Sunday, August 24, 2025
E-PAPER
spot_img
Homeహెల్త్పలాయన- పోరాట ప్రతిస్పందన

పలాయన- పోరాట ప్రతిస్పందన

- Advertisement -

ఆకస్మికంగా ప్రమాదంలో చిక్కుకొని, తీవ్ర ఒత్తిడికి లోనౌతున్న సమయంలో, ఆ విపత్సంఘటన నుండి బయటపడడానికి శరీరంలో జరిగే తత్కాలిక మార్పులే పలాయన-పోరాట ప్రతిస్పందన.
పొద్దున్నే నిత్యావసర వస్తువు కోసం నిద్రకళ్లతోనే బండి తీసి, సందు మలుపులో అవతలనుండి అదే పరిస్థితిలో వస్తున్న ఇంకొకరి బండిని గుద్దేసామనుకోండి… ఇది అనుకోని విధంగా జరిగింది. మానసికంగా సిద్ధంగా లేం. వెంటనే క్షణం తిరక్కుండానే, శరీరం మొద్దుబారినట్టు ఐపోవడం, తల తిరగడం, ఒళ్ళంతా చెమటలు పట్టేసి, వణుకు రావడం, గుండె వేగంగా కొట్టుకోవడం, కండరాలు బిగుసుకుపోవడం వంటివి జరిగిపోతాయి. అయినప్పటికీ, దెబ్బలు పెద్దగా తగలని స్థితి ఐతే వెంటనే లేచి, ప్రమాదం కనిపెట్టి, తప్పు మనదని గుర్తించడం జరిగితే, టక్కున బండెక్కి పారిపోయే ప్రయత్నం చేయవచ్చు, లేదా నిలదొక్కుకుని పరిస్థితిని ఎదుర్కోనూ వచ్చు. అటువంటి ప్రతిక్రియకు శరీరం సంసిద్ధమౌతుంది. దీనినే పోరాటం లేదా విమాన/ పలాయన స్పందన, ఆంగ్లంలో ఫ్లైట్‌/ ఫైట్‌ రెస్పాన్స్‌ లేదా అక్యూట్‌ స్ట్రెస్‌ రెస్పాన్స్‌ అని అంటారు.
ఇది ఎలా సంభవిస్తుంది?
ఆకస్మిక ప్రమాద పరిస్థితులకు మెదడుకు సంబంధించిన సానుభూతి నాడీ వ్యవస్థ (సింపతెటిక్‌ నర్వెస్‌ సిస్టం) లో భాగమైన స్వయం ప్రతిపత్తి (ఆటోనామస్‌ నర్వెస్‌ సిస్టం) సకాలంలో స్పందించి అడ్రెనాలిన్‌, కార్టిసోన్‌ మొదలగు హార్మోన్లను విడుదలచేసి, తద్వారా, పరిస్థితిని నియంత్రణలోకి తేవడానికి సహాయపడే విధంగా, శరీర పనితీరులో అవసరమైన కొన్ని తాత్కాలిక మార్పులు చేస్తుంది.
ఇది ఒకానొకప్పుడు మనిషి తనను తాను క్రూర మగాలు, ప్రతికూల పరిస్థితుల నుండి కాపాడుకోవటానికి వాడుకున్న అత్యంత పురాతనమైన, కీలకమైన రక్షక యంత్రాంగం. పారిపోయి ఏ చెట్టో ఎక్కడమో, వీలుకాని పరిస్థితిలో ప్రాణాలను కాపాడుకోవటానికి ప్రాణాలకు తెగించి పోరాడడమో ఏదో ఒకటి తప్పనిసరిగా శరీరం చేయాల్సిందే. ఈ ప్రతిక్రియ మన జన్యువులో కాలక్రమేణా ఇమిడిపోయింది.
ప్రస్తుత కాలంలో, రోజువారీగా ఇంట-బయట పనిచేసే చోట్లలో హఠాత్తుగా తీవ్ర ఒత్తిడికి గురైయ్యే సందర్భాలనేకం. మనందరికీ సుపరిచితమైన సన్నివేశాలు-ప్రదర్శనల్లో సాధారణంగా చూస్తుంటాం. అతి మొహమాటస్తులైన వారినెవరైనా సాంఘిక కార్యక్రమంలో అకస్మాత్తుగా వేదికపైన పాడమనో లేదా ప్రసంగిచమనో పిలిచారనుకోండి, వారి పరిస్థితి వర్ణనాతీతం. ఇంకొక సందర్భంలో ప్రొద్దున్నే నడక అని బయలుదేరాం- వీథి కుక్క మొరిగితే చాలు. ఈ రెండు సందర్భాల్లో కూడా పలాయనం చిత్తగించిన వాళ్ళూ ఉన్నారు, నిలదొక్కుకొని పోరాటం చేసిన వాళ్ళూ ఉన్నారు.
విద్యార్థులు కొందరికి మౌఖిక పరీక్ష, మరికొందరికి; లిఖిత, మౌఖిక పరీక్ష, రెండూ ఉద్యోగాన్వేషులు ముఖాముఖీ సమావేశాలు వంటి వాటికి తీవ్ర ఒత్తిడికి గురై, పలాయన- పోరాట ప్రతిస్పందనకు లోనౌతారు.
ఇంకా చెప్పాలంటే, రోడ్డు పైన వాహనాలు నడుపుతున్నప్పుడు, రోడ్డు పైనే కాకుండా కార్యాలయాల్లో, మార్కెట్లలో, వీధుల్లో, స్కూళ్లలో, కాలేజీలలో, యూనివర్సిటిలలో ఇలా ఎన్నో చోట్లలో, ఎన్నోసార్లు మనం నివసించే ఇళ్లలో కూడా ఇటువంటి ఆకస్మిక తీవ్ర వత్తిడికి గురి చేసే పరిస్థితులు మనం ఎదుర్కొంటుంటాం, చూస్తుంటాం. అటువంటి సంఘటనల గురించి చదువుతుంటాం, వింటుంటాం. పరిస్థితిని బట్టి, మెదడు ఆపదను ఏ విధంగా సమీకరించుకుంటుందో, దానికి అనుసారంగా పలాయన లేదా పోరాట ప్రతిస్పందన జరుగుతుంది.
పలాయన-పోరాట స్పందన మూడు దశలుగా వ్యక్తమౌతుంది. మొదటి దశలో మెదడు ఈ స్పందనకు సిద్ధపడుతుంది. ఈ దశలో హార్మోన్లు విడుదలయ్యి, నిముషకాలం పాటు శరీరంలో పైన పేర్కొన్న పరిణామాల్ని కలుగచేస్తాయి. ఆ తరువాత రెండవ దశలో (రెసిస్టన్స్‌/ రికవరీ) మొదటి దశ నుండి తేరుకొనే ప్రక్రియ. మూడవది (ఎగ్సాషన్‌) మొదటి రెండు దశలు తరచుగా సాగుతున్న క్రమంలో శరీరం అలసిపోయి రోగగ్రస్తమయ్యే దశ.
దీని గురించి ఎందుకు తెలుసుకోవాలి?
ప్రకతి సహజంగా శరీరంలో జరిగే ఈ స్పందన వాస్తవంగా మనల్ని ఆపదల నుండి కాపాడడానికి ఉద్దేశింపబడినది. జరిగేది కూడా అదే. కానీ లేని ఆపదను ఉన్నట్టుగా భ్రమిస్తూ, ప్రతి చిన్న విషయాన్నీ భూతద్దంలో చూసుకొని, ఆపదగా మెదడు పొరపాటుగా అన్వయించుకొని, తరుచుగా ఈ ప్రతిక్రియను ఆమంత్రిస్తే తీవ్రమైన దీర్ఘకాలిక ఒత్తిడికి గురయ్యే ప్రమాదముంది.
ఈ రోజుల్లో, ముఖ్యంగా యువతలో గమనిస్తుంది-పోరాట ప్రతిస్పందన. సాటి వ్యక్తులతో, ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళతో, సహచరులతో, కుటుంబ సభ్యులతో, ఆఖరుకు ఆత్మీయులతో కూడా పోరాట ప్రతిస్పందనలో భాగంగా ఘర్షణలు, దూకుడుగా, మూర్ఖంగా, మొండి వైఖరితో, దుర్భాషలాడి, దౌర్జన్యానికి కూడా పాల్పడుతున్నారు. ఇటువంటి వైఖరితో, మేధస్సుకు తగిన అవకాశాలు రాక, అర్హతకు తగిన ఉపాధి లభించక నిరాశా నిస్పహలకు లోనయ్యి, చెడు అలవాట్లకు బానిసలౌతున్నారు లేదా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
పలాయన ప్రతిస్పందన కొందరిలో, కొన్ని విషయాల్లో, తరుచూ పై చెయ్యి తీసుకోవడం వలన, వారు జీవితంలో ఎంతో నష్టానికి గురౌతుంటారు, ముఖ్యంగా బాధ్యతల్ని తప్పించుకోవడం, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండకపోవడం, పనులు వాయిదా వేయడం వంటివి తరుచుగా చేస్తుండడం వలన వారిని ఎవ్వరు నమ్మకపోవడం తద్వారా చులకనగా చూడడం వంటివి జరగడం వలన వారిలో ఆత్మన్యూనత పెరగవచ్చు. ఇది వారిని మానసికంగా క్రుంగదీయవచ్చు.
తరచుగా పలాయన-పోరాట స్థితిలోకి శరీరం వెళ్ళవలసి వచ్చినప్పుడు అలసట, వ్యాకులత (డిప్రెషన్‌), జీర్ణకోశ, గుండె సంబంధిత వ్యాధులు, మైగ్రేన్‌, అధిక రక్తపోటు, డయాబెటిస్‌, ఊబకాయం, రోగనిరోధక శక్తి క్షీణించుట వంటి జీవన శైలి సంబంధిత రోగాల బారీన పడే అవకాశముంది.
దీనిని ఎలా కట్టడి చేయాలి?
‘శాంతము లేక సౌఖ్యము లేదు’- దీనిపట్ల అవగాహన మొదటి మెట్టు.
అలజడిని మనస్సు-మేధస్సు తట్టుకొనే విధంగా శిక్షణ పొందటం రెండవ మెట్టు. ఆ పై స్వీయ శిక్షణ ఇచ్చుకొవాలి.
చిత్తాన్ని అదుపులో పెట్టుకొనే మార్గాలు వెదుక్కోవాలి. సునాయాసంగా చేయగలిగే పద్ధతులు, అంతర్జాలంలో అవలీలగా లభ్యమౌతాయి. వాటిలో వీలుగా ఉండేవి ఎంచుకోవాలి.
యోగా- ధ్యానాలు, శారీరిక వ్యాయామము, సమతుల్య ఆహారము, సజ్జన సాంగత్యము, మంచి అలవాట్లు, అవసరానికి మాత్రమే గాడ్జెట్లు, ఒత్తిడి ని ఆత్మీయులతో, సహచరులతో పంచుకొనే ప్రయత్నం, సజనాత్మక కార్యక్రమాల్లో పాల్గొనడము, తీరిక వేళల్లో సత్సాహిత్య పఠనము నిత్యకత్యాలుగా అలవర్చుకోవాలి.
సంకల్ప శక్తితో వెదికితే మార్గాలు కోకొల్లలు.
ఇవి చేయడం వలన కాలక్రమేణా మానసికంగా స్వీయ క్షమ, ఇతరుల పట్ల సహానుభూతి వంటి సౌమ్య వైఖరి పెంపొంది, సమస్యలను, సందర్భాలను, ఎంత ఆకస్మికమైనప్పిటికీ, నిలదొక్కుకుని, ఆలోచనా పూర్వక నిర్ణయాలు తీసుకోగలిగి, సామరస్యంగా పరిష్కరించుకొనే క్షమత మనలో వద్ధి చెంది, పలాయన-పోరాట ప్రతిస్పందన మనకు సానుకూలంగా నియంత్రితమౌతుంది.
డాక్టర్‌ మీరా,
రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ అఫ్‌ మైక్రోబయాలజీ,
ఫీవర్‌ హాస్పిటల్‌ /ఉస్మానియా మెడికల్‌ కాలేజ్‌, హైదరాబాద్‌.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad