Saturday, August 2, 2025
E-PAPER
Homeఆటలుతొలి రోజు త‌డ‌బాటు

తొలి రోజు త‌డ‌బాటు

- Advertisement -

– ఓవల్‌లో ఆగని వర్షం, వికెట్ల పతనం
– భారత్‌, ఇంగ్లాండ్‌ ఐదో టెస్టు
నవతెలంగాణ-లండన్‌

ఓ వైపు వర్షం, మరో వైపు వికెట్లు. ది ఓవల్‌లో గురువారం పరిస్థితి ఇది. మేఘావృత వాతావరణంలో మొదలైన భారత్‌, ఇంగ్లాండ్‌ ఐదో టెస్టు తొలి రోజు ఆతిథ్య జట్టు పైచేయి సాధించింది!. మూడు సార్లు వర్షం అంతరాయం కలిగించగా.. భారత్‌ మూడు వికెట్లు చేజార్చుకుంది. యశస్వి జైస్వాల్‌ (2), కెఎల్‌ రాహుల్‌ (14, 40 బంతుల్లో 1 ఫోర్‌) సహా కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ (21, 35 బంతుల్లో 4 ఫోర్లు) నిరాశపరిచారు. టాస్‌ నెగ్గి తొలుత బౌలింగ్‌ ఎంచుకున్న ఇంగ్లాండ్‌.. భారత్‌ను కట్టడి చేసే పనిలో పడింది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 4 గంటలకు వర్షంతో ఆట నిలిచే సమయానికి భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 29 ఓవర్లలో 3 వికెట్లకు 85 పరుగులు చేసింది.
ఆ ముగ్గురు నిష్క్రమణ
‘టెండూల్కర్‌-అండర్సన్‌’ ట్రోఫీలో వరుసగా ఐదో సారి టాస్‌ ఓడిన శుభ్‌మన్‌ గిల్‌.. పేసర్లకు అనుకూలించే పచ్చిక పిచ్‌పై తొలుత బ్యాటింగ్‌కు వచ్చాడు. యశస్వి జైస్వాల్‌ (2), కెఎల్‌ రాహుల్‌ (14) ఆచితూచి బ్యాటింగ్‌ చేయగా.. అటిక్సన్‌ వేసిన ఇన్నింగ్స్‌ నాల్గో ఓవర్‌ తొలి బంతికి జైస్వాల్‌ పెవిలియన్‌కు చేరాడు. అటిక్సన్‌ బంతికి జైస్వాల్‌ వికెట్ల ముందు దొరికిపోయాడు. తొలుత అంపైర్‌ ఔట్‌ ఇవ్వలేదు, కానీ ఇంగ్లాండ్‌ డిఆర్‌ఎస్‌కు వెళ్లి యువ ఓపెనర్‌ను సాగనంపింది. ఓ ఎండ్‌లో సావధానంగా రాణిస్తున్న మరో ఓపెనర్‌ కెఎల్‌ రాహుల్‌ (14) డ్రింక్స్‌ విరామం తర్వాత వికెట్‌ కోల్పోయాడు. క్రిస్‌ వోక్స్‌ బంతికి రాహుల్‌ క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. దీంతో 38/2తో టీమ్‌ ఇండియా ఓపెనర్లను చేజార్చుకుంది.
నం.3 బ్యాటర్‌ సాయి సుదర్శన్‌ (28 నాటౌట్‌, 84 బంతుల్లో 4 ఫోర్లు)తో జతకలిసిన కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ (21) మూడో వికెట్‌కు విలువైన భాగస్వామ్యం జోడించాడు. సాయి సుదర్శన్‌, శుభ్‌మన్‌ గిల్‌ ఇన్నింగ్స్‌ను గాడిలో పెడుతున్నారనే తరుణంలో గిల్‌ లేని పరుగుకు వెళ్లి రనౌట్‌గా నిష్క్రమించాడు. అటిక్సన్‌ ఓవర్లో పిచ్‌ స్క్వేర్‌లోనే బంతిని ఆడిన గిల్‌.. అవనసరంగా పరుగుకు ప్రయత్నించాడు. బంతిని అందుకున్న అటిక్సన్‌ నేరుగా డైరెక్ట్‌ త్రోతో గిల్‌ను రనౌట్‌ చేశాడు. సాయి సుదర్శన్‌, కరుణ్‌ నాయర్‌ (0 నాటౌట్‌) క్రీజులో నిలిచారు.
వర్షం అంతరాయం
భారత్‌, ఇంగ్లాండ్‌ ఐదో టెస్టు తొలి రోజు ఆటకు వర్షం నిలకడగా అంతరాయం కలిగించింది. ఉదయం 11 గంటలకు మ్యాచ్‌ ఆరంభం కావాల్సి ఉండగా.. తడి అవుట్‌ఫీల్డ్‌తో ఆలస్యంగా మొదలైంది. భారత్‌ 23 ఓవర్లలో 72/2తో ఉండగా వరుణుడు ఆటంకం కలిగించాడు. ఈ సమయంలో సుమారు గంటకు పైగా ఆట నిలిచింది. భారత్‌ 29 ఓవర్లలో 85/3తో ఉండగా మళ్లీ వర్షం కురిసింది. దీంతో లంచ్‌ సెషన్‌లో మళ్లీ ఆట సాధ్యపడలేదు.
పచ్చిక పిచ్‌
ది ఓవల్‌లో ఐదో టెస్టుకు పచ్చిక పిచ్‌ సిద్ధం చేశారు. పిచ్‌పై 8మీమీ పచ్చిక ఉండగా.. ఇంగ్లాండ్‌ పేసర్లు కొత్త డ్యూక్‌ బాల్‌తో దాడి చేశారు. చివరి రెండు రోజుల్లోనూ వర్షం సూచనలు, పిచ్‌పై పచ్చిక ఉండటంతో ఇరు జట్ల పేసర్లు వికెట్ల పండుగ చేసుకోనున్నారు. పేస్‌ స్వర్గధామ పిచ్‌పై ఇంగ్లాండ్‌ స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌ లేకుండా బరిలోకి దిగగా.. భారత్‌ ఇద్దరు స్పిన్‌ ఆల్‌రౌండర్లను తుది జట్టులోకి తీసుకుంది.
అర్ష్‌దీప్‌, కుల్‌దీప్‌కు నో
యువ పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌, చైనామన్‌ స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌కు మళ్లీ నిరాశే ఎదురైంది. జశ్‌ప్రీత్‌ బుమ్రా పని భారంతో విశ్రాంతి తీసుకోగా.. అతడి స్థానంలో ఆకాశ్‌ దీప్‌ బరిలోకి దిగాడు. మాంచెస్టర్‌లో యువ పేసర్‌ అన్షుల్‌ కంబోజ్‌ బరిలో నిలువగా.. అతడి స్థానంలో ప్రసిద్‌ కృష్ణకు అవకాశం లభించింది. ప్రసిద్‌ కృష్ణ తొలి రెండు టెస్టుల్లో ఆడినా దారుణంగా విఫలమయ్యాడు. అర్ష్‌దీప్‌ సింగ్‌కు అరంగేట్ర అవకాశం ఇవ్వాలని మాజీలు సూచించినా.. జట్టు మేనేజ్‌మెంట్‌ భిన్నమైన నిర్ణయం తీసుకుంది. స్పెషలిస్ట్‌ కుల్‌దీప్‌ యాదవ్‌కు వరుసగా ఐదో టెస్టులో నిరాశే ఎదురైంది. పేస్‌ ఆల్‌రౌండర్‌ శార్దుల్‌ ఠాకూర్‌ స్థానంలో బ్యాటర్‌ కరుణ్‌ నాయర్‌ తుది జట్టులో నిలిచాడు. నం.3 స్థానంలో మరోసారి సాయి సుదర్శన్‌ అవకాశం దక్కించుకున్నాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -