– మొత్తంగా 263 మంది బలి
– ఉద్దేశపూర్వకంగానే ఇజ్రాయిల్ చర్యలు : అమ్నెస్టీ
– యుద్ధంతో అలిసిపోతున్నాం : ప్రజలు
గాజా : ఇజ్రాయిల్ దాడులకు వేలాదిమంది చనిపోతుంటే, ఆకలికి తట్టుకోలేక వందలాది మంది కన్నుమూస్తున్నారు. గాజాలో తీవ్రమైన ఆకలి బాధలు తట్టుకోలేక గత 24గంటల్లో ఐదుగురు మరణించారు. దీంతో ఇప్పటివరకు ఆకలి మంటలకు 263 మంది బలయ్యారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. వీరిలో 113మంది చిన్నారులే వున్నారు. గాజాకు ఆహారం, తాగునీరు, ఇతరత్రా మానవతా సహాయాన్ని అందనివ్వకుండా ఇజ్రాయిల్ మే నెల నుంచే ఆంక్షలు విధించింది. దీంతో గాజాలోని ప్రజలు తిండిలేక అల్లాడుతున్నారు. తాగడానికి నీరులేక డీ హైడ్రేషన్‌కు గురవుతున్నారు. ఈ పరిస్థితుల్లో చిన్నారులు చర్మాన్ని కప్పుకున్న ఎముకలా గూడుల్లా, అస్థిపంజరాల్లా వుంటున్నారు. అందుకే చిన్నారులు పిట్టల్లా రాలిపోతున్నారు.
మరోవైపు గత 24గంటల్లో ఇజ్రాయిల్ దాడుల్లో 60మంది చనిపోయారు. 344మంది గాయపడ్డారు. దాడులకు గురై పెద్ద సంఖ్యలో బాధితులు శిధిలాల కింద, రోడ్లపై పడి వున్నారని, అంబులెన్సులు, పౌర రక్షణ దళాలు కూడా అక్కడకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయని గాజా ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటివరకు గాజామృతులసంఖ్య 62వేలు దాటింది. గాయపడినవారి సంఖ్య 1,56,230 దాటింది. ఆహారం కోసం వచ్చి ఆదివారం ఆహార కేంద్రాల వద్ద దాడులకు గురై మరణించిన వారి సంఖ్య 27గా వుందని ఆస్పత్రి రికార్డులు పేర్కొంటున్నాయి. ఇజ్రాయిల్ ఉద్దేశపూర్వకంగానే గాజా ప్రజలను ఆకలి చావులకు గురి చేస్తోందని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ విమర్శిం చింది. ఇదిలాగే కొనసాగితే గాజాలో దుర్భిక్షం తీవ్ర స్థాయిలో నెలకొంటుందని హెచ్చరించింది. పాలస్తీనా ప్రజల ఆరోగ్యాన్ని, వారి సంక్షేమాన్ని, సామాజిక కూర్పును ఒక పద్దతి ప్రకారం ఇజ్రాయిల్ ధ్వంసం చేస్తోందని అమ్నెస్టీ విమర్శించింది. ఈ మేరకు ఒక నివేదిక విడుదల చేసింది. సుదీర్ఘకాలంగా సాగుతున్న ఈ యుద్ధంతో తాము అలసిపోయామని గాజా ప్రజలు వాపోతున్నారు. ఈ యుద్ధంతో, దాడుల భయంతో అక్కడకు ఇక్కడకు వెళ్లలేక విసిగివేసారిపోయామని మహ్మద్‌అబూ అల్తా చెప్పారు. ఈ తరుణంలో ఐక్యరాజ్య సమితి తమకు బాసటగా వుండాలని వారు కోరుతున్నారు.
ఆకలితో మరో ఐదుగురు మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES