2024-25లో రూ.6769.14 కోట్ల ఆదాయం
జాతీయ పార్టీల ఆదాయంలో 85 శాతం కమలం పార్టీకే
న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికలు జరిగిన 2024-25 ఆర్థిక సంవత్సరంలో బీజేపీకి విరాళాలు వెళ్లువెత్తాయి. ఈ కాలంలో కమలం పార్టీకి రూ. 6769.14 కోట్ల ఆదాయం వచ్చింది. ఇందులో 85 శాతం విరాళాల ద్వారానే వచ్చింది. ఆరు జాతీయ పార్టీల్లో బీజేపీకి మాత్రమే ఇంత భారీస్థాయిలో ఆదాయం వచ్చింది. ఇదే ఆర్థిక సంవత్సరంలో రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ (రూ. 918.28 కోట్లు) ఆదాయంతో పోలిస్తే బీజేపీకి ఏ స్థాయిలో విరాళాలు వచ్చాయో అర్థం అవుతుంది. ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన డిక్లరేషన్స్ ప్రకారం 2024-25లో ఆరు జాతీయ పార్టీలకు మొత్తం రూ. 7960.09 కోట్ల ఆదాయం రాగా, ఇందులో 85.03 శాతం బీజేపీ ఖాతాలోకే వెళ్లింది.
అసోసియేషన్ ఫర్ డెమెక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ప్రచురించిన ఒక నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.. ఆ ఆర్థిక సంవత్సరంలో బీజేపీ తనకు వచ్చిన ఆదాయంలో 55.76 శాతాన్ని అంటే రూ.3774.58 కోట్లను వ్యయం చేయగా, కాంగ్రెస్ మాత్రం ఆదాయం కంటే 21.09 శాతం ఎక్కువ.. అంటే రూ.1111.94 కోట్లను వ్యయం చేసింది. మరో జాతీయ పార్టీ సీపీఐ(ఎం)కు ఈ కాలంలో మొత్తంగా రూ. 172,60 కోట్ల ఆదాయం రాగా, ఈ పార్టీ వ్యయం రూ.173.86 కోట్లుగా ఉంది. బీఎస్పీ ఆదాయం రూ 58.58 కోట్లు కాగా, వ్యయం మాత్రం రూ. 106.30 కోట్లుగా ఉంది.
ఆప్‌కు రూ. 39.28 కోట్లు ఆదాయం రాగా, రూ. 36.46 కోట్లను వ్యయం చేసింది. నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీఈపీ)కు రూ. 2.18 కోట్ల ఆదాయం రాగా, రూ. 1.19 కోట్లను ఖర్చు చేసింది. ఆరు జాతీయ పార్టీలు కూడా ఈ ఆదాయాన్ని దేశంలోనే సంపాదించినట్టు తెలిపాయి. 2023-24తో పోలిస్తే 2024-25లో బీజేపీ ఆదాయం 55.95 శాతం అంటే రూ. 2428.67 కోట్లు పెరిగింది. మిగిలిన జాతీయ పార్టీల్లో ఆప్ (73 శాతం, రూ. 16.60 కోట్లు), జాతీయ పార్టీలకు వచ్చిన ఆదాయంలో ఎక్కువ భాగం విరాళాల రూపంలోనే వచ్చాయి. బీజేపీకి మొత్తం ఆదాయంలో 90.48 శాతం అంటే రూ. 6124.85 కోట్లు విరాళాల ద్వారానే వచ్చాయి.
ఆప్‌కు 99.85 శాతం అంటే రూ. 39.22 కోట్లు, ఎన్‌పీఈపీకి 97 శాతం అంటే రూ. 2.14 కోట్లు విరాళంగానే వచ్చాయి. వీటికి భిన్నంగా బీఎస్పీ మాత్రం తన ఆదాయం మొత్తం విరాళాలు కాకుండా, ఇతర మార్గాల నుంచి వచ్చిందని తెలిపింది. కాంగ్రెస్‌కు విరాళాల ద్వారా రూ. 522.13 కోట్లు, ఇతర మార్గాల ద్వారా రూ.396.15 కోట్లు వచ్చాయి. ఎన్నికలు, ప్రచారానికి బీజేపీ రూ. 3335.36 కోట్లు ఖర్చు చేసింది. పరిపాలనా కోసం రూ. 323.05 కోట్లు ఖర్చు చేసింది. ఎన్నికల కోసం కాంగ్రెస్ రూ. 896.22 కోట్లు వ్యయం చేయగా, పరిపాలనా- సాధారణ ఖర్చుల కోసం దాదాపు రూ. 159.68 కోట్లు కేటాయించింది.
బీజేపీకి నిధుల వరద
- Advertisement -
- Advertisement -



