Tuesday, January 13, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఖైదీల పరివర్తనలో దేశంలోనే ఫస్ట్‌

ఖైదీల పరివర్తనలో దేశంలోనే ఫస్ట్‌

- Advertisement -

డ్రగ్స్‌, డ్రంకెన్‌, సైబర్‌ నేరాల్లో పెరిగిన ఖైదీలు
అన్ని జైళ్లలో సీసీ కెమెరాలతో నిఘా పెంచుతాం
జైల్స్‌ పరిశ్రమల ఆదాయంతో ఖైదీల సంక్షేమం
ఏ ఖైదీకీ వీఐపీ సౌకర్యాలు ఉండవు
జైళ్ల శాఖ 2025 వార్షిక నివేదికను విడుదల చేసిన డీజీ సౌమ్యమిశ్రా


నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
”ఖైదీలను సంస్కరించడంలో దేశంలోనే రాష్ట్ర జైళ్ల శాఖ అగ్రస్థానంలో నిలిచింది. ఒకపక్క జైళ్లలో ఖైదీల సంఖ్య పెరిగినా వాటికి అనుగుణంగా మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నాం. అన్ని జైళ్లలో సీసీ కెమెరాలతో నిఘాను పెంచుతున్నాం. జైళ్లలో వీఐపీ ఖైదీలంటూ ఎవరూ ఉండరు. జైలు పరిశ్రమల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఖైదీల సంక్షేమానికే ఉపయోగిస్తున్నాం. త్వరలోనే వరంగల్‌ హైటెక్‌ జైలు అందుబాటులోకి వస్తుంది” రాష్ట్ర జైళ్ల శాఖ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ సౌమ్యమిశ్రా వెల్లడించారు.

సోమవారం చంచల్‌గూడలోని సికా కాన్ఫరెన్స్‌ హాల్‌లో జైళ్ల శాఖ 2025 వార్షిక నివేదికను మీడియా సమావేశంలో ఆమె విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… జైళ్లలో ఖైదీల సంక్షేమానికి, వారిలో పరివర్తనను తీసుకురావడానికి పలు స్కీమ్‌లను అమలు చేస్తున్నామనీ, వాటి ద్వారా వారి ఆదాయం కూడా పెరిగే అవకాశాలు ఏర్పడుతున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా గతేడాది 2025లో తాము సాధించిన అభివృద్ధి గురించి ఆమె అనేక వివరాలు వెల్లడించారు. ఈ విలేకరుల సమావేశంలో జైళ్ల ఐజీ రాజేశ్‌, డీఐజీలు సంపత్‌, డాక్టర్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

ఖైదీల సంఖ్యలో పెరుగుదల
డీజీ సౌమ్య మిశ్రా వెల్లడించిన వివరాల ప్రకారం… 2024తో పోలిస్తే 2025లో అన్ని రకాల నేరాల విభాగాల్లో జైళ్లకు వచ్చే ఖైదీల సంఖ్య పెరిగింది. సైబర్‌ నేరాలు (135.6 శాతం), డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు (152 శాతం) అత్యధిక పెరుగుదల నమోదు చేశాయి. పోక్సో కేసులు 11.36 శాతం, ఎన్‌డీపీఎస్‌ కేసులు 11.6 శాతం, హత్య కేసులు 18.3 శాతం, మహిళలపై నేరాలు 5.23 శాతం పెరిగాయి. అయితే, విదేశీ ఖైదీల సంఖ్య తగ్గడం గమనార్హం. 18-30 ఏండ్ల వయసు గల ఖైదీలే అత్యధికంగా జైళ్లకు వస్తుండటం ఆందోళనకరం. ఈ వయసు వర్గంలో 13.31 శాతం పెరుగుదల నమోదైంది.

డిజిటల్‌ మార్పు
కోర్టు ప్రొడక్షన్‌లో డిజిటల్‌ మార్పు స్పష్టంగా కనిపించింది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఖైదీల కోర్టు హాజరు గణనీయంగా మెరుగుపడింది. పోలీస్‌ ఎస్కార్ట్‌పై ఆధారపడకుండా డిజిటల్‌ విధానం ద్వారా కేసుల విచారణ వేగవంతమైంది. లీగల్‌ ఎయిడ్‌, జైల్‌ అదాలత్‌లతో మంచి ఫలితాలు వచ్చాయి. 155 మంది లీగల్‌ ఎయిడ్‌ అడ్వొకేట్లు, 47 మంది పారా లీగల్‌ వాలంటీర్లు, 44 జైల్‌ అదాలత్‌లు, 985 మంది ఖైదీల విడుదల జరిగింది. పేద ఖైదీలకు బెయిల్‌ సహాయంలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నాం. కేంద్ర ప్రభుత్వ ‘పేద ఖైదీలకు మద్దతు పథకం’ అమలులో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఈ ఏడాది 18 మంది ఖైదీలు ఈ పథకం ద్వారా విడుదలయ్యారు.జైళ్లలో సమగ్ర వైద్య సేవలు అందుతున్నాయి. విద్యతో మార్పు కనిపించింది. 23,220 మంది ఖైదీలు అక్షరాస్యులుగా ఉన్నారు.

స్కిల్‌ ట్రైనింగ్‌.. ఉపాధి.. టెక్నాలజీ అప్‌గ్రేడ్‌
స్కిల్‌ డెవలప్‌మెంట్‌… పునరావాసానికి పునాదిగా నిలిచింది. 5,856 మంది ఖైదీల్లో 4,615 మందికి (79 శాతం) స్కిల్‌ ట్రైనింగ్‌ లభించింది. వెల్డింగ్‌, టైలరింగ్‌, బేకరీ, బ్యూటిషియన్‌, బీ కీపింగ్‌ వంటి 28 రకాల వృత్తుల్లో శిక్షణ పొందారు. ఇక ఆరు జైళ్లలో అపికల్చర్‌ యూనిట్లు ఉన్నాయి. ఇందులో 489 కిలోల తేనె ఉత్పత్తి జరిగింది. 150 మంది ఖైదీలకు శిక్షణ లభించింది. మానసిక ఆరోగ్యం, మహిళా ఖైదీలకు కౌన్సెలింగ్‌, డీ-అడిక్షన్‌ సెంటర్లతో చక్కని ఫలితాలు వచ్చాయి. ఫ్యూయల్‌ అవుట్‌లెట్లతో ఉపాధి లభించింది. 32 పెట్రోల్‌ బంకులలో 57 సెమీ ఓపెన్‌ ఖైదీలు,165 విడుదలైన ఖైదీలు ఉపాధి పొందుతున్నారు. రూ. 2.5 కోట్లతో టెక్నాలజీ అప్‌గ్రేడ్‌ జరిగింది. డ్రోన్లు, బాడీ వోర్న్‌ కెమెరాలు, బయోమెట్రిక్‌ హాజరు, స్వాగతం పోర్టల్‌, జైళ్లకు కియోస్క్‌ మెషీన్లు సమకూర్చటం జరిగింది.

గణాంకాలు ఇలా..
-ఈ ఏడాది జైలుల్లో ఖైదీల అడ్మిషన్లలో 11.8 శాతం పెరుగుదల నమోదైంది.
-అందులో ఎక్కువగా సైబర్‌ నేరాలు, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులలో అధికంగా ఉన్నారు.
-సివిల్‌ కేసుల్లో 20 మందికి ఖైదీలు వచ్చారు.
-సైబర్‌ నేరాల్లో 2024 లో 757 మంది ఖైదీలు.. 2025లో 1,784 మంది ఖైదీలు..
-డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో 2024లో 1,124 మంది ఖైదీలు.. 2025లో 2,833 మంది ఖైదీలు..
-మాదకద్రవ్యాల కేసులో 2024లో 6,311 మంది ఖైదీలు ఉండగా 2025లో 7,040 మంది ఖైదీలు ఉన్నారు.
-పోక్సో చట్టం కేసులో 2024 3,750 మంది ఖైదీలు ఉండగా, 2025 లో 4,176 ఖైదీలు ఉన్నారు.
-ఆస్తి నేరాల కేసులో 2024లో 7,679 మంది ఖైదీలు ఉండగా, 2025లో 7,792 మంది ఖైదీలు ఉన్నారు. సైబర్‌ నేరాలు,డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు రెట్టింపు అయ్యాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -