Thursday, October 30, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కుండపోత

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కుండపోత

- Advertisement -

భీమదేవరపల్లిలో రికార్డుస్థాయిలో 41.9 సెంటీమీటర్ల వాన
33 ప్రాంతాల్లో కుండపోత వర్షం
101 ప్రాంతాల్లో అత్యంత భారీ, 184 ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదు
నేడూ రాష్ట్రంలోని పలు జిల్లాలకు భారీ వర్షసూచన
ఎల్లో హెచ్చరిక జారీ చేసిన వాతావరణ శాఖ

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మొంథా తుపాన్‌ ఎఫెక్ట్‌ తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. బుధవారం ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లోనూ ఎడతెరుపు లేకుండా వర్షం కురిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 928 రేయిన్‌గేజ్‌ సెంటర్ల పరిధిలో వర్షపాతం నమోదైంది. అందులో 33 ప్రాంతాల్లో కుండపోత, 101 ప్రాంతాల్లో అతి భారీ వర్షం, 184 ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో చాలా ప్రాంతాల్లో కుండపోతవర్షం కురిసింది. మేఘాలకు చిల్లులు పడ్డాయా అన్నట్టుగా గంటల వ్యవధిలో హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండల కేంద్రంలో రికార్డు స్థాయిలో గంటల వ్యవధిలో 41.9 సెంటీమీటర్ల కుండపోత వర్షం పడింది. వరంగల్‌ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడలో 38.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. గతంలో తెలంగాణలోని లక్ష్మిదేవిపేటలో గరిష్టంగా 64 సెంటీమీటర్లు, మూడేండ్ల కింద నిర్మల్‌లో 45 సెంటీమీటర్లు, కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఇటీవల 40 సెంటీమీటర్ల వర్షం కురిసినప్పటికీ ఆయా సందర్భాల్లో రెండు మూడు రోజుల్లో నమోదైందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి డాక్టర్‌ కె.నాగరత్న తెలిపారు.

ప్రస్తుతం బుధవారం హన్మకొండ జిల్లా భీమదేవరపల్లిలో ఒకేరోజు 41.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపారు. మొంథా తుపాన్‌ ప్రభావం వల్ల రాష్ట్రంలో గురువారం కూడా పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీ చేశారు. ఆ జాబితాలో ములుగు, ఆదిలాబాద్‌, కొమ్రంభీమ్‌ అసిఫాబాద్‌, మంచిర్యాల, జయశంకర్‌భూపాలపల్లి, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి జిల్లాలున్నాయని తెలిపారు. ఆ జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయొచ్చనీ, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని చెప్పారు. హైదరాబాద్‌ పరిధిలో వచ్చే 48 గంటల పాటు ఆకాశం మేఘావృతమై ఉంటుందనీ, కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే సూచనలున్నాయని తెలిపారు. మిగతా జిల్లాల్లోనూ అక్కడక్కడా భారీ వర్షాలు, ఎక్కువ ప్రాంతాలోల్లో మోస్తరు వాన పడే అవకాశముందని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -