న్యూఢిల్లీ : దాదాపు ఐదేండ్ల తర్వాత అక్టోబర్ 26 నుంచి భారత్- చైనాల మధ్య విమాన రాకపోకల పున:ప్రారంభానికి కేంద్రం గ్రీన్ సిగల్ ఇచ్చింది. ఈ విషయాన్ని తాజాగా ఓ సీనియర్ ప్రభుత్వాధికారి వెల్లడించారు. శీతాకాలం ప్రారంభమయ్యే కాలంలో భారత్- చైనాల మధ్య నేరుగా విమాన రాకపోకల్ని అక్టోబర్ 26 నుంచి పున:ప్రారంభించడానికి అంగీకరించినట్టు భారత విదేశాంగ మంత్రిత్వశాఖ గురువారం ప్రకటించింది. మరోవైపు అక్టోబర్ 26 నుండి కోల్‌కతా- గ్వాంగ్‌జౌ రోజువారీ సేవలను ప్రారంభించనున్నట్లు ఇండిగో విమానయాన సంస్థ తెలిపింది. ఇరు దేశాల మధ్య నియంత్రణ ఆమోదాలు అమల్లోకి వచ్చిన తర్వాత న్యూఢిల్లీ నుండి చైనాకు రోజువారీ విమాన సేవలను అందుబాటులోకి తేనున్నట్లు ఇండిగో తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రయాణీకుల, కార్గో విమానాల కోసం ఐదు చైనా ఎయిర్‌లైన్స్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)ని సంప్రదించాయి.
కాగా, విమానాల రాకపోకలు పున:ప్రారంభించడానికి ఇక ఆలస్యం చేయకూడదని భారత్- చైనా నేతలు కోరుకుంటున్నారని ప్రభుత్వాధికారి పేర్కొన్నారు. ఇక ఇరు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం చేసుకోవడానికి, ప్రభుత్వ వ్యూహంలో భాగంగా ఈ సంవత్సరం ప్రారంభం నుండి రెండు దేశాలు సాంకేతికస్థాయి చర్చలు జరుపుతున్నాయని, ఇందులో విమాన సేవా ఒప్పందం కూడా ఉందని భారత విదేశాంగశాఖ గురువారం విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. ఇండిగోతోపాటు, ఎయిర్ ఇండియా కూడా ఈ ఏడాది చివరి నుంచి షాంఘైకి విమాన సర్వీసులను ప్రారంభించాలని యోచిస్తోంది. ఇక ఆకాశ విమానయాన సంస్థ కూడా అదే ఆలోచనలో ఉంది. చైనా నుంచి భారత్‌కు చేరే ప్రయాణీకుల కోసం చైనా కూడా షాంఘై – ఢిల్లీ (వారానికి ఐదు విమానాలు) విమాన సర్వీసులను ప్రారంభించింది. వీటికి డిజిసిఎ అనుమతినిచ్చింది. ప్రయాణీకుల విభాగంలో ఎయిర్ చైనా, షాన్డాంగ్‌లు దరఖాస్తు చేసుకున్నాయి. వీటితోపాటు ఇతర విమానయాన సంస్థలు కూడా దరఖాస్తు చేసుకున్నాయి. చైనా సదరన్ ఎయిర్‌లైన్స్, సిచువాన్ ఎయిర్‌లైన్స్‌లు కార్గో విమానాలకు అనుమతి కోరాయి.
భారతీయ విమానయాన సంస్థలు ఇరు దేశాల మధ్య సేవల్ని కొనసాగించడానికి ఒప్పందానికి కట్టుబడి ఉన్నాయి. ప్రస్తుత ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం ఆరు గమ్యస్థానాలకు చేరుకోవడానికి వీలుకల్పిస్తుంది. అయితే వారంలో 42 విమానాల కంటే ఎక్కువ నడపకూడదని ఒప్పందంలో ఉంది. చైనా విమానాలు ప్రతివారం 42 విమానాలను నడుపుతున్నాయి. వాటిలో ఎయిర్ చైనా (బీజింగ్- ముంబై) వారానికి నాలుగుసార్లు, బీజింగ్ -ఢిల్లీకి ఐదుసార్లు సార్లు ప్రయాణీకుల రాకపోకల్ని కొనసాగిస్తున్నాయి. చైనా సదరన్ ఎయిర్‌లైన్స్ ఢిల్లీ-గ్వాంగ్‌జౌకు రోజుకు రెండుసార్లు సర్వీసుల్ని కొనసాగిస్తుంది. చైనా ఈస్టర్స్ ఎయిర్‌లైన్స్ వారానికి ఎనిమిది, వాటిలో రోజువారీ ఢిల్లీ- షాంఘై విమానాలను నడుపుతుంది. షాన్డాంగ్ ఎయిర్‌లైన్స్ కున్మింగ్ నుండి ఢిల్లీకి వారానికి నాలుగుసార్లు విమానాలను నడుపుతుంది. రువాండాకు చెందిన రువాండ్ ఎయిర్‌లైన్స్ కూడా వారానికి మూడుసార్లు గ్వాంగ్జౌ- ముంబైల మధ్య విమాన సర్వీసుల్ని కొనసాగిస్తుంది. భారతీయ విమానయాన సంస్థల్లో ఒకటైన ఎయిర్ ఇండియా న్యూఢిల్లీ నుంచి వారానికి ఐదుసార్లు షాంఘైకి విమానాలను నడుపుతుంది. ఇండిగో కూడా చెంగ్డు- ఢిల్లీ, గ్వాంగ్జౌ- కోల్‌కతాల మధ్య రోజువారీ విమానలను నడిపింది.
ఐదేండ్ల తర్వాత భారత్- చైనాల మధ్య విమానాలు పున:ప్రారంభం
- Advertisement -
- Advertisement -