నేటి నుంచి వెస్టిండీస్‌తో తొలి టెస్ట్ ఉదయం 9.00గం.ల నుంచి
అహ్మదాబాద్: ఇంగ్లండ్ పర్యటనలో అదరగొట్టిన టీమిండియా టెస్ట్ జట్టు.. స్వదేశంలో వెస్టిండీస్‌తో సిరీస్‌కు సిద్ధమైంది. భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ గురువారం నుంచి ప్రారంభం కానుంది. తొలిటెస్ట్‌కు అహ్మదాబాద్, రెండో టెస్ట్ ఢిల్లీలో జరగనున్నాయి. ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన జట్టునే వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్‌కు టీమిండియా సిద్ధమైంది. టెస్ట్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌కు స్వదేశంలో ఇదే తొలి పరీక్ష. డబ్ల్యుటిసి పాయింట్లను దృష్టిలో ఉంచుకొని టీమిండియా ఈ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాల్సి ఉంది. మరోవైపు టెస్టుల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న విండీస్ జట్టుకు ఈ సిరీస్ కత్తిమీద సాములాంటిదే. ఆసియాఖండ పిచ్‌లు స్పిన్‌కు స్వర్గధామం కావడంతో ఆ జట్టు బ్యాటర్లు క్రీజ్‌లో నిలదొక్కుకోవాలంటే చెమటోడ్చాల్సిందే.
ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా ఐదు టెస్టుల్లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అత్యధికంగా 700కు పైగా పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. అలాగే జైస్వాల్, కెఎల్ రాహుల్, సాయి సుదర్శన్ ఫామ్‌లో ఉండడం భారత్‌కు కలిసిరానుంది. ఆల్‌రౌండర్లు జడేజా, సుందర్, నితీశ్‌రెడ్డితోపాటు పేసర్లు బుమ్రా, సిరాజ్ బౌలింగ్‌లో చెలరేగితే విండీస్ బ్యాటర్లు పెవీలియన్‌కు క్యూ కట్టాల్సిందే. ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2తో సమం చేసిన ఉత్సాహంతో టీమిండియా ఈ సిరీస్‌కు సిద్ధం కాగా.. విండీస్ జట్టు పసికూన నేపాల్ చేతిలో టి20 సిరీస్‌ను చేజార్చుకొన్న ఒత్తిడిలో ఉంది. రెండో, చివరి టెస్ట్ ఢిల్లీ వేదికగా 10నుంచి ప్రారంభం కానుంది.
జట్లు(అంచనా)
ఇండియా: గిల్(కెప్టెన్), జైస్వాల్, కెఎల్ రాహుల్, సాయి సుదర్శన్, ధృవ్ జురెల్(వికెట్ కీపర్), జడేజా(వైస్ కెప్టెన్), సుందర్, నితీశ్‌రెడ్డి, అక్షర్/కుల్దీప్, బుమ్రా, సిరాజ్.
వెస్టిండీస్: ఛేస్(కెప్టెన్), వర్రికన్(వైస్ కెప్టెన్), ఆండెర్సన్, అథంజె, క్యాంప్‌బెల్, చంద్రపాల్, హోప్(వికెట్ కీపర్), కింగ్, ఫిలిప్, బ్లేడ్స్, పియర్రీ/సీల్స్.