Saturday, July 5, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్ఫిష్ వెంకట్ పరిస్థితి విషమం.. ఆదుకునేందుకు ముందుకొచ్చిన ప్రభాస్

ఫిష్ వెంకట్ పరిస్థితి విషమం.. ఆదుకునేందుకు ముందుకొచ్చిన ప్రభాస్

- Advertisement -

న‌వ‌తెలంగాణ – హైద‌రాబాద్: సినీ నటుడు ఫిష్ వెంకట్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వేళ, ఆయనకు అండగా నిలిచేందుకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ముందుకొచ్చారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వెంకట్ ఆపరేషన్‌కు అవసరమైన ఆర్థిక సాయాన్ని అందిస్తామని ప్రభాస్ బృందం హామీ ఇచ్చింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులు కాస్త ఊరట చెందారు.

కొంతకాలంగా ఫిష్ వెంకట్ ఆరోగ్యం క్షీణించడంతో, ఆయనను బోడుప్పల్‌లోని ఆర్బీఎం ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆయన రెండు కిడ్నీలు విఫలమైనట్లు, గత నాలుగేళ్లుగా డయాలసిస్‌పైనే జీవిస్తున్నట్లు ఆయన కుమార్తె స్రవంతి కన్నీటిపర్యంతమయ్యారు. ప్రస్తుతం వెంకట్ పరిస్థితి విషమంగా ఉందని, వెంటనే కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయాలని వైద్యులు సూచించారని ఆమె తెలిపారు. ఇందుకు సుమారు రూ. 50 లక్షలు ఖర్చవుతుందని, దాతలు ఎవరైనా ఆదుకోవాలని ఆమె మీడియా ద్వారా వేడుకున్నారు.

ఈ విషయం తెలుసుకున్న హీరో ప్రభాస్ బృందం వెంటనే స్పందించింది. ప్రభాస్ అసిస్టెంట్ తమకు ఫోన్ చేశారని, “కిడ్నీ ఇచ్చే దాతను సిద్ధం చేసుకోండి, ఆపరేషన్‌కు అయ్యే ఖర్చు మొత్తం మేం చూసుకుంటాం” అని హామీ ఇచ్చారని స్రవంతి మీడియాకు వెల్లడించారు. ప్రభాస్ చూపిన ఉదారతకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

ప్రస్తుతం తమ కుటుంబం కిడ్నీ దాత కోసం అన్వేషిస్తోందని స్రవంతి చెప్పారు. “నాన్న బ్లడ్ గ్రూప్‌తో నా రక్తం గ్రూప్ మ్యాచ్ కాలేదు. నాన్న తమ్ముడి గ్రూప్ మ్యాచ్ అయినా, ఆయనకు ఆరోగ్య సమస్యలు ఉండటంతో వైద్యులు వద్దన్నారు. దీంతో దాతల కోసం పలు సంస్థలను సంప్రదిస్తున్నాం” అని ఆమె వివరించారు. ఆది, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, డీజే టిల్లు* వంటి అనేక చిత్రాల్లో ఫిష్ వెంకట్ తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన విషయం తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -