Friday, October 17, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసమస్యల 'వల'యంలో మత్స్య కళాశాల

సమస్యల ‘వల’యంలో మత్స్య కళాశాల

- Advertisement -

పాలకుల తీరుతో కళాశాల భవిష్యత్‌ ప్రశ్నార్థకం
సరైన రోడ్డు సౌకర్యం లేదు
60 ఎకరాలలో నాలుగున్నర ఎకరాలే అనువైన భూమి
మిగతాదంతా గుట్టలే.. ఫామ్‌పాండ్స్‌కు అనుకూలించని వైనం
సీడ్‌ తల్లి చేపల పెంపకానికి 20 ఎకరాలు అవసరం
17 మంది ప్రొఫెసర్లకు ఉన్నది 12 మందే
నాలుగు బ్యాచ్‌లు బయటకు వెళ్లినా ఉద్యోగాల్లేవ్‌

నవతెలంగాణ -మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
నీలి విప్లవమే ప్రధాన లక్ష్యంగా మత్స్య సంపదను పెంచి పౌష్టికాహారం అందించడంలో భాగంగా ప్రభుత్వం 2017లో వనపర్తి జిల్లా పెబ్బేరులో మత్స్య కళాశాలను ప్రారంభించింది. ప్రారంభంలోనే సరైన సౌకర్యాలు లేక విద్యార్థులు, ప్రొఫెసర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎనిమిదేండ్ల నుంచి అదే పరిస్థితి. ప్రభుత్వం మారినా సమస్యలు పరిష్కారం కావడం లేదు. కళాశాలకు రహదారి, భూమి ఫెన్సింగ్‌, ఫామ్‌పాండ్స్‌ లేవు.. గుట్టలతో కూడిన భూముల దాకా అనేక సమస్యలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కళాశాలకు ఇచ్చిన 60 ఎకరాల భూమిలో 4.5 ఎకరాలు మాత్రమే అనుకూలంగా ఉంది. మిగతా భూమి అంతా గుట్టలుగా ఉంటుంది. నాలుగేండ్లు కష్టపడి డిగ్రీ పూర్తి చేసినా ఇప్పటివరకూ నోటిఫికేషన్‌ లేక ఒక్కరికీ ఉద్యోగం రాలేదని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

పెబ్బేరు పట్టడానికి వెళ్లి తిరిగి రావాలంటే ప్రయివేటు వాహనాలు నాలుగు కిలోమీటర్లకు రూ.200 చార్జి వసూలు చేస్తుంటారు. వర్షాలు పడితే వాహనాలు రావడానికి రోడ్డు సరిగా లేదు. జూరాల నుంచి వచ్చే ఎడమ కాల్వ బ్రిడ్జి శిథిలావస్థలో ఉంది. తల్లి చేపలను పెంచడానికి ఫామ్‌పాండ్స్‌ కోసం 20 ఎకరాలు అవసరం ఉంటుంది. కానీ గుట్టల వల్ల ఉపయోగంలో లేని పరిస్థితి. చేపల పెంపకానికి అనువైన భూమి లేక విద్యార్థులకు ప్రాక్టికల్స్‌ నిర్వహించలేని పరిస్థితి నెలకొన్నది. ఖమ్మం, కాకినాడకు తీసుకెళ్లి విద్యార్థులకు ప్రాక్టికల్స్‌ చేయిస్తున్నారు. ఈ క్రమంలో ఆ భూమినే కొందరు కబ్జా చేస్తుండగా.. మరికొందరు క్వారీలు నిర్వహించి రాళ్లను తరలిస్తున్నారు.. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు.

కళాశాలలో కోర్సులు
ఆక్వా కల్చర్‌, ఆక్వాటిక్‌ అనిమల్‌ హెల్త్‌ మేనేజ్‌మెంట్‌, ఫిషరీస్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌, ఆక్వాటిక్‌ ఎన్విరాన్‌మెంట్‌, ఫిష్‌ ప్రాసెసింగ్‌ టెక్నాలజీ, ఫిషరీస్‌ ఇంజినీరింగ్‌. ఫిషరీస్‌ ఆక్వా టెన్షన్‌, ఫిషరీస్‌ ఎకానమిక్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌ తదితర కోర్సులు ఉన్నాయి. ఒక్కో విభాగానికి ఇద్దరు ప్రొఫెసర్లు ఉండాలి. మొత్తం 17 మంది ప్రొఫెసర్లకుగాను 15 మంది మాత్రమే ఉన్నారు. ఇందులో ఏడు మంది కాంట్రాక్టు ప్రొఫెసర్లు ఉన్నారు. ఐదుగురు మాత్రమే రెగ్యులర్‌ ప్రొఫెసర్లు విధులు నిర్వహిస్తున్నారు. ఒకరు ఏవో, మరొకరు హెడ్‌, 12 మంది స్కావెంజర్లు, నలుగురు అటెండర్లు పనిచేస్తున్నారు. ఒక విభాగంలో 80 మంది విద్యార్థులు ఉంటే 560 మంది విద్యార్థులు చదువుకోవాలి. వసతుల లేని కారణంగా 81 మంది విద్యార్థులే ప్రస్తుతం చదువుకుంటున్నారు.

కౌన్సెలింగ్‌ తర్వాత కళాశాలలో చేరడం లేదు
విద్యార్థులు అడ్మిషన్‌ సమయంలో పేర్లను నమోదు చేసుకుంటారు. కౌన్సెలింగ్‌ తర్వాత కళాశాలకు రోడ్డు, ఫామ్‌పాండ్స్‌ వసతులు, ప్రొఫెసర్ల కొరత తదితర సమస్యలను దృష్టిలో పెట్టుకొని కళాశాలలో చేరడం లేదు. ముఖ్యంగా కళాశాల నుంచి నాలుగు బ్యాచులు బయటకు వచ్చినా వారికి ఎక్కడా ఇంకా ఉద్యోగాలు రాలేదు. దీంతో విద్యార్థులు ఆ కోర్సులపై ఆసక్తి చూపడం లేదు.

రాళ్లు గుట్టల్లో ఫామ్‌పాండ్స్‌ ఎలా ?
చేపలు పెంపకానికి ఫామ్‌పాండ్స్‌ అవసరం. మత్స్యకళాశాలకు కేటాయించిన స్థలం గుట్టలతో కూడుకున్నది. వాటిని తొలగించాలంటే కోట్లలో ఖర్చవుతుంది. కళాశాల నిర్వహణ ఖర్చుతో కూడుకున్న పని. ఈ పరిస్థితుల్లో భూమిని చదును చేసే అవకాశాలు లేవు. ఫామ్‌పాండ్స్‌ నిర్మించకుండా విద్యార్థులకు ప్రాక్టికల్స్‌ ఎలా నిర్వహించాలో తెలియక ప్రొఫెసర్లు తలలు పట్టుకుంటున్నారు.

ఖాళీల భర్తీ ఎప్పుడు?
మత్స్య కళాశాల నిర్వహణకు సరిపడా ప్రొఫెసర్లు లేరు. ఉమ్మడి రాష్ట్రంలో 2011లో ఒకసారి నోటిఫికేషన్‌ వేశారు. 32 పోస్టులు ఉండేవి. క్రమంగా తగ్గుతున్నాయి. ఉద్యోగ విరమణ చెందిన స్థానంలో కొత్త వారి నియామకం చేపట్టడం లేదు. వెటర్నరీ శాఖలో ఉన్న వారిని ఫిషరీస్‌ కళాశాలకు సిబ్బందిగా నియమించి నడిపిస్తున్నారు. అనుబంధ రంగాల నుంచి నిపుణులను తీసుకున్నప్పటికీ కళాశాలకు సరైన న్యాయం జరగడం లేదు.

సాంకేతిక సమస్యలు
మత్స్య కళాశాలలో సాంకేతిక సమస్యలు అనేకం ఉన్నాయి. ప్రధానంగా విద్యార్థులకు నెట్‌వర్క్‌ సౌకర్యం లేదు. సిగల్స్‌ ఉండవు. ప్రాసెసింగ్‌ యూనిట్లు లేవు. స్టాకు గోదాములు ఉంటే చేప చెడిపోదు. ప్రాసెసింగ్‌ యూనిట్‌లు లేకపోతే మాంసం చెడిపోయి ప్రాణాంతకంగా మారే అవకాశాలున్నాయి.

ప్రత్యామ్నాయ మార్గాలు
మత్స్య కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన వారు ఉద్యోగాలు లేకపోతే ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. చేపల ఫామ్‌పాండ్స్‌ ఏర్పాటు చేసి సీడ్‌ తల్లి చేపలను, మాంసం చేపలను పెంచి ఆదాయం పొందొచ్చు.

ఉద్యోగం వస్తుందని నమ్మించారు
వశిష్ట, డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థి, వికారాబాద్‌ జిల్లా మత్స్య కళాశాలలో డిగ్రీ పూర్తి చేస్తే ఉపాధి అవకాశాలుంటాయన్నారు. 2011 నుంచి ఇప్పటివరకు ఒక్క నోటిఫికేషన్‌ కూడా వేయలేదు. ఇప్పటివరకు మత్స్య కళాశాల నుంచి నాలుగు బ్యాచులు బయటకు వెళ్లాయి. ఏ ఒక్కరికీ ఉద్యోగం రాలేదు.

ప్రాక్టికల్స్‌ కోసం వేరే ప్రాంతానికి..
కళాశాలలో భూమి ఉన్నా ఫామ్‌పాండ్స్‌కు అనుకూలంగా లేదు. నీరు లేదు. ఇక్కడ భూమి చదును చేసి పాండ్స్‌ ఏర్పాటు చేయాలి.
-దివ్య, కాకినాడ

నోటిఫికేషన్‌ వేసి ఖాళీలు భర్తీ చేయాలి
కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన వారికి ఉద్యోగ భరోసా లేదు. ఇప్పటికే 4 బ్యాచులు బయటికి పోయాయి. ఎవరికీ ఉద్యోగం రాలేదు. వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. నోటిఫికేషన్‌ వేసి కళాశాలలో ఖాళీలు భర్తీ చేయాలి.
-జయసూర్య, గుంటూరు జిల్లా

ఖాళీలను భర్తీ చేయాలి
రాష్ట్ర ప్రభుత్వం మత్స్య కళాశాలలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరిం చాలి. చేపల పెంపకానికి అనుకూలంగా గుట్టలను తొలగించి ఫామ్‌పాండ్స్‌ ఏర్పాటు చేయాలి. డిగ్రీ పూర్తి చేసిన వారికి నోటిఫికేషన్‌ ద్వారా ఉద్యోగాలు కల్పించాలి. కళాశాలకు రహదారి ఏర్పాటు చేసి బస్సు వచ్చేలా చేయాలి. మత్స్య కళాశాలలో చదివే విద్యార్థులకు ప్రాక్టికల్స్‌ తరగతులు ఇక్కడే జరిగేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా చూడాలి.
-మత్స్య కళాశాల ఏడి శాకార్‌, పెబ్బేరు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -