– కేంద్రం పెంచిన పారితోషికం అమలు చేయాలి : రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట ఆశావర్కర్ల ధర్నాలు
నవ తెలంగాణ – విలేకరులు
ప్రజలకు నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న తమకు ఫిక్స్‌డ్ వేతనం నిర్ణయించి అమలు చేయాలని కోరుతూ ఆశావర్కర్లు తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేశారు. ర్యాలీలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పారితోషికాలు యథావిధిగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని, ఆశా వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఫిక్స్‌డ్ వేతనం రూ.18 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్లు, అధికారులకు వినతిపత్రాలు అందించారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాలో ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పి.జయలకిë హాజరయ్యారు. ఫిక్స్‌డ్ వేతనం ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వ వాగ్దానాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఆశావర్కర్లపై ఏఎన్‌ఎంలు, డాక్టర్ల వేధింపులు ఆపాలన్నారు. అర్హత కలిగిన ఆశావర్కర్లకు ఏఎన్‌ఎంలుగా ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లకు పీఎఫ్, ఈఎస్‌ఐ ఇన్సూరెన్స్ వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2021 జులై నుంచి డిసెంబర్ వరకు ఆరు నెలల ఫీఆర్సీ ఏరియాస్ వెంటనే చెల్లించాలన్నారు. వనపర్తిలో మర్రికుంట నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ధర్నా నిర్వహించారు. నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మహాధర్నా చేశారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో మున్సిపల్ పార్కు దగ్గర ధర్నా చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా జిల్లా కేంద్రంలోని పాత కలెక్టర్ కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించి, కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఇన్సూరెన్స్, ‘మట్టి ఖర్చుల’ జీవో వెంటనే విడుదల చేయాలని, పెండింగ్‌లో ఉన్న లెప్రసీ సర్వే డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట ఆశాలు ధర్నా నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆశావర్కర్స్ పెద్ద ఎత్తున్న ధర్నా చేపట్టారు. నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసిన అనంతరం డీఎంహెచ్‌ఓ కార్యాలయం ఎదుట కూడా చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో కలెక్టరేట్ల ఎదుట ఆశ వర్కర్లు ధర్నా నిర్వహించారు. అనంతరం తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రజావాణిలో వినతిపత్రాలు అందజేశారు.
ఫిక్స్‌డ్ వేతనం ప్రకటించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES