. ఈ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి వివరణాత్మక నివేదికను సమర్పించనుంది.
అగ్ని ప్రమాదంపై ప్రధాని మోడీ ఎక్స్ లో స్పందించారు. రోగులు ప్రాణాలు కోల్పోవడం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
‘ఆస్పత్రి సిబ్బంది నిర్లక్యం వల్లే ప్రమాదం’
ఇదిలా ఉండగా ఈ ప్రమాదంపై రోగుల తరఫున బంధువులు మీడియాతో మాట్లాడారు. ఆస్పత్రిలో వారికి ఎదురైన బాధాకరమైన సంఘటనలను పంచుకున్నారు. ప్రమాద సమయంలో కొంతమంది రోగులను వారి పడకలతో సహా ఆస్పత్రి నుంచి బయటకు తీసుకువచ్చామని తెలిపారు. అలాగే ప్రమాదాన్ని అరికట్టడం, భద్రతా చర్యల్లో తీవ్రమైన లోపాలను వారు బయటపెట్టారు.
ఈ దుర్ఘటనకు సంబంధించి ఆస్పత్రిలో ఉన్న రోగి తరఫున బంధువు ఇలా అన్నారు. ”రాత్రి 11:20 గంటల ప్రాంతంలో పొగ వ్యాపించడం ప్రారంభమైంది. ఇది రోగులకు అసౌకర్యాన్ని కలిగిస్తుందని నేను వైద్యులకు సూచించాను. పొగ తీవ్రమయ్యే సమయానికి, వైద్యులు, కాంపౌండర్లు బయటకు పారిపోయారు. ఆ సమయంలో కేవలం ఐదుగురు రోగులను మాత్రమే బయటకు తరలించారు. ఈ ప్రమాదంలో మా అల్లుడు ప్రాణాలు కోల్పోయాడు.” అని ఆవేదన వ్యక్తం చేశారు.
మరో రోగి బంధువు ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై అసహనం వ్యక్తం చేశారు. ”నా తల్లిని ఐసీయూలో చేర్చాను. మొదట స్పార్క్ వస్తున్నట్టుగా గమనించి వైద్యులకు తెలియజేశాను. కానీ దాన్ని వాళ్లు పట్టించుకోలేదు. అకస్మాత్తుగా పొగ చుట్టుముట్టడంతో అంతా పరుగులు తీశారు. ఆ సమయంలో నాకు సహాయం చేయడానికి ఎవరూ లేరు. నా తల్లి, సోదరుడు లోపల చిక్కుకుపోయారు. అతి కష్టం మీద సోదరుణ్ని రక్షించుకోగలిగాను. కానీ ఇప్పుడు అతని పరిస్థితి విషమంగా ఉంది.” అని తెలిపారు.
కాగా ఆస్పత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంపై జైపుర్ పోలీస్ కమిషనర్ బిజు జార్జ్ జోసెఫ్ స్పందించారు. ”ఈ ప్రమాదానికి సంబంధించి దర్యాప్తులో అగ్నిప్రమాదానికి అసలు కారణం తెలుస్తుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నాం. కానీ పూర్తి దర్యాప్తు జరిగిన తర్వాతే అసలు నిజం బయటపడుతుంది. అగ్ని ప్రమాదంలో ఆరుగరు చనిపోగా, మృతదేహాలను మార్చురీకి తరలించారు. మిగిలిన రోగులను వేరే వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు.” అని చెప్పారు.