ఫర్నీచర్ యజమాని అరెస్ట్
మృతుల కుటుంబాలకు రూ. 5లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన మంత్రి పొంగులేటి
రెస్క్యూ ఆపరేషన్‌లో జాప్యానికి కెమికల్స్, అక్రమ నిర్మాణాలే కారణం : డీజీ విక్రమ్ సింగ్ మాన్
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ నాంపల్లి స్టేషన్ రోడ్డులోని ‘బచ్చాస్ ఫర్నిచర్’ షోరూంలో శనివారం జరిగిన భారీ అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్‌లో నిల్వ ఉంచిన రసాయనాలు, ఫర్నిచర్ కారణంగా చెలరేగిన మంటల్లో చిక్కుకుని ఇద్దరు చిన్నారులు సహా మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 30 గంటల పాటు కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్ అనంతరం ఆదివారం ఉదయం మృతదేహాలను వెలికితీశారు. నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని ‘బచ్చా క్రిస్టల్ ఫర్నిచర్’ అనే బహుళ అంతస్తుల భవనంలో శనివారం మధ్యాహ్నం సుమారు ఒంటిగంట సమయంలో ఫర్నిచర్ షోరూం సెల్లార్‌లో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో సెల్లార్‌లో వాచ్‌మెన్ పిల్లలు ఆడుకుంటుండగా, వారిని రక్షించేందుకు వెళ్లిన మరికొందరు లోపలే చిక్కుకుపోయారు.
దట్టమైన పొగ, మంటల తీవ్రత అధికంగా ఉండటంతో అగ్నిమాపక సిబ్బంది, హైడ్రా, పోలీసులు సుమారు 200 మంది శ్రమించినా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. ఆదివారం ఉదయం జేసీబీ సాయంతో సెల్లార్‌కు రంధ్రం చేసి మృతదేహాలను బయటకు తీశారు. మృతులు పొగ పీల్చడం వల్లే ప్రాణాలు కోల్పోయినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. కాగా ఈ ఘటనకు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ప్రధాన కారణమని అనుమానిస్తున్నారు. కాగా, అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ విక్రమ్ సింగ్ మాన్ మాట్లాడుతూ.. ప్రమాద సమాచారం అందిన రెండు నిమిషాల్లోనే ఫైర్ ఇంజన్లు చేరుకున్నా, రెస్క్యూ ఆలస్యం కావడానికి భవన యజమాని నిర్లక్ష్యమే కారణమని తేల్చిచెప్పారు.
సెల్లార్ దుర్వినియోగం
పార్కింగ్ కోసం కేటాయించిన సెల్లార్‌ను గోదాముగా మార్చారు. అందులో ఫర్నిచర్ మెటీరియల్, రెగ్జిన్, కెమికల్స్ నిల్వ చేయడం వల్లే మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. మెట్ల మార్గంలోనూ సామగ్రిని నిల్వ చేయడంతో మంటలు అంటుకుని ఆ దారి మూసుకుపోయింది. మరోవైపు ర్యాంప్ మార్గం కూడా బ్లాక్ కావడంతో లోపల ఉన్నవారు బయటకు రాలేకపోయారు. భవన నిర్మాణ సమయంలో ఫైర్ డిపార్ట్‌మెంట్ అనుమతులు తీసుకోలేదని, సెల్లార్‌లో అక్రమంగా రేకుల షెడ్ నిర్మించారని డీజీ విక్రమ్ సింగ్ మాన్ తెలిపారు.
ఫర్నిచర్ షాఫ్ యజమాని అరెస్ట్!
ప్రమాదానికి కారణమైన ఫర్నిచర్ షాపు యజమాని సతీష్ బచ్చాస్‌ను అబిడ్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు పిల్లల తండ్రి యాదయ్య ఫిర్యాదు మేరకు బీఎన్‌ఎస్ 110 సెక్షన్ సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించనున్నారు. భవన దృఢత్వాన్ని పరిశీలించేందుకు జేఎన్టీయూ నిపుణుల బృందం రంగంలోకి దిగింది.
బాధిత కుటుంబాలకు భరోసా
ఈ ఘటనపై మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పందిస్తూ.. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున రూ. 5లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. భవిష్యత్తులో సెల్లార్లను గోదాములుగా మారిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తాం : ఏసీపీ ప్రవీణ్ కుమార్
అబిడ్స్ పరిధిలో జరిగిన ఫర్నిచర్ షాపు అగ్నిప్రమాద ఘటనపై ఏసీపీ ప్రవీణ్ కుమార్ కీలక వివరాలను వెల్లడించారు. మృతుల తండ్రి యాదయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు బాధ్యుడిగా ఫర్నిచర్ షాపు యజమాని సతీష్ బచాను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. నిందితుడిపై భారతీయ న్యాయ సంహిత(బీఎన్‌ఎస్) 110 సెక్షన్ కింద కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలిస్తున్నట్టు చెప్పారు. ప్రమాదానికి గల కారణాలపై ప్రాథమిక విచారణ జరపగా, షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగినట్టు గుర్తించామన్నారు.
రెండు రోజుల క్రితమే భవనంలోని లిఫ్ట్ రిపేర్ జరిగిందని, అందులోని వైరింగ్ సమస్య వల్లే షార్ట్ సర్క్యూట్ జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సెల్లార్‌లో నిబంధనలకు విరుద్ధంగా భారీగా ఫర్నిచర్ నిల్వ ఉంచడం వల్లే మంటలు అతివేగంగా వ్యాపించాయని వివరించారు. ఈ క్రమంలో సెల్లార్‌లో చిక్కుకున్న వారు దట్టమైన పొగ కారణంగా ఊపిరాడక మృతి చెందారని తెలిపారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలోనే ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఏసీపీ చెప్పారు.
మరణించిన వారి వివరాలు..
ఈ ప్రమాదంలో మృతిచెందిన వారిలో.. భవనంలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న వారి కుటుంబ సభ్యులు ఇతర పనివారని గుర్తించారు. అఖిల్ (7), ప్రణీత్ (11) వాచ్‌మెన్ యాదయ్య కుమారులు కాగా, బీబీ (60) వాచ్‌మెన్ సమీర్ తల్లి. మహ్మద్ ఇంతియాజ్ (31) ఫర్నిచర్ షాపు ఉద్యోగి, సయ్యద్ హబీబ్ (30) ఆటో డ్రైవర్ (వీరిని కాపాడేందుకు వెళ్లి మృతిచెందారు. వీరంతా సెల్లార్‌లోని ఓ గదిలో నివసిస్తున్నట్టు సమాచారం. ప్రమాదం జరిగినప్పుడు వారు బయటకు రాలేక అక్కడే చిక్కుకుపోయి.. ప్రాణాలు కోల్పోయారు. ఉస్మానియా ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ సందర్భంగా మృతుల బంధువులు ఆందోళనకు దిగగా, ఎమ్మెల్సీ రహమత్ బేగ్ నచ్చజెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది.



