– పాత పద్ధతిలోనే కొనసాగించాలి
– గ్రీన్ ట్యాక్స్ వ్యవస్థను రద్దు చేయాలి
– ఖైరతాబాద్ రవాణా శాఖ ఆఫీస్‌లో ట్రావెల్స్ యజమానుల ధర్నా
– జేటీసీ శివలింగయ్యకు వినతిపత్రం అందజేత
నవతెలంగాణ- సిటీబ్యూరో/బంజారాహిల్స్
ప్రభుత్వం ఇటీవల పెంచిన వాహన ఫిట్‌నెస్ చార్జీలను ఉపసంహరించుకుని, పాత పద్ధతిలోనే చార్జీలు వసూలు చేయాలని తెలంగాణ టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్ ఓనర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. మంగళవారం ఆ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని రవాణాశాఖ ప్రధాన కార్యాలయం ఆవరణలో ధర్నా నిర్వహించారు. ప్రయివేట్ ట్రావెల్స్ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు గోపాల్‌రెడ్డి, ఇతర ప్రతినిధులు మాట్లాడుతూ.. అధికారులు చేస్తున్న తప్పిదాలు సర్కారుకు చెడ్డ పేరు తెస్తున్నాయన్నారు. రాష్ట్ర విభజన అనంతరం బస్సు యజమానులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. దీనికితోడు రవాణాశాఖ విధిస్తున్న అధిక చార్జీలు, ట్రాఫిక్ పోలీసుల తీరు వల్ల తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మధ్య రవాణాపరమైన పరస్పర ఒప్పందం(రీసిప్రోకల్ అగ్రిమెంట్) వెంటనే జరిగేలా చర్యలు తీసుకోవా లన్నారు. రవాణా శాఖలో వసూలు చేస్తున్న ఇతర సర్వీసు చార్జీలను తగ్గించి బస్ ఓనర్స్‌పై భారాన్ని తగ్గించాలన్నారు. గ్రీన్ ట్యాక్స్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ట్రాఫిక్ పోలీసులు రోడ్లపై ఇష్టానుసారంగా ఫొటోలు తీస్తూ, భారీగా చలాన్లు వేయడం ఆపాలన్నారు. ఆర్టీవో కార్యాలయాల్లో ప్రజలకు సేవలందించాల్సిన ‘హెల్ప్ డెస్క్’లు నిరుపయోగంగా ఉన్నాయని అసోసియేషన్ నాయకులు అధికారుల దృష్టికి తెచ్చారు. కార్యాలయానికి వచ్చే సామాన్యులు, వినియోగ దారుల సందేహాలను నివృత్తి చేసే విధంగా హెల్ప్ డెస్క్‌లను వెంటనే పునరుద్ధరించి, సమర్థవంతంగా పనిచేసేలా చర్యలు తీసుకోవా లన్నారు. రాష్ట్రాల సరిహద్దులు దాటే బస్సుల నుంచి భారీ స్థాయిలో పన్నులు వసూలు చేయడం వల్ల తమ రంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని వాపోయారు. దీనికి తోడు ‘రెండు జిల్లాల నిబంధన’ తమకు మరింత భారంగా మారిందన్నారు. గతంలో మాదిరిగానే ఉమ్మడి హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల పరిధిలో బస్సుల రాకపోకలను నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం రవాణాశాఖ జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ (జేటీసీ) శివలింగయ్యను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ట్రావెల్స్ యజమానుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని జేటీసీ హామీ ఇచ్చారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని అసోసియేషన్ ప్రతినిధులు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఆ సంఘం నేతలు నిజాముద్దీన్, నరసింహా రెడ్డి, రెడ్డప్ప, మల్లేషం, కొండల్ రెడ్డి, బాల్‌రెడ్డి, ఇతర నాయకులు, బస్సుల యజమానులు, డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.
ఫిట్‌నెస్ చార్జీలు తగ్గించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



