– చెల్లెమ్మ కవిత ప్రశ్నలకు జవాబు చెప్పు ? : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
నవతెలంగాణ- దేవరకొండ
”ముందు మీ ఇంటిని చక్కబెట్టుకో.. చెల్లెమ్మ కవిత అడిగే ప్రశ్నలకు కేటీఆర్.. కల్వకుంట్ల ఇంటికి గుంటనక్క హరీశ్ అన్న కవిత మాటలకు, ప్రజానీకానికి జవాబు చెప్పండి.. ఆ తరువాత కాంగ్రెస్‌ను ప్రశ్నించండి..” అని ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి, నల్లగొండ పార్లమెంట్ మున్సిపల్ ఎన్నికల ఇన్‌చార్జి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. నల్లగొండ జిల్లా దేవరకొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం మున్సిపాలిటీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. కవిత ప్రశ్నలకు జవాబు చెప్పలేక కాంగ్రెస్ ప్రభుత్వంపై అబద్ధపు ప్రచారాలు చేయడం సరికాదని, అది మానుకోవాలని అన్నారు. కేటీఆర్, హరీశ్‌రావు కడుపులో విషపు కత్తులు పెట్టుకొని ప్రజా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతూ, కూలిపోతుంది.. పడిపోతుందని అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. పదేండ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం ఆర్థికంగా దివాలు తీసిందని, అప్పులకు ప్రతినెలా రూ.6 వేల కోట్లు వడ్డీ చెల్లిస్తున్నట్టు తెలిపారు. అభివృద్ధి సంక్షేమం లక్ష్యంతో ప్రజాపాలనలో మున్సిపాలిటీ ఎన్నికలలో గెలుపొందాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలలో కార్యకర్తలు ఐక్యంగా పనిచేయడం వల్లే నియోజకవర్గంలో 70 శాతం విజయం సాధించినట్టు తెలిపారు. కాంగ్రెస్ అధిష్టానం సర్వే ప్రకారం టికెట్ కేటాయించిన వారిని గెలిపించే బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. దేవరకొండ పట్టణంలో 20 వార్డులలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే ఎమ్మెల్యే బాలు నాయక్‌కు మంచి భవిష్యత్ ఉంటుందని చెప్పారు. వ్యక్తిగతంగా తనకు శత్రువులు లేరని, ఎవరి మీదా ద్వేషం లేదని గెలుపు లక్ష్యంతో సర్వే ప్రకారం పార్టీ టికెట్ ఇస్తుందని ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. తప్పుడు ఆలోచనతో క్షణికావేశంలో తప్పుడు నిర్ణయం తీసుకోవద్దని సూచించారు. పార్టీ నిర్ణయించిన అభ్యర్థులను ఐక్యంగా గెలిపించే విధంగా పనిచేయాలని చెప్పారు. అంతకుముందు వికలాంగులకు మోటార్ సైకిళ్లు, ల్యాప్‌టాప్‌లు, 5జి ఫోన్లు మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రమణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పున్న కైలాస్ నేత, మున్సిపల్ మాజీ చైర్మెన్ ఆలంపల్లి నరసింహ, వైస్ చైర్మెన్ రహత్ అలీ, మాజీ ఎంపీపీ నల్లగాసు జాను యాదవ్, మారుపాకుల సురేష్ గౌడ్ హనుమంతు వెంకటేష్ గౌడ్, దేవేందర్ నాయక్, పున్న వెంకటేశ్వర్లు, యూనుస్, సిరాజ్ ఖాన్, నజీర్ అహ్మద్ పాల్గొన్నారు.
ముందు నీ ఇంటిని చక్కబెట్టుకో
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



