మరికొద్ది రోజుల్లో 2025 ముగియనుంది. ఈ ఏడాది అనేక పుస్తకాలు ప్రపంచం ముందుకు వచ్చాయి. అయితే మహిళలు కేంద్ర బిందువుగా వచ్చిన ఐదు పుస్తకాలు మాత్రం ఈ ఏడాది అనేక అనుభవాలు అందించాయి. మహిళల జీవితంలోని వాస్తవాలను ప్రతిబింబించేలా రాసిన ఇవి ఎంతో మందిని ఆలోచింపజేశాయి. మహిళలు అనుభవిస్తున్న బాధలు, కష్టాలు అనేకం ఈ పుస్తకాలలో మనకు కనిపిస్తాయి. ఇంతకీ ఆ ఐదు పుస్తకాలు ఏవో తెలుసుకుందాం…
మదర్ మేరీ కమ్స్ టు మీ
2025లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న జ్ఞాపకాలలో మదర్ మేరీ కమ్స్ టు మీ ఒకటి. అరుంధతి రాయ్ రాసిన ఈ పుస్తకం ద్వారా సాహిత్యంలో ఆమె స్వరం ఎంతటి ధైర్య సాహసాలతో కూడుకొని ఉన్నదో మనకు రుజువు చేస్తున్నది. తన తరానికి చెందిన సమకాలీన రచయితలందరిలోనూ ఈమె చేసిన అసమానమైన కృషి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఆమె అక్షరాలలో జ్ఞాపకాలు, ప్రేమ, తిరుగుబాటు, దు:ఖం స్పష్టంగా ప్రతిబింబిస్తాయి. అరుంధతి రాసే రాతలు సున్నితత్వం, అల్లకల్లోలం మధ్య అప్రయత్నంగా కదులుతాయి. మదర్ మేరీ కమ్స్ టు మీ లోని తల్లి, బిడ్డలు ఇద్దరూ వారి ప్రేమ, కోరిక, భయం, గాయం, అసమర్థతల సంక్లిష్టతలను మానవీయ కోణంలో మనకు చూపిస్తారు. అదే సమయంలో ఎంతో ఉత్తేజకరమైన అస్థిరమైన ఈ పుస్తకం ఈ ఏడాది అత్యధికులు చదివిన పుస్తకాలలో ఒకటిగా నిలిచింది.
నా మార్గాన్ని కనుగొనడం
బాలికలకు చదువుకునే హక్కు ఉందని నినదించినందుకు 15 ఏండ్ల వయసులో మలాలా యూసఫ్‌జాయ్ తాలిబన్ల తుపాకి గుండును భరించాల్సి వచ్చింది. అప్పటి నుండి ఆమెకు తెలిసిన ఆమె జీవితం శాశ్వతంగా మారిపోయింది. ఆసుపత్రిలో కోలుకున్న తర్వాత ఆమె కుటుంబం తమ సొంత ప్రాంతమైన పాకిస్తాన్‌లోని స్వాత్ లోయను, తమ వారి ప్రేమను వదులుకొని శాశ్వితంగా యూకేకి తరలిపోయింది. తర్వాత కాలంలో యూసఫ్‌జాయ్ నోబెల్ శాంతి బహుమతిని సైతం గెలుచుకుంది. నేటికీ బాలికల విద్య కోసం గొంతు విప్పుతూనే ఉంది. ఐ యామ్ మలాలా: ది గర్ల్ హూ స్టాండ్ అప్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ వాజ్ షాట్ బై ది తాలిబన్’ అనే ఆమె మొదటి పుస్తకం మలాలాను ఒక పాఠశాల బాలిక నుండి మానవ హక్కుల ప్రపంచ చిహ్నంగా ఆమె ప్రయాణాన్ని మన కండ్లకు కట్టినట్టు చూపిస్తుంది. ఈ ఏడాది విడుదలైన రెండవ పుస్తకం ‘ఫైండింగ్ మై వే’లో మలాలా తన ఎదుగుదలను, ఆక్స్‌ఫర్డ్‌లో తన కళాశాల జీవితాన్ని, స్నేహాలను, ప్రేమ గురించి వివరిస్తుంది. బాలికల హక్కుల కోసం పోరాడుతూనే ప్రపంచ ప్రజలు ఎదుర్కొంటున్న ఒత్తిడి, మానసిక ఆరోగ్యంతో పోరాడుతున్న విధానం గురించి కూడా బహిరంగంగా చెబుతుంది.
ది హార్ట్ లాంప్
2025 బుకర్ బహుమతి విజేత అయిన బాను ముష్తాక్ రాసిన ‘ది హార్ట్ లాంప్’ అనే పుస్తకం దక్షిణ భారతదేశంలోని ముస్లిం సమాజాలలోని బాలికలు, మహిళల జీవితాలను ఆవిష్కరించే చిన్న కథల సంకలనం. పితృస్వామ్యంతో పాటు మత, కులపరమైన అణచివేత, పేదరికం, వారి రోజువారీ పోరాటాలను అద్భుతంగా తెలియజేశారు. బాను ఫిక్షన్ కథలతో అరుదుగా వినిపించే పోరాటాలకు స్వరాలు ఇస్తారు. ఆమె కథలు వాస్తవికమైనవి, ఆమె చిత్రీకరించిన మహిళల జీవితాల ద్వారా సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను మనం చూడగలం. ఉదాహరణకు ఇందులోని ది స్టోలెన్ అనే కథ కనిపించకుండా పోయిన చీర చుట్టూ తిరుగుతుంది. టైటిల్ స్టోరీ అయిన ది హార్ట్ లాంప్ ఒక సాంప్రదాయిక కుటుంబంలో పెరుగుతున్న యువతికి ఓ శక్తివంతమైన రూపకం.
ది విడో
జాన్ గ్రిషమ్ రచించిన కొత్త పుస్తకం ది విడో. గ్రామీణ వర్జీనియాలోని ఒక చిన్న న్యాయవాది సైమన్ లాచ్ జీవితంపై కేంద్రీకృతమై ఉంది. ఎలియనోర్ బార్నెట్ అనే ఒక వృద్ధ వితంతువు వీలునామా కోసం అతని కార్యాలయంలోకి వచ్చినప్పుడు ఓ కొత్త జీవితాన్ని అనుభవిస్తుంది. చనిపోయిన తన భర్త వదిలిపెట్టిన లక్షల విలువైన సంపద గురించి ఆలోచిస్తూనే తన ప్రయోజనాలను, గోప్యతను కాపాడుకోవాలి. అలాగే తడబడిన తన జీవితాన్ని చక్కదిద్దుకోవడానికి ప్రయత్నించాలి. కానీ బార్నెట్ కథలోని కొన్ని విషయాల గుర్తించి క్షుణ్ణంగా పరిశీలిస్తూ తర్వాత ఏమి జరుగుతుందో సైమన్ లాచ్ తెలుసుకునేలోపే ఆమె ఓ ప్రమాదంలో చిక్కుకుంటుంది. లాచ్ ఆమె హత్యకు గురవుతుంది. ఆ తర్వాత కోర్టులో జరిగే సంఘటనలన్నీ ఎంతో ఉత్కంఠభరితంగా ఉంటాయి. అతను వాస్తవాన్ని, నిజమైన హంతకుడిని కనుక్కునేందుకు సమయంతో పోటీ పడతాడు. గ్రిషమ్‌ను అభిమానించే ప్రతి ఒక్కరు ఈ కథలో వచ్చే మలుపులు, ఈ సమాజంలో దుర్బలమైన స్త్రీ జీవితం, ఆమె అంగీకారం కోసం ఆమె అవసరాన్ని ఉపయోగించుకునే కథనాన్ని ఇష్టపడతారు.
ఆల్ ది వే టు ది రివర్: లవ్, లాస్ అండ్ లిబరేషన్ – ఎలిజబెత్ గిల్బర్ట్
ఎలిజబెత్ గిల్బర్ట్ తన మొదటి జ్ఞాపకంగా రాసుకున్న పుస్తకం ఆల్ ది వే టు ది రివర్: లవ్, లాస్ అండ్ లిబరేషన్. భారతదేశంలో పాటు ఇటలీ, ఇండోనేషియాలో పర్యటించినప్పుడు తన హృదయాన్ని తాకిన అంశాలను ఇందులో పొందుపరిచారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది మహిళలు ‘తమను తాము కనుగొనడం’ అనే నినాదంతో ప్రతిధ్వనించడం ఆమె గుర్తించారు. దాదాపు 20 ఏండ్ల తర్వాత గిల్బర్ట్ తన మొదటి పుస్తకంలో మనకు పరిచయం చేసిన వ్యక్తికి విడాకులు ఇచ్చింది. టెర్మినల్ క్యాన్సర్‌తో మరణిస్తున్న తన స్నేహితురాలు, భాగస్వామి రాయ ఎలియాస్‌ను జాగ్రత్తగా చూసుకోవడం గురించి బాధాకరంగా మాట్లాడుతుంది. ఈ పుస్తకం కొన్ని దిగ్భ్రాంతులను కూడా కలిగిస్తుంది. మహిళల ఆలోచనలు, కోరికలు, నిరాశ, సందేహాలను వెల్లడిస్తుంది.



