సీవోఈకి శుభ్‌మన్ గిల్, జశ్‌ప్రీత్ బుమ్రా
బెంగళూర్ : ఆసియా కప్ 2025 మరో పది రోజుల్లో ఆరంభం కానుండగా భారత క్రికెటర్లు ఫిట్‌నెస్ పరీక్షకు సిద్ధమవుతున్నారు. ఫిట్‌నెస్ పరీక్షలో బీసీసీఐ ఇటీవల పలు మార్పులు తీసుకురాగా.. ఆసియా కప్ భారత జట్టు వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, స్టార్ పేసర్ జశ్‌ప్రీత్ బుమ్రా శనివారం బెంగళూర్‌లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు చేరుకున్నారు. టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ, ఆసియా కప్ జట్టులో లేని మహ్మద్ సిరాజ్ సైతం బెంగళూర్‌లోని సీవోఈకి చేరుకున్నారు. ఆసియా కప్‌లో ఆడనున్న హర్షిత్ రానా, అర్ష్‌దీప్ సింగ్, కుల్‌దీప్ యాదవ్, జితేశ్ శర్మలు దులీప్ ట్రోఫీలో ఆడుతున్నారు. యశస్వి జైస్వాల్, శార్దుల్ ఠాకూర్, సర్ఫరాజ్ ఖాన్ సైతం దులీప్ ట్రోఫీలో ఆడేందుకు సీఓఈకి చేరుకున్నారు.
మ్యాచ్ వేళల్లో మార్పులు
ఆసియా కప్ మ్యాచ్ సమయాలను మార్పు చేస్తూ ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు శనివారం ప్రకటించింది. ఆసియా కప్‌లో 19 మ్యాచులు జరగాల్సి ఉండగా.. అన్ని మ్యాచులను తొలుత భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు షెడ్యూల్ చేశారు. కానీ ఇప్పుడు ఓ 30 నిమిషాలు ఆలస్యంగా ఆరంభించేందుకు షెడ్యూల్‌లో మార్పులు చేశారు. ఓమన్, యుఏఈ ఆడాల్సిన మ్యాచ్‌ను మాత్రం సాయంత్రం 5.30 గంటలకు ఆరంభం కానుండగా.. ఫైనల్ సహా ఇతర మ్యాచులు రాత్రి 8 గంటలకు ఆరంభం కానున్నాయి.