292 జెడ్పీటీసీ, 2963 ఎంపీటీసీలకు ఎన్నికలు
నామినేషన్ల స్వీకరణకు మూడు రోజులు గడువు
23న పోలింగ్
కలెక్టర్లకు ఎస్‌ఈసీ ఆదేశాలు
ఐనా…ఎలక్షన్లు డౌటే!
కోర్టు తీర్పే ఫైనల్
న్యాయ నిపుణులతో ఎన్నికల సంఘం సుదీర్ఘ చర్చలు
ఎన్నికల్లో పోటీకి ఆశావహుల సందిగ్ధం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (ఎంపీటీసీ), జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (జెడ్పీటీసీ) తొలి విడత ఎన్నికల నోటిఫికేషన్ గురువారం జారీ కానున్నది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఇప్పటికే విడుదల చేసిన విషయం తెలిసిందే. అన్ని జిల్లాల్లో గురువారం ఉదయం 10.30 గంటలకు ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని కలెక్టర్లను ఆదేశించింది. తొలి విడతతో 53 రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 292 జెడ్పీటీసీ, 2,963 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. నోటిఫికేషన్‌లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తారని ఎస్‌ఈసీ ఇప్పటికే ప్రకటించింది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018 రూల్ 5 ప్రకారం ఎంపీపీ, జెడ్పీల వారీగా రిటర్నింగ్ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. నోటిఫికేషన్ వెలువడిన అనంతరం అన్ని జిల్లాల్లో రిటర్నింగ్ అధికారులు ఈ నెల 11వ తేదీ వరకు ఉదయం 10:30 గంటల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు.
12వ తేదీ నామినేషన్ల పరిశీలన ఉంటుంది. అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు అర్హత నామినేషన్లను ధ్రువీకరించి ప్రాథమిక జాబితా విడుదల చేస్తారు. అనర్హతకు గురైన వారి నామినేషన్లపై అప్పీళ్లను 13వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు స్వీకరిస్తారు. 14న వాటిని మరోసారి పరిశీలిస్తారు. 15వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంఉటంది. అనంతరం పోటీలో ఉండే అభ్యర్థుల జాబితాను రిటర్నింగ్ అధికారి ప్రకటిస్తారు. ఈ నెల 23వ తేదీ ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 5 గంటల వరకు లైన్‌లో ఉన్నవారందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. సాంకేతిక, రాజకీయ, ఇతర కారణాలతో అనివార్యంగా పోలింగ్ అగిపోయినా, అభ్యంతరాలు వ్యక్తమైనా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల వారీగా రాష్ట్ర ఎన్నికల సంఘం పరిశీలించి రీ పోలింగ్‌పై నిర్ణయం తీసుకుంటుంది. నవంబర్ 11వ తేదీ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అదే రోజు ఎన్నికల అధికారులు విజేతలను ప్రకటిస్తారు.
సందిగ్ధతే…
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. గురువారం కూడా దీనిపై వాదనలు జరగనున్నాయి. ఇంప్లీడ్ పిటీషన్లు పెరుగుతున్నాయి. మరోవైపు 2011 జనాభా లెక్కల ప్రకారం కాకుండా 2024 కులగణన సర్వే డేటా ప్రకారం తమకూ ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు పెంచాలనే పిటిషన్లు దాఖలు కావడం వంటి తాజా పరిణామాలతో కోర్టు తీర్పు మరింత ఆలస్యమయ్యే అవకాశముందనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలపై సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే తొలి విడత నోటిఫికేషన్ విడుదలపై హైకోర్టు ఎలాంటి అభ్యంతరాలు చెప్పని విషయం గమనార్హం.
గురువారం హైకోర్టులో వాదనల తర్వాత తీర్పు ఇస్తారా..రిజర్వు చేస్తారా అనేదానిపైనా చర్చలు జరుగుతున్నాయి. రాజకీయ పార్టీలు ఈ పరిణామాల్ని ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం, ప్రభుత్వం న్యాయనిపుణులతో నిరంతరం చర్చలు జరుపుతున్నాయి. తీర్పు సానుకూలమైనా, వ్యతిరేకమైనా ఎన్నికల నిర్వహణను ఆపకూడదని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. అయితే మహారాష్ట్రలో మాదిరిగా ఫలితాలు వచ్చాక ఎన్నిక చెల్లదని కోర్టు తీర్పునిస్తే తమ పరిస్థితి ఏంటనే సందిగ్ధత పోటీచేసే అభ్యర్థుల్లో కనిపిస్తోంది.
