Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంజూరాలకు వరద జలాలు

జూరాలకు వరద జలాలు

- Advertisement -

– ఎగువ నుంచి 80 వేల క్యూసెక్కుల నీరు
– 12 గేట్ల ద్వారా నీటి విడుదల
– 18 ఏండ్ల తర్వాత మే నెలలో గేట్లు ఎత్తివేత
– ఇదే మొదటిసారి అంటున్న అధికారులు
– వానాకాలం సాగుకు ఉపయోగకరమన్న రైతులు
నవతెలంగాణ – మహబూబ్‌నగర్‌ ప్రాంతీయప్రతినిధి

నిప్పులు రాజేసే మేనెలలోనే కనీవిని ఎరగని రీతిలో వర్షాలు కురిశాయి. దీనివల్ల ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో యాసంగి పంటలు భారీగానే దెబ్బతిన్నాయి. ఇదిలా ఉండగా కర్నాటక, మహరాష్ట్రలలో కురుస్తున్న వర్షాల వల్ల జూరాలకు వరద జలాలు చేరుతున్నాయి. 80 వేల క్యూసెక్కుల వరద వస్తుండటంతో 12 గేట్లు ఎత్తి నీటిని కిందికి వదలుతున్నారు. రెండు నెలల ముందే వరద జలాలు రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు అకాల వర్షాలతో యాసంగిలో వేసిన పంటలు తడిసి ఇబ్బందులు పెట్టినా.. ఎగువన కురిసిన వర్షాలతో జూరాలకు వరద నీరు రావడం పట్ల రైతుల్లో సంతోషం నెలకొంది. 18 ఏండ్ల తర్వాత మే నెలలో జూరాల గేట్లు ఎత్తి కిందికి నీటిని వదలడం ఇదే మొదటి సారి అని జూరాల ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఎగువన కురిసే భారీ వర్షాల వల్ల వరద మరో వారం రోజులపాటు కొనసాగే అవకాశాలున్నాయి. నారాయణపూర్‌, ఆల్మట్టి, తుంగభద్ర డ్యాంల నుంచి నీరు భారీగా వస్తోంది. వారం రోజుల పాటు వరదలొస్తే శ్రీశైలం పూర్తి స్థాయిలో నిండే అవకాశాలున్నాయి. ఈ రిజర్వాయరు నిండితే దీనికి అనుబంధంగా నిర్మించిన కల్వకుర్తి ఎత్తిపోతలతో పాటు భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌కు నీటిని విడదల చేసే అవకాశాలున్నాయి. సాగునీటితో పాటు తాగునీటికి ఎటువంటి సమస్య ఉండదు. కర్నాటక, మహారాష్ట్ర ప్రాంతంలోని కృష్ణా పరివాహక ప్రాంతంలో ప్రతి ఏడాది జూన్‌ చివరి వారంలో వర్షాలు కురిసేవి. జులైలో జూరాలకు వరద నీరు వచ్చేది. ఈ సారి ముందుగానే నీరు రావడంతో అధికారులు నీటి లభ్యత కిందికి వదలడం తదితర అంశాలను పరిశీలిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా సాగుకు అత్యంత ప్రయోజనం చేకూర్చే జూరాల నీటితో కళకళలాడుతుండటంతో ఈ ప్రాంత ఆయకట్టుతో పాటు నదీ సమీప ప్రాంతాల్లో వరితో పాటు ఇతర పంటలు వేసే రైతులు సాగుకు సిద్ధమౌతున్నారు.
సంతోషంలో రైతులు
జూరాల ఆయకట్టు సుమారు లక్షా ఐదు వేల ఎకరాలు. ఇక్కడ అత్యధికంగా వరి సాగు చేస్తుంటారు. వరితో పాటు చెరుకు, అరటి, సీడ్‌ పత్తి సాగు చేసేందుకు రైతులు సమాయతమౌతున్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల కింద సుమారు 4 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతోంది. ప్రధానంగా వరి, పత్తి, మొక్కజొన్న పంటలు సాగవుతాయి. ఆరుతడి పంటలతో పాటు వరి పంట, కూరగాయల సాగుకు నీటి కొరత ఉండదు. అయితే అధికారులు ప్రాజెక్టుల నుంచి నీరు వృధాగా కిందికి పోకుండా చర్యలు తీసుకోవాలని రైతు సంఘాలు కోరుతున్నాయి.
ముందస్తు వరదలు రావడం సంతోషకరం: కసిరెడ్డి నారాయణరెడ్డి ఎమ్మెల్యే కల్వకుర్తి
వర్షాధార ప్రాంతమైన ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో సాగునీటి కోసం కాల్వల మీద ఆధారపడాల్సి వస్తోంది. కల్వకుర్తి వంటి చివరి ఆయకట్టుకు నీరు రావాలంటే ముందస్తు వర్షాలు లాభదాయకంగా ఉంంటాయి. కాల్వలు ముందుగా వస్తే… ఈ ప్రాంతానికి సాగునీరు వస్తోంది. ముందస్తు వర్షాలు, ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు రావడం సంతోషంగా ఉంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad