హైదరాబాద్ నగరంలోని చార్మినార్ సమీపంలో సందడిగల గుల్జార్ హౌజ్‌లో జరిగిన అగ్ని ప్రమాదం కేవలం ఒక దుర్ఘటన కాదు. అది వ్యవస్థాగత వైఫల్యా లకు, బాధ్యతారాహిత్యానికి, సమాజంలో పాతుకు పోయిన నిర్లక్ష్యపు ధోరణికి నిలువెత్తు నిదర్శనం. ఈ ప్రమాదంలో పదిహేడు మంది మరణించడం, అందులో ఏడేండ్లలోపు పిల్లలు ఉండడం, ఒక గుజరాతీ బనియా కుటుంబానికి చెందిన ముగ్గురు క్షణాల్లో కాలి బూడిదవ్వడం అత్యంత విషాదకరం. వారి కలలు, ఆశలు, జీవితాలు ఆ మంటల్లో కలిసిపోయాయి. ఈ దుర్ఘటన తీవ్రంగా కలచివేస్తోంది. మృతుల పట్ల ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూనే, ఈ ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను మానవీయ కోణంలో విశ్లేషిస్తూ, విమర్శనాత్మక దృష్టితో పరిశీలించాల్సిన సమయమిది.
వార్తాపత్రికలు, న్యూస్‌చానెళ్లు, యూట్యూబ్ వీడియోల్లో చూసిన దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. ఇరుకైన ప్రవేశ ద్వారం, అగ్నికీలలు నలువైపులా వ్యాపి స్తుండగా ప్రాణాల కోసం ఆర్తనాదాలు, సహాయం కోసం నిస్సహాయంగా ఎదురు చూపులు మనసులను కలచివేస్తాయి. ఇది కేవలం ఒక ప్రమాదం కాదు, అనేక తప్పిదాల పరంపర. అనుమతులు లేకుండా నిర్మించిన షాప్ కమ్ రెసిడెన్షియల్ భవనం, షాపు గుండానే రాకపోకలు సాగించే మార్గం, అగ్ని ప్రమాదాలను నివారించే కనీస చర్యలు కూడా లేకపోవడం – ఇవన్నీ బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట.ఇక్కడ భవన నిర్మాణ నిబంధనల ఉల్లంఘనను మాత్రమే చూడడం లేదు. ఒక కుటుంబం భద్రతపై, వారి ప్రాణాలపై చూపిన నిర్లక్ష్యాన్ని కూడా చూస్తున్నాం. జ్యువలరీ, పెరల్స్ వంటి అత్యంత విలువైన వ్యాపారం నిర్వహిస్తున్నా, కనీస భద్రతా చర్యలు తీసుకోకపోవడం వారి ఆలోచనా విధానాన్ని ప్రశ్నిస్తోంది. డబ్బు సంపాదనే పరమావధిగా భావించి, మనుషుల ప్రాణా లకు విలువనివ్వని ఇలాంటి ధోరణి సమాజానికి ఎంత ప్రమా దకరమో ఈ ఘటన తెలియజేస్తోంది.
”జుగాడ్ కి జిందగీ” అనే ఒక రకమైన తాత్కాలిక, నిర్లక్ష్యపు జీవన విధానం సమాజంలో చాలా మందికి అలవాటుగా మారిపోయింది. చట్టాలను, నిబంధనలను పట్టించు కోకుండా, ఏదో ఒక విధంగా తమ పనిని పూర్తి చేసుకోవాలనే ఆలోచన చాలా ప్రమాదకరం. నిబంధనలకు విరుద్ధంగా ఇల్లు నిర్మించడం, సమాజంతో సంబంధం లేకుండా తమ ప్రపంచంలో తాము బతకడం, ప్రమాదాలపై కనీస అవగాహన లేకపోవడం, ప్రభుత్వ వ్యవస్థను తక్కువగా చూడడం వంటివి వారి నిర్లక్ష్యాన్ని తెలియజేస్తున్నాయి. ప్రభుత్వం సరిగా స్పందించలేదని వారు చేసిన వ్యాఖ్య వారి బాధ్యతారాహిత్యాన్ని మరింత స్పష్టం చేస్తోంది. తమ తప్పుల వల్లే ఈ ప్రమాదం జరిగిందని గుర్తించకపోవడం వారి బాధ్యతా యుతమైన నిర్లక్ష్యానికి నిదర్శనం.ప్రమాదం ఎప్పుడూ దురదృ ష్టకరమైనదే. కానీ, ఇది మానవ తప్పిదాల ఫలితం. ప్రాణాలు కోల్పోయిన వారికి ఎక్స్‌గ్రేషియా ఇవ్వడం మానవత్వం దృష్ట్యా మంచిదే అయినా, ఈ ప్రమాదానికి కారణ మైన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. శిక్ష లేకపోతే ఇలాంటి నిర్లక్ష్య పూరిత ధోరణులు కొనసాగుతూనే ఉంటాయి.ఈఒక్క భవనమే కాదు, నగరాలు, పట్టణాల్లో అనేక అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. అది óకారులు కండ్లు మూసు కుని ఉండడం లేదా అవినీతికి పాల్పడుతుండడంతో ఇలాంటి వాటిని అరికట్టలేక పోతున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి.
అగ్ని ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఇండ్లు, షాపింగ్ కాంప్లెక్సులు నిర్మించే టప్పుడు కచ్చితమైన భవన నిర్మాణ నిబంధనలు పాటించాలి. ప్రతి భవనంలో తప్పని సరిగా అగ్నిమాపక వ్యవస్థ ఉండాలి. అత్యవసర నిష్క్రమణ మార్గాలు స్పష్టంగా ఏర్పాటు చేయాలి. ప్రజలకు అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించాలి. అగ్ని ప్రమాదం సంభ వించినప్పుడు ఎలా స్పందించాలో శిక్షణ ఇవ్వాలి. ముఖ్యంగా, ప్రమాదాలు జరిగే అవ కాశం ఉన్న పాత భవనాలు, ఇరుకైన ప్రాంతాల్లోని నిర్మాణాలపై ప్రభుత్వం ప్రత్యేక నిఘా ఉంచాలి. వాటిని క్రమం తప్ప కుండా తనిఖీ చేయాలి. నిబంధనలు ఉల్లంఘిం చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. జరిమానాలు విధించాలి, అవసరమైతే కూల్చి వేయ డానికి కూడా వెనుకాడకూడదు.గుల్జార్ హౌజ్ విషాదం మన కండ్లను తెరిపించాలి. చట్టాలను గౌరవించడం, బాధ్యతాయుతంగా ప్రవర్తించడం మనందరి కర్తవ్యం. ప్రభు త్వం తన బాధ్యతను విస్మరించకుండా, కఠినమైన చర్యలు తీసుకున్నప్పుడే భవిష్యత్తులో ఇలాంటి విషాదాలు జరగకుండా నివారించగలం. బూడిదైన కలలు, వెలుగులేని జీవితాలు మనకు ఒక హెచ్చరికగా నిలవాలి.
మేకల ఎల్లయ్య
9912178129