ఈ నెల 7న పండంటి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి
తల్లీ, బిడ్డ క్షేమం : వైద్యులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో తొలిసారి ఐవీఎఫ్ పద్ధతిలో ఓ మహిళ తన బిడ్డకు జన్మనిచ్చింది. ఆస్పత్రి మాతాశిశు సంరక్షణ కేంద్రం (ఎంసీ హెచ్)లో ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా ప్రసవం చేశారు. తల్లీ, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఆస్పత్రిలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వైద్యులు ఈ వివరాలను వెల్లడించారు. ప్రయివేటు ఆస్పత్రుల్లో రూ.లక్షలు ఖర్చయ్యే ఐవీఎఫ్ చికిత్సను రాష్ట్ర ప్రభుత్వం గాంధీ హాస్పిటల్‌లో ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చిందని తెలిపారు. నగరానికి చెందిన శృతి, శ్రీకాంత్‌కు ఏడేండ్ల క్రితం వివాహమైంది. పిల్లల కోసం పలు ప్రయివేటు ఫెర్టిలిటీ సెంటర్లను ఆశ్రయించగా, డబ్బులు ఖర్చయ్యాయి తప్పితే ఫలితం కన్పించలేదు. ఐయూఐ ప్రయత్నాలతో సన్నిహితుల సూచన మేరకు ఆ దంపతులు 2024 అక్టోబర్‌లో గాంధీ ఆస్పత్రిలో సంతాన సాఫల్య కేంద్రానికి వచ్చారు.
ఇన్‌ఫెర్టిలిటీ పనులు మొదలు పెట్టిన వైద్యులు పలు రకాల వైద్య పరీక్షలు, స్కానింగ్స్‌తో పాటు వైద్యసేవలు, సలహాలు, సూచనలు అందించారు. అయినా ఎలాంటి స్పందన లేకపోవడంతో ప్రయివేటు ఫెర్టిలిటీ సెంటర్‌లో ఇంట్రాయుటెరైన్ ఇన్సెమినేషన్ (ఐయూఐ) ఫెయిలైందని తెలుసుకున్న వైద్యులు ఇన్వెట్రో ఫైక్టలైజేషన్ (ఐవీఎఫ్) చికిత్స అందించారు. గతేడాది మే 2న ఓవీయూఎం, జూన్ 30న ఎఫ్‌ఈటీ జరిగింది. ఈ ప్రయత్నం విజయవంతం కావడంతో ఈ నెల 7న పండంటి శిశువుకు ఆమె జన్మనిచ్చారు. ఆమె బిడ్డకు జన్మనిచ్చే వరకు వైద్యులు నిశితంగా పరిశీలించారు. ఆమెకు ముందస్తు ప్రసవం ప్రారంభం కావడంతో ఈ నెల 7న రాత్రి 10 గంటలకు అత్యవసర ఎల్‌ఎస్‌సీఎస్ జరిగింది. 2 కిలోల బరువున్న ఆడ శిశువు జన్మించింది.
అకాల ప్రసవం దృష్ట్యా పర్యవేక్షణ కోసం శిశువును ఎన్‌ఐసీయూకి తరలించారు. ఆ తర్వాత పీడియాట్రిక్స్ పర్యవేక్షణలో తల్లి వద్ద ఉంచారు. ప్రస్తుతం తల్లీ బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్టు గాంధీ వైద్యులు తెలిపారు. గురువారం తల్లీబిడ్డలను డిశ్చార్జి చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇది తెలుగు రాష్ట్రాల్లోనే ప్రభుత్వ సెక్టార్‌లో ఐవీఎఫ్ ద్వారా విజయవంతమైన మొదటి కేసు కావడం గమనార్హం. కాగా ‘గాంధీ’ ఆస్పత్రి సంతాన సాఫల్య కేంద్రంలో మొత్తం 43 మంది శాంపిల్స్ సేకరించి, 17 మందికి ఐవీఎఫ్ చికిత్స విధానం ప్రారంభించగా ఏడుగురిలో పాజిటివ్ రిజల్ట్ వచ్చినట్టు తెలిసింది.
ఇది శుభ పరిణామం : నరేందర్‌కుమార్
గాంధీ హాస్పిటల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) డాక్టర్ నరేందర్‌కుమార్ మాట్లాడుతూ.. గాంధీ ఐవీఎఫ్‌లో ప్రసవం జరిగిన తల్లీ బిడ్డలిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. ప్రభుత్వ పరిధిలో ఐవీఎఫ్ ప్రారంభం కావడం శుభ పరిణామం అని తెలిపారు. ప్రభుత్వం నాలుగు ఐవీఎఫ్ సెంటర్లను ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ఉందనీ, అందులో భాగంగా 2024లో రెండు సెంటర్లను ప్రారంభించినట్టు చెప్పారు. అక్టోబర్‌లో గాంధీ హాస్పిటల్, డిసెంబర్‌లో ప్లేట్లబుర్జు హాస్పిటల్‌లో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఇలాంటి విజయాలు ప్రభుత్వం, ప్రభుత్వ వైద్యుల మీద నమ్మకాన్ని తీసుకొస్తాయని వారు తెలిపారు.



