Sunday, October 5, 2025
E-PAPER
Homeజాతీయంఉమ్మడి చిత్తూరు జిల్లాలో కుండపోత

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కుండపోత

- Advertisement -

తిరుమలలో యాత్రికుల తీవ్ర ఇక్కట్లు
పీలేరు ఆర్టీసీ బస్టాండ్‌లోకి వర్షపు నీరు


చిత్తూరు : ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో శనివారం పలుచోట్ల భారీ వర్షం కురిసింది. తిరుపతిలోనూ, అన్నమయ్య జిల్లా పీలేరులోనూ కుండపోత వర్షానికి రోడ్లు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు నిల్చిపోయింది. పీలేరు ఆర్‌టిసి బస్‌ స్టేషన్‌ ప్లాంట్‌ఫారాలపైకీ నీరు చేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం వల్ల చలి పెరగడంతో తిరుమలలో యాత్రికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. కుండపోత వర్షానికి నాలుగు మాఢ వీధులు జలమయమయ్యాయి. స్వామి వారి దర్శనానికి వచ్చిన యాత్రికులు తడిచి ముద్దయ్యారు. చలికి వణికిపోయారు. దసరా సెలవులు పూర్తయినా శనివారం కూడా తిరుమలకు యాత్రికులు పోటెత్తారు. మూడు కిలోమీటర్ల వరకూ క్యూలైన్లలో వేచి ఉన్నారు. ఉచిత సర్వదర్శనానికి దాదాపు 20 గంటల సమయం పడుతోంది. ఎడతెరిపిలేని వర్షానికి తిరుపతి నగరం తడిచి ముద్దయింది.

తిరుచానూర్‌, రేణిగుంట, చంద్రగిరి వైపు వెళ్లే మార్గాల్లో రాకపోకలు స్తంభించాయి. పలు మండలాల్లో చిన్నచిన్న చెరువుల్లో నీటిమట్టం పెరిగింది. పలు రోడ్లు చెరువులను తలపించాయి. అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆర్‌టిసి బస్టాండ్‌ ఆవరణలో మోకాలు లోతు వరకు వర్షం నీరు చేరడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలకు పడ్డారు. ప్లాట్‌ఫారాలపైకి కూడా వరద నీరు చేరడంతో ప్రయాణికులు కుర్చీల్లో కూర్చోలేక పోయారు. ఆర్‌టిసి కాంప్లెక్స్‌లోని దుకాణాల్లోకి కూడా వర్షపు నీరు ప్రవేశించింది. ఆర్‌టిసి డిపో మేనేజర్‌ ఎస్‌ఎండి రోషన్‌ అగ్నిమాపక బృందాన్ని రప్పించి బస్టాండులోని వర్షపు నీటిని తోడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -