Tuesday, March 31, 2026
E-PAPER
Homeజాతీయంరేపటి నుంచి తొలి దశ జనగణన

రేపటి నుంచి తొలి దశ జనగణన

- Advertisement -

రెండో దశలో కుల గణన
న్యూఢిల్లీ :
వచ్చే ఏడాది చేపట్టనున్న జన గణన కార్యకలాపాలు ముందస్తు దశలో వున్నాయని రిజిస్ట్రార్‌ జనరల్‌, భారత జన గణన కమిషనర్‌ మృత్యుంజయ్‌ కుమార్‌ నారాయణ్‌ సోమవారం తెలిపారు. మొదటి దశ జనగణనకు క్షేత్ర స్థాయిలో కార్యకలాపాలు ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి కొన్ని రాష్ట్రాల్లో ప్రారంభం కానున్నాయని ఆయన చెప్పారు. 2027 జనగణన రెండు దశల్లో నిర్వహించనున్నామని తెలిపారు. ఈసారి గణన డిజిటల్‌గా నిర్వహించబడుతుందన్నారు. తుది గణన దశకు తొలి దశ ఒక ఫ్రేమ్‌వర్క్‌గా పనిచేస్తుంది. ఈ ప్రక్రియలో 31లక్షల ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లు పాల్గొంటారు. లక్షమందికి పైగా జనగణన సిబ్బంది వుంటారు. అదనంగా ఈసారి ప్రజలు తమకు తాము వివరాలను నమోదు చేసుకోవచ్చు. దేశంలో నివసించే వారికే ఈ స్వీయ నమోదు అందుబాటులో వుంటుంది.
రెండో దశకు ప్రశ్నలు కొద్ది మాసాల్లో నోటిఫై చేస్తామని నారాయణ్‌ తెలిపారు. ఈ దశలో కుల గణన కూడా వుంటుంది. క్యాబినెట్‌ ఇందుకు ఆమోద ముద్ర వేసింది. అయితే ఈ కులగణనకు అనుసరించే పద్దతులేమిటనే విషయం ఇంకా ఖరారు కాలేదు. రెండో దశలో మతాన్ని కూడా లెక్కిస్తారు.
డేటా సేకరించేందుకు ఎన్యూమరేటర్లు వ్యక్తిగత మొబైల్‌ ఫోన్లు ఉపయోగించాల్సి వుంటుందని నారాయణ్‌ చెప్పారు. 16 భాషల్లో స్వీయనమోదు పోర్టల్‌ అందుబాటులో వుంటుంది. ఇందుకు గానూ 16 సంఖ్యల ఐడిని రూపొందిస్తారు. ఎన్యూమరేటర్‌ మన ఇంటికి వచ్చినపుడు ఆ ఐడిని వారికి ఇస్తే, ఆ సమాచారాన్ని వారు పరిశీలిస్తారు. పైగా, జన గణన సమయంలో ఎవరూ ఎలాంటి పత్రాలు లేదా సాక్ష్యాధారాలు అందించనవసరం లేదని నారాయణ్‌ తెలిపారు.
జనగణన డేటా చాలా గోప్యంగా వుంచబడుతుందని, ఎవరితోనూ షేర్‌ చేసుకునేది లేదని నారాయణ్‌ తెలిపారు. ప్రజలు తమ డేటాను వాస్తవికంగా, నిజాయితీగా షేర్‌ చేసుకోవడం తప్పనిసరని అన్నారు. జనగణన సమయంలో అందచేసిన డేటాపై దర్యాప్తుకు ఎలాంటి అవకాశం లేదన్నారు. 2011 తర్వాత జరుగుతున్న మొదటి జన గణన ఇది. 2021లో జరగాల్సి వున్నా ఈ ప్రక్రియలో జాప్యం జరిగింది. అంతకుముందు కొవిడ్‌ కారణంగా నిలిచింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -