Friday, July 11, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంగోదావరికి వరద ఉధృతి..

గోదావరికి వరద ఉధృతి..

- Advertisement -

– హెచ్చరికలు జారీ..
– ప్రమాదస్థాయికి చేరిన కాళేశ్వరం పుష్కర ఘాట్‌
– రామన్నగూడెం పుష్కరఘాట్‌ వద్ద నీటి మట్టం 13 మీటర్లు
– సమ్మక్క సారక్క బ్యారేజ్‌ వద్ద జలకళ
నవతెలంగాణ-మహాదేవపూర్‌/ ఏటూర్‌నాగారం/ములుగు

జయశంకర్‌-భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరి పెరుగుతోంది. 10.520 మీటర్ల ఎత్తులో నీరు ప్రవహిస్తోంది. దాంతో పుష్కర ఘాట్‌ వద్ద ప్రమాద స్థాయికి నీరు చేరుకుంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్‌ వద్ద వరద ఉధృతి 6,36,130 ఇన్‌ఫ్లో కాగా, 85 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నట్టు ఇంజినీర్లు తెలిపారు. కాళేశ్వరం వద్ద 10.690 అడుగులు చేరుకున్నట్టు సీడబ్ల్యూసీ అధికారులు తెలిపారు. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో పాటు ఎగువన గేట్లు ఎత్తివేయడంతో కాళేశ్వరం వద్ద అంతకంతకు నీరు చేరుకుంటోంది. ఈ క్రమంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉడాలని పోలీసులు, రెవెన్యూ అధికారులు, నీటిపారుదల అధికారులు హెచ్చరించారు.

ములుగు జిల్లా ఏటూర్‌నాగారం మండలంలోని రామన్నగూడెం పుష్కరఘాట్‌ వద్ద గురువారం సాయంత్రం నాటికి నీటి మట్టం 13 మీటర్లకు చేరింది. అయితే వరద క్రమంగా పెరిగే అవకాశాలు ఉన్నదని కేంద్ర జల వనరుల అధికారులు అంచనా వేస్తున్నారు. వరద ప్రవాహాన్ని గంటగంటకు పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు అధికారులకు సమాచారా న్ని చేరవేస్తున్నారు. మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో భారీ వర్షాలు ఉన్నందున వరద గోదావరిలో కలిసే ప్రమాదం ఉందని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పుష్కర్‌ ఘాట్‌ వద్ద వరద ప్రవాహం 14.82 మీటర్లకు చేరితే అధికారులు మొదటి హెచ్చరిక జారీ చేస్తారు. 15.82 మీటర్లకు చేరితే రెండవ ప్రమాద హెచ్చరికను, 17.32 మీటర్లకు చేరితే మూడో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేస్తారు. ఇటీవల జిల్లా కలెక్టర్‌ దివాకర, రెవెన్యూ ఇరిగేషన్‌ అధికారులతో కలిసి గోదావరి పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు.

అధికారులు అప్రమత్తం గా ఉండాలని ఆదేశించారు. అలాగే కన్నాయిగూడెం మండలం గుట్టలగంగారం గ్రామంలోని సమ్మక్క సారక్క (చొక్కా రావు ఎత్తిపోతల పథకం) బ్యారేజ్‌ దేవాదుల పంప్‌ హౌస్‌ వద్ద నీటి నిల్వ భారీగా చేరుకుని జలకళ సంతరించుకుంది. కొన్ని రోజులుగా మోటార్ల ద్వారా భీమ్‌ ఘణపూర్‌ రిజర్వాయర్‌లోకి 1078 క్యూసెక్కుల నీరు పంపింగ్‌ జరుగుతుందని ఇరిగేషన్‌ అధికారులు తెలిపారు. గోదావరిలో నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతుండటంతో దేవాదుల ఇన్టేక్‌ వెల్‌ వద్ద ఎత్తిపోతలను ఎగువ ప్రాంతాల్లోకి నీటి సరఫరా జరుగుతుందని అధికారులు అన్నారు. దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు వద్ద 83.00 మీటర్ల నీటి మట్టానికి 80.30 మీటర్లు ఉంది. 6.94 టీఎంసీల నీటి నిల్వకు 4.429 టీఎంసీలు ఉంది. తుపాకులగూడెం వద్ద సమ్మక్క సాగర్‌ బ్యారేజీలో 83 మీ. నీటి మట్టానికి 80.30మీ. ఉండగా 6.94 టీఎంసీలకు గాను 4.429 టీఎంసీలు ఉందని ఇరిగేషన్‌ డీఈ శరత్‌ బాబు, ఏఈఈ సాయిరాం తెలిపారు. సమ్మక్క సాగర్‌ బ్యారేజీ వద్ద మొత్తం 59 గేట్లకు 59 ఎత్తి 5,10,047 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -