Wednesday, June 25, 2025
E-PAPER
Homeమానవి40ల్లోనూ ఫిట్‌గా..

40ల్లోనూ ఫిట్‌గా..

- Advertisement -

ఏ వయసు వారైనా సరే ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య అధిక బరువు. అయితే ఎంత వద్దనుకున్నా నాలుగు పదుల వయసు దాటాక చాలా మంది మహిళలు క్రమంగా బరువు పెరుగుతుంటారు. ఇందుకు శరీరంలో జరిగే మార్పులతో పాటు మన జీవనశైలి కూడా ఓ కారణంగా చెప్పుకోవచ్చు. ఈ వయసులో వ్యక్తిగత ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడమే ప్రధాన కారణం. మరి ఈ సమస్యను అధిగమించి 40 ఏండ్ల వయసులో కూడా ఫిట్‌గా ఉండడం సాధ్యపడదా అని చాలా మందికి వచ్చే సందేహం. అయితే అది మన చేతుల్లోనే ఉందంటున్నారు నిపుణులు. ఇందుకోసం కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుందని అంటున్నారు. మరి అవేంటో మనమూ తెలుసుకుందాం…
ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలంటే బరువు అదుపులో ఉండాలని నిపుణులు అంటున్నారు. అయితే వయసు పెరుగుతున్న కొద్దీ శక్తి క్షీణించడం సహజం. దీని వల్ల ఏ పని పైనా దృష్టి పెట్టలేకపోవడంతో పాటు వ్యాయామమూ చేయలేరని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు జీవక్రియల పనితీరు నెమ్మదిస్తుందని అంటున్నారు. ఇది క్రమంగా తీపి తినాలన్న కోరికను పెంచుతుందట. దీంతో శరీరానికి శ్రమ లేక, అనారోగ్యపూరిత ఆహారానికి అలవాటు పడడం వల్ల క్రమంగా బరువెక్కుతారని సూచిస్తున్నారు.
మెనోపాజ్‌ కూడా
40 ఏండ్లలో జీవక్రియల పనితీరు నెమ్మదించడం వల్ల శరీరంలో చేరిన క్యాలరీలు, కొవ్వులు కరగడానికి చాలా సమయం పడుతుంది. దీంతో ఈ సమస్య అతి తక్కువ కాలంలోనే అధిక బరువుకు దారితీస్తుంది. అంతే కాకుండా ఈ వయ సులో చాలా మంది మహిళలు బరువు పెరగడానికి మెనోపాజ్‌ కూడా ఓ కారణమని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ వయసులో మెనోపాజ్‌కు చేరువవడం, లేదంటే అప్పటికే ఈ దశలోకి ప్రవేశించడం వల్ల టెస్టోస్టిరాన్‌, ప్రొజెస్టరాన్‌, ఈస్ట్రోజెన్‌ వంటి హార్మోన్ల స్థాయిల్లో మార్పుల కారణంగా అధిక బరువుకు దారితీస్తుందని నిపుణులు అంటున్నారు.
హార్మోన్‌లో మార్పులు
వయసు పెరిగే కొద్దీ శరీరంలో గ్లూకోజ్‌ స్థాయిల్ని అదుపులో ఉంచే ఇన్సులిన్‌ హార్మోన్‌ పనితీరులోనూ మార్పులు వస్తాయని వైద్య నిపుణులు అంటున్నారు. దీంతో ఆకలేసినప్పుడల్లా తీపి పదార్థాల మీద మనసు మళ్లుతుందంటున్నారు. తినాలనే కోరిక చంపుకోలేక వాటిని ఎక్కువగా తీసుకుంటే అధిక బరువుతో పాటు టైప్‌-2 డయాబెటిస్‌ బారిన పడే అవకాశాలు ఉన్నాయని ఓ అధ్యయనం ద్వారా రుజువ యింది. అందుకే ఆ పరిస్థితి రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
జీవనశైలి అదుపు తప్పడం
వయసు పెరిగే కొద్దీ కండరాలు, ఎముకల సామర్థ్యం తగ్గుతుంది. దీని వల్ల వ్యాయామాలు చేయడానికి కూడా శరీరం సహకరించదు. ఒకవేళ బలవంతంగా చేస్తే లేనిపోని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా శారీరక శ్రమ లేకపోవడం వల్ల కూడా బరువు పెరుగుతారని చెబుతున్నారు. దీంతోపాటు మెనోపాజ్‌కు చేరువయ్యే కొద్దీ వేడి ఆవిర్లు, అర్ధరాత్రి ఉన్నట్లుండి చెమటలు పట్టడం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. దీంతో రాత్రిళ్లు నిద్రకు దూరం అవ్వడంతో పాటు ఒత్తిడి, ఆందోళనలు పెరిగిపోతాయని వివరించారు. జీవనశైలి అదుపు తప్పడం వల్ల కూడా బరువు పెరిగిపోతారని సూచిస్తున్నారు. 40 ఏండ్లు దాటిన వారిలో ఇన్ని ప్రతికూలతలున్నా కూడా ఆరోగ్యకరమైన జీవసశైలిని అలవాటు చేసుకోగలిగితే బరువు అదుపులో ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు.
సాయంత్రం స్నాక్‌
వాల్‌నట్స్‌, బాదం పప్పులు, పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడి గింజలు వంటి నట్స్‌ని సాయంత్రం స్నాక్‌గా తరచూ తీసుకోవడం మంచిదంటున్నారు. దీంతో ఎక్కువ టైం కడుపు నిండుగా ఉండి ఆకలేయకుండా, ఇతర పదార్థాల పైకి మనసు మళ్లకుండా జాగ్రత్తపడచ్చనని చెబుతున్నారు.
ప్రొటీన్లు, ఫైబర్‌ అధికంగా
ఈ వయసు వారు తీసుకునే ఆహారంలో ప్రొటీన్లు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కనుక మీరు తీసుకునే రోజువారి భోజనంలో పాలు, పాల పదార్థాలు, గుడ్లు వంటివి ముఖ్యంగా తీసుకోవాలని వివరిస్తున్నారు. అంతే కాకుండా ఫైబర్‌ అధికంగా ఉండే కాయ గూర లు, పండ్లు ఎక్కువగా తీసుకుంటూ ప్రాసెస్డ్‌, నూనె సంబంధిత పదార్థాలను పూర్తిగా పక్కన పెట్టాలని సూచిస్తున్నారు.
వ్యాయామం అవసరం
శరీర బరువును అదుపులో ఉంచుకోవాలంటే వ్యాయామం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వయసు పెరుగుతున్నా వర్కవుట్‌ చేయడం మానకూడదని సూచిస్తున్నారు. కనుక రోజువారి నడకతో పాటు స్క్వాట్స్‌, పుషప్స్‌, లాంజెస్‌ కెటిల్‌ బెల్‌తో ఎక్సర్‌సైజ్‌ వంటివి రోజూ సాధన చేయాలని వివరించారు. ఒకవేళ ఒంటరిగా చేయడం ఇబ్బందిగా ఉంటే జిమ్‌లో చేరవచ్చనని సలహా ఇస్తున్నారు.
అత్యవసరమైతే…
సరైన నిద్ర వల్ల ఒత్తిడి, ఆందోళనలు తగ్గడంతోపాటు హార్మోన్ల సమతుల్యత పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. దీంతో బరువు పెరగకుండా జాగ్రత్తపడొచ్చని సూచిస్తున్నారు. కాబట్టి రోజూ రాత్రుళ్లు ఏండు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్ర పోవడం మంచిదని చెబుతున్నారు. విటమిన్ల లోపాలు కూడా శారీరక సత్తువను కోల్పోయేలా చేస్తాయని అంటున్నారు. కనుక పోషకాహారం తీసుకోవడంతోపాటు అత్యవసరమైతే సంబంధిత డాక్టర్లు సలహా మేరకు ఆయా విటమిన్‌ సప్లిమెంట్స్‌ వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుందని వివరిస్తున్నారు. ఈ నియమలు పాటించడంతోపాటు నిర్ణీత వ్యవధుల్లో ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం కూడా అవసరమేనని సూచిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -