పోలింగ్‌కు సర్వం సిద్ధం
3,834 పంచాయతీలు, 27,628 వార్డుల్లో ఎన్నికలు
3,461 పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్.. రూరల్ ఏరియాల్లో వీడియోగ్రఫీ
నిబంధనల ప్రకారమే సర్పంచ్ ఏకగ్రీవాలు
ఫిర్యాదులపై విచారణ తర్వాతే నిర్దారించాం
నామినేషన్లు దాఖలు కాని గ్రామాల్లో మూడో దశ తర్వాత నిర్ణయం
సీఎం రేవంత్‌రెడ్డి పై వచ్చిన ఫిర్యాదును పరిశీలిస్తున్నాం
ఎన్నికల్లో స్వచ్ఛందంగా పాల్గొనండి
ఓటర్లకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని పిలుపు
అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు
50 వేల మంది సివిల్ పోలీసులు, 60 ప్లాటూన్ల రిజర్వ్ దళాలు
ఇప్పటి వరకు రూ. 9.2 కోట్ల నగదు సీజ్, 31,425 మంది బైండోవర్
లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీపీ మహేశ్ భగవత్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల్లో నేడు మొదటి విడత పోరు జరగనుంది. 189 మండలాల్లో జరగనున్న సర్పంచ్ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నేడు జరగనున్న మొదటి విడత పోలింగ్ ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను ఆమె వెల్లడించారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్, ఆ తర్వాత మధ్యాహ్నం 2గంటల నుంచి కౌంటింగ్ ఉంటుందని తెలిపారు. గురువారం సాయంత్రం ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తామనీ, వీలు కాకుంటే శుక్రవారం పూర్తి చేస్తామని అన్నారు. ఇప్పటికే అబ్జర్వర్లు, మైక్రో అబ్జర్వర్ల నియామకం జరిగిందని తెలిపారు. ఓటర్ స్లిప్‌ల పంపిణీ, సిబ్బందికి శిక్షణ పూర్తయ్యిందని ఆమె పేర్కొన్నారు. 56,19,430 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని అన్నారు.
ఇందులో 27,41,070 మంది పురుష ఓటర్లు, 28,78,159 మంది మహిళా ఓటర్లు, 201 మంది ఇతరులు ఉన్నారని వివరించారు. 31 జిల్లాల్లో 37,562 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రతీ పోలింగ్ స్టేషన్ వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణకు 3,591 మంది రిటర్నింగ్ అధికారులను, 93,905 మంది ఇతర సిబ్బందిని నియమించినట్టు వివరించారు. ఓటు వేసే వారు తమ ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ తదితర 18 రకాల ఐడీ కార్డులలో ఏదైనా కేంద్రానికి తీసుకొచ్చేందుకు అనుమతించినట్టు తెలిపారు. ఎన్నికలు జరుగుతున్న జిల్లాల్లో కలెక్టర్లకు మెజిస్ట్రీయల్ అధికారాలలిస్తూ ఆదేశాలు జారీ చేసినట్టు కమిషనర్ రాణి కుముదిని తెలిపారు. పోలింగ్‌లో స్వచ్ఛందంగా పాల్గొనాలని ఆమె ఓటర్లకు పిలుపునిచ్చారు.
నిబంధనల ప్రకారమే సర్పంచ్, వార్డు సభ్యుల ఏకగ్రీవాలు
మూడు విడతల్లో జరిగిన సర్పంచ్, వార్డు మెంబర్ల ఏకగ్రీవాలన్నీ నిబంధనల ప్రకారమే జరిగాయని రాణి కుముదిని తెలిపారు. మూడు విడతల్లో 1204 సర్పంచ్, 25,551 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయని చెప్పారు. ఏకగ్రీవాల్లో వేలం పాటల నిర్వహణ, దాడులు, దౌర్జన్యాలపై వస్తున్న వార్తలను ఆమె కొట్టి పారేశారు. ఏకగ్రీవాలు అయిన చోట నామినేషన్లు ఉప సంహరించుకున్న వారి నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకున్నామని గుర్తు చేశారు. కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనలపై వచ్చిన ఫిర్యాదులపై కలెక్టర్, ఆర్డీవో స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకున్నారని తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన ఫిర్యాదును పరిశీలిస్తున్నామని చెప్పారు. ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎంసీసీ కమిటీకి ఫిర్యాదును పంపామనీ, కమిటీ నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. రెండు సంవత్సరాల ప్రజా పాలన ఉత్సవాల కోసం కాంగ్రెస్ పార్టీ వినతి మేరకు అనుమతిచ్చామని చెప్పారు. పీఎం నరేంద్రమోడీ మన్‌కీ బాత్ విషయంలోనూ తాము అనుమతిచ్చామని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు విడతల్లో జరిగిన ఏకగ్రీవాల్లో ఒకటీ, రెండు చోట్ల చిన్న చిన్న సంఘటనలు జరిగాయనీ, వాటిపై చట్టపరంగా చర్యలు తీసుకున్నామని ఆమె స్పష్టం చేశారు.
రూ.9.2 కోట్ల నగదు స్వాధీనం: డీజీపీ మహేశ్‌భగవత్
గ్రామపంచాయతీ ఎన్నికల కోడ్ అమలైన నవంబర్ 25 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.9.2 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నామని లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీపీ మహేశ్ భగవత్ తెలిపారు. రూ.2.5 కోట్ల విలువైన మత్తు పదార్థాలు, రూ.3కోట్ల విలువైన మద్యం సీజ్ చేశామని చెప్పారు. 12,15,500 విలువ చేసే బంగారు ఆభరణాలు, రూ.64,15,350 విలువ చేసే ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నామని ఆమె వివరించారు. ఇప్పటి వరకు 3,214 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామనీ, 31,428 మందిని బైండోవర్ చేసినట్టు ఆయన వివరించారు. మొదటి విడతలో అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. 50 వేల మంది సివిల్, 60 ప్లాటూన్ల రిజర్వ్ దళాలను బందోబస్తు కోసం నియమించినట్టు తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని మహేశ్ భగవత్ వివరించారు.
జిల్లా కలెక్టర్లకు వెబ్ కాస్టింగ్ లాగిన్
రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత ఎన్నికలు జరుగుతున్న 3,489 పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నారు. దీన్ని సెంట్రలైజ్డ్ చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు లాగిన్ పాస్వర్డ్ ఇచ్చింది. ఏఏ పోలింగ్ స్టేషన్లో ఏం జరుగుతుందో వీరు తమ లాగిన్ ద్వారా ఎప్పటికప్పుడు సమీక్షించే అవకాశం ఉంటుంది. ఎక్కడైనా పోలింగ్, ఇబ్బందులు, ఇతర శాంతి భద్రతల సమస్య తలెత్తినప్పుడు తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకుంటారు. నెట్ సౌకర్యం లేని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భద్రాచలం లాంటి మారు మూల ప్రాంతాల్లో లోకల్ వీడియో రికార్డింగ్ ఏర్పాటు చేశారు. అలాగే ఫిర్యాదుల కోసం 92400212455 టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు.




