బ్రేక్‌ఫాస్ట్ స్కీంకు అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి శ్రీకారం
టీచర్లకు మొబైల్ ఫోన్ల పంపిణీ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
అంగన్వాడీ చిన్నారులకు ఇక నుంచి రెడీ టూ కుక్ఫుడ్ (ఉప్మా, కిచిడీ మిక్స్)ను బ్రేక్‌ఫాస్ట్‌గా రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లోని అసెంబ్లీ కమిటీలో అంగన్వాడీ చిన్నారులకు బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పథకం ప్రారంభోత్సవానికి ఒక మంచి నేపథ్యం ఉందని వ్యాఖ్యానించారు. గతంలో దేశంలో నిరక్షరాస్యతను తగ్గించేందుకు, విద్య, సాగునీరు, వ్యవసాయాభివద్ధికి దేశ తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్‌నెహ్రూ ప్రాధాన్యతనిచ్చారని గుర్తుచేశారు. దేశంలో ప్రస్తుతం ఆహార భద్రత ఉన్నప్పటికీ, పౌష్టికాహారం అందడం లేదన్నారు.
అందుకే ప్రభుత్వం బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుంచే తల్లికి పౌష్టికాహారం అందించే బాధ్యత తీసుకుందని తెలిపారు. ప్రభుత్వం ఎన్ని మంచి ప్రణాళికలు చేసినా అమలు చేయాల్సింది అంగన్వాడీ టీచర్లు మాత్రమేనని చెప్పారు. అందుకే ప్రభుత్వం వారిపై గురుతర బాధ్యత పెట్టిందని చెప్పారు. అంగన్వాడీల్లో చిన్నారులను సొంత బిడ్డల్లా చూసుకుని వారికి పౌష్టికాహారం అందించాలని సూచించారు. సిబ్బందిని ప్రభుత్వం కుటుంబ సభ్యుల్లా భావిస్తున్నదని తెలిపారు. ‘మీ సమస్యలపై ఎప్పటికప్పుడు చర్చిస్తున్నాం. ఏ మాత్రం ఆర్ధిక వెసులుబాటు కలిగినా ముందుగా మీ సమస్యలనే పరిష్కరిస్తామ’ని సీఎం అంగన్వాడీలకు హామీ ఇచ్చారు. అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు.
ఆరేండ్ల లోపు పిల్లలకు పౌష్టికాహారం అందితేనే వారిలో మానసిక ఎదుగుదల ఉంటుందని చెప్పారు. పోష్టికాహారం లేకపోవడం వల్లే ఎక్కువ సమస్యలు వస్తున్నాయని వివరించారు. భవిష్యత్‌లో అవే అనారోగ్య సమస్యలకు దారితీస్తున్నాయని తెలిపారు. అలాంటి పరిస్థితులు రాకుండా ఉండేందుకే ప్రభుత్వం ఇలాంటి పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్లకు సీఎం మొబైల్ ఫోన్లను పంపిణీ చేశారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, ఫుడ్ కార్పొరేషన్ చైర్మెన్ ఫహీం, చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ చైర్పర్సన్ సీతా దయాకర్‌రెడ్డి, మహిళా శిశు సంక్షేమ శాఖ అనితా రామచంద్రన్, శైలజ తదితరులు పాల్గొన్నారు.



