Friday, May 23, 2025
Homeప్రధాన వార్తలుఐదు లక్షల మందికిరాజీవ్‌ యువ వికాసం

ఐదు లక్షల మందికిరాజీవ్‌ యువ వికాసం

- Advertisement -

జూన్‌ 2న లబ్దిదారులకు శాంక్షన్‌ లెటర్లు
ప్రభుత్వ లక్ష్యానికి బ్యాంకర్లు సహకరించాలి
రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని ఐదు లక్షల మందికి రాజీవ్‌ యువ వికాస పథకం కింద ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందనీ, అందుకు బ్యాంక ర్లు సహకరించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కోరారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో ప్రభుత్వ లక్ష్యాలను వారికి వివరిం చారు. యువత మేధస్సును ఉత్పత్తి రంగంలో వినియోగించి జీడీపీకి పెద్ద ఎత్తున ఉపయోగపడేలా రాజీవ్‌ యువ వికాస పథకం తీసుకువచ్చామని అన్నారు. ”యువతకు రూ.9 వేల కోట్ల సాయం చేసే పథకం దేశ చరిత్రలో ఏ రాష్ట్రం ఇప్పటి వరకు తీసుకురాలేదు. ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 6,250 కోట్లు సబ్సిడీ రూపేణా ఇస్తోంది. గతంలో యువతకు స్వయం ఉపాధి కింద 70 శాతం రుణం, 30 శాతం సబ్సిడీ ఉండేది. ఇప్పుడది రివర్స్‌గా ఉందన్న విషయాన్ని బ్యాంకర్లు గ్రహించాలి. రూ.8 లక్షల కోట్ల పైబడి లక్ష్యంగా పెట్టుకున్న వార్షిక రుణ ప్రణాళికలో రాజీవ్‌ యువ వికాస పథకం కోసం బ్యాంకర్లు 0.2 శాతం మాత్రమే వెచ్చించాల్సి ఉంటుంది. జూన్‌ 2న ఐదు లక్షల మంది యువతకు శాంక్షన్‌ లెటర్లు పంపిణీ చేయాలన్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రత్యేక నోడల్‌ అధికారిని నియమించండి. క్షేత్రస్థాయిలో అన్ని బ్యాంకులతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర స్థాయి నోడల్‌ అధికారి పర్యవేక్షించి లక్ష్యాన్ని చేరుకునేలా తోడ్పడండి” అని భట్టి బ్యాంకర్లకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో మానవ వనరుల అభివృద్ధిపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించి ముందుకు వెళుతున్నదని చెప్పారు. ఇందుకోసం రాష్ట్రంలో స్కిల్‌ యూనివర్సిటీతో పాటు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అడ్వాన్స్‌ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. విద్యపై పెద్దఎత్తున దృష్టిసారించి స్కూల్‌ నుంచి యూనివర్సిటీ వరకు ప్రతి విద్యార్థికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందిస్తున్నామని తెలిపారు.
వ్యవసాయానికి ప్రాధాన్యత…
వ్యవసాయానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని భట్టి తెలిపారు. ఉద్యానవన పంటలతో పాటు ఆయిల్‌ఫామ్‌ సాగును ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. పంట రుణాలు ఇచ్చే విషయంలో బ్యాంకులు ఉదారంగా వ్యవహరించాలని కోరారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ. 2 లక్షల రుణాలు ఉన్న రైతులందరికీ ఏకకాలంలో రూ.21 వేల కోట్లను బ్యాంకుల్లో జమ చేశామని గుర్తు చేశారు. పెట్టుబడి సాయంగా రైతులకు రైతు భరోసాతో పాటు రైతు బీమా ప్రీమియం డబ్బులను కూడా ప్రభుత్వమే చెల్లిస్తున్నదని తెలిపారు.
రూ.12,600 కోట్లతో ఇందిరా సౌర గిరి జల వికాసం
గిరిజనుల జీవన ప్రమాణాలు పెంచడానికి ఇందిరా సౌర గిరి జల వికాసం పథకం ప్రారంభించినట్టు భట్టి చెప్పారు. రాష్ట్రంలోని అటవీ ప్రాంతాల్లో ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాలు పొందిన 6.70 లక్షల ఎకరాలను సౌర విద్యుత్‌ ద్వారా సాగులోకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.12,600 కోట్లు కేటాయించిందని వెల్లడిం చారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు ఈ ఏడాది వడ్డీ లేకుండా రూ.20 వేల కోట్లకుపైగా రుణాలు ఇచ్చామని తెలిపారు. రానున్న నాలుగేండ్లలో రూ.లక్ష కోట్ల రుణాలు ఇచ్చే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. డ్వాక్రా సంఘాల మహిళలకు ఆర్టీసీలో అద్దె బస్సులతో పాటు సోలార్‌ పవర్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవడానికి సహకారం అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో న్యూఎనర్జీ పాలసీ తీసుకువచ్చి 2030 నాటికి 20వేల మెగావాట్ల గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యంగా ముందుకెళుతున్నట్టు చెప్పారు. హైదరాబాద్‌లో మూసీ పునరుజ్జీవం కోసం చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. ఔటర్‌, రీజినల్‌ రింగ్‌ రోడ్ల మధ్య పరిశ్రమల అభివృద్ధికి వివిధ క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో బ్యాంకర్లు భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా వారికి భట్టి విజ్ఞప్తి చేశారు. 2025-26 వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, ఎస్సీ డెవలప్‌మెంట్‌ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ ఎన్‌ శ్రీధర్‌, ట్రైబల్‌ వెల్ఫేర్‌ కార్యదర్శి శరత్‌, బీసీ వెల్ఫేర్‌ కార్యదర్శి శ్రీధర్‌, ఆర్బీఐ రీజినల్‌ డైరెక్టర్‌ చిన్మోరు కుమార్‌, నాబార్డ్‌ సీజీఎం ఉదరు భాస్కర్‌, ఎస్‌బీఐ డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజేష్‌ కుమార్‌, ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్‌ ప్రకాష్‌ చంద్ర తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -