మైనారిటీ ఓట్ల తొలగింపే లక్ష్యమని తమిళనాడులో నేతల విమర్శలు
చెన్నై : ఎన్నికల కమిషన్ తమిళనాడులో చేపట్టిన ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)ను నిరసిస్తూ పాలక డిఎంకె, దాని మిత్రపక్షాలు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శనలు నిర్వహించాయి. నిజమైన ఓటర్లను ముఖ్యంగా మైనారిటీ కమ్యూనిటీలకు, ఎస్‌సి, ఎస్‌టిలకు చెందిన వారిని తొలగించే ఉద్దేశ్యంతోనే ఎస్‌ఐఆర్ చేపట్టారని ఆ పార్టీలు విమర్శించాయి. అనవసరమైన తొందరపాటుతో ఎన్నికల కమిషన్ ఈ ప్రక్రియను నిర్వహిస్తోందని వారు విమర్శించారు. ఎస్‌ఐఆర్‌ను నిలువరించడం మనకు అత్యంత ప్రాధాన్యత కలిగిన కర్తవ్యమని ముఖ్యమంత్రి, డిఎంకె అధ్యక్షుడు ఎం.కె.స్టాలిన్ వ్యాఖ్యానించారు. ‘ఒకవైపు ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన ఓటు హక్కును లాక్కునే ప్రమాదం పొంచి వున్నందున ఆ ముప్పునకు వ్యతిరేకంగా చట్టబద్ధమైన, కిందిస్థాయి పోరాటం జరుగుతుంది. మరోవైపు, ఇప్పటికే ప్రారంభమైన ఎస్‌ఐఆర్ ప్రక్రియలో అవకతవకలను నివారించేందుకు వార్ రూమ్, హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశాం.” అని స్టాలిన్ ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.
మదురైలో జరిగిన నిరసనల్లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.షణ్ముగం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్థానిక అన్నాడిఎంకె కౌన్సిలర్ ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేశారని చెప్పారు. సిపిఎం నేతల్లో ఒకరు దీని గురించి ఆయనను ప్రశ్నించగా, బూత్ లెవల్ ఆఫీసర్ (బిఎల్‌ఓ) నుండి తనకు ఈ ఫారాలు అందాయని చెప్పారన్నారు.
ఆ ఫారాలను ఆయన ఇచ్చినా వాటిని ఎలా పూర్తి చేయాలో ఆయనకు తెలియదని షణ్ముగం చెప్పారు. ఇదంతా బిజెపి రహస్య ప్రణాళిక అని న్యాయ శాఖ మంత్రి ఎస్.రఘుపతి విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి, అన్నాడిఎంకె నేత కె.పళనిసామి ఎస్‌ఐఆర్ ద్వారా సిఎఎను రూపొందించేందుకు బిజెపి ప్రభుత్వానికి సాయపడుతున్నారని విమర్శించారు. దీనివల్ల తమ పార్టీకి కూడా లాభం వుంటుందని వారు భావిస్తున్నారని వ్యాఖ్యానించారు. కేవలం ప్రతిపక్షాలు పాలిస్తున్న రాష్ట్రాల్లోనే ఎస్‌ఐఆర్‌ను ప్రారంభించారని డిఎంకె నేత పొన్ముడి విమర్శించారు.
‘సర్’కు వ్యతిరేకంగా ఆగ్రహ జ్వాలలు
- Advertisement -
- Advertisement -


