– అడ్డగోలుగా దోచుకుంటున్న ‘రిలయన్స్’
– రాష్ట్ర అవసరాలకు దక్కక కొరత
– ప్రాఫిట్ గ్యాస్‌లోనూ రిక్తహస్తం
– 16న రాజమండ్రిలో రాష్ట్ర సదస్సు
కాకినాడ : కృష్ణా-గోదావరి (కెజి) బేసిన్‌లోని చమురు, సహజ వాయువులను రిలయన్స్ సంస్థ అడ్డగోలుగా దోచుకుంటోంది. రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన వాటా రావడం లేదు. దీంతో, గ్యాస్ కొరత ఏర్పడుతోంది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధంతో ఈ సమస్య మరింత తీవ్రమైంది. ప్రాఫిట్ గ్యాస్‌లోనూ రిక్తహస్తం చూపుతోంది. దీంతో, కెజి బేసిన్‌లో వెలికితీస్తోన్న గ్యాస్‌లో కనీసం 50 మన రాష్ట్రానికి కేటాయించాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. దేశంలోనే అత్యధిక ఆయిల్, గ్యాస్ ఉత్పత్తికి ఆవాసంగా కెజి బేసిన్ ఉంది. లక్షల కోట్ల రూపాయల విలువైన పెట్రో ఉత్పత్తులను ఇక్కడ వెలికి తీస్తోన్నా, రాష్ట్రానికి మాత్రం ఫలితం దక్కడం లేదు. ప్రజలకు దక్కాల్సిన సహజవనరులు కేంద్ర, రాష్ట్ర పాలకుల వైఖరితో రిలయన్స్ వంటి ప్రయివేటు, కార్పొరేట్ సంస్థల పరమవుతోంది. గ్యాస్ ఉత్పత్తి ఇక్కడే జరుగుతున్నా వెయ్యి రూపాయలు వంట గ్యాస్ కొనుక్కోవాల్సి వస్తోంది. ప్రాఫిట్ గ్యాస్‌లోనూ న్యాయబద్ధంగా రాష్ట్రానికి దక్కాల్సిన వాటా రావడం లేదు. ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న ‘పెట్రో’ కష్టాలకు ఇదే పునాది. ఈ నేపథ్యంలో న్యాయబద్ధంగా రాష్ట్రానికి రావాల్సిన గ్యాస్ వాటాపై సిపిఎం సహా ప్రజా సంఘాలు పోరాటానికి సిద్ధమవుతున్నాయి.
విలువైన సంపద రాష్ట్రం సొంతం
కెజి బేసిన్‌లో సుమారు 698 మిలియన్ మెట్రిక్ టన్నుల చమురు, దానికి సమానమైన గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయి. ఇక్కడ ముడి చమురు ఉత్పత్తి రోజుకు సుమారు 19,190 బ్యారెళ్లు. సహజ వాయువు ఉత్పత్తి రోజుకు 9.8 ఎంఎంఎస్‌సిఎండి. ప్రపంచంలోనే అతి పెద్ద గ్యాస్ నిక్షేపాలున్న డి6 బ్లాక్ కెజి బేసిన్‌లోనే ఉంది. కాకినాడ సమీపంలోని సముద్ర ప్రాంతంలో 7,645 కిలోమీటర్ల పరిధిలో ఈ బ్లాక్ విస్తరించి ఉంది. ఈ బ్లాక్‌లో రిలయన్స్ ఇండిస్టీస్ సంస్థకు 90 శాతం, కెనడాకు చెందిన నికో రిసోర్సెస్ లిమిటెడ్ సంస్థకు పది శాతం వాటాలు ఉన్నాయి. ఈ క్షేత్రం నుంచి రోజుకు 27 నుంచి 30 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల (ఎంఎంఎస్‌సిఎండి) గ్యాస్ ఉత్పత్తి అవుతోంది. రిలయన్స్ సంస్థ ఇప్పటి వరకూ ఈ బ్లాక్ నుంచి దాదాపు 2.8 ట్రిలియన్ ఎంఎంఎస్‌సిఎండి సహజ వాయువును ఉత్పత్తి చేసినట్టు లెక్కలు చెబుతున్నాయి. గ్యాస్‌ను మన రాష్ట్ర అవసరాలకు ఇవ్వకుండా మహారాష్ట్ర, గుజరాత్‌లకు తరలించుకుపోతోంది. న్యాయబద్ధంగా రాష్ట్రానికి రావాల్సిన వాటా దక్కడం లేదు.
ప్రాఫిట్ గ్యాస్ వాటా ఏదీ?
పెట్రోలియం, సహజవాయువు నిక్షేపాలను కనుగొన్నప్పుడు ఆ కంపెనీ కేంద్ర ప్రభుత్వానికి వాటా రూపంలో ఉచితంగా గ్యాస్‌ను సరఫరా చేయాలి. దీనినే ప్రాఫిట్ గ్యాస్ అంటారు. ఆ రకంగా కేంద్రానికి లభించే ప్రాఫిట్ గ్యాస్‌లో 50 శాతం రాష్ట్రాలకు ఇవ్వాల్సి ఉంది. కేంద్రానికి మిగిలిన 50 శాతం కూడా న్యాయంగా అయితే నిక్షేపాలు కనుగొనబడిన ప్రాంతానికి సరసమైన ధరకు సరఫరా చేయాల్సి ఉంది. కనీసం ఒఎన్‌జిసి సరఫరా చేసే ధరకైనా ఇవ్వాలి. కానీ, దీనికి భిన్నంగా తన వాటాను కేంద్రం గ్యాస్ రూపంలో కాకుండా డబ్బు రూపంలో తీసుకుంటోంది. 12వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసినట్టు కెజి బేసిన్‌లో కేంద్రానికి లభించిన ఉచిత గ్యాస్‌లో 50 శాతం వాటా రాష్ట్రానికి రావాల్సి ఉంది. అయితే, గ్యాస్ భూమిపై కాదు, ఆన్‌షోర్ కాదు… ఆఫ్‌షోర్‌లో కనుగొన్నారని, దీనిలో రాష్ట్రానికి వాటా ఉండదని కేంద్రప్రభుత్వం వితండ వాదన చేస్తూ రాష్ట్రానికి అన్యాయం చేస్తోంది. దీనిపై రాష్ట్ర పాలకులు నోరు మెదపడం లేదు. కనీసం ఈ గ్యాస్‌లో 25 శాతం రాష్ట్రానికి కేటాయించినా వ్యవసాయానికి కావాల్సిన ఉచిత విద్యుత్‌ను ఆ గ్యాస్‌తో ఉత్పత్తి చేయొచ్చు. అంటే, మెట్ట ప్రాంత రైతాంగానికి విద్యుత్ అవసరాలను శాశ్వత ప్రాతిపదికన తీర్చే అవకాశం ఉంది.
గ్యాస్ ఆధారిత స్టీల్ పరిశ్రమలకు అపార అవకాశాలు
గుజరాత్‌లో ఎస్‌ఆర్ స్టీల్ కంపెనీ గ్యాస్ ఆధారంగా స్టీల్‌ను ఉత్పతి చేస్తోంది. మన రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన గ్యాస్ లభిస్తే అలాంటి పరిశ్రమలు రాష్ట్రంలో కొలువు తీరుతాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ సామర్థ్యాన్ని మూడు రెట్లు పెంచే అవకాశం ఉంటుంది. కేజీ బేసిన్‌లో ఇప్పటి వరకూ 200 ఎంఎంఎస్ సిఎండి గ్యాస్ నిక్షేపాలను కనుగొన్నారు. ఒక ఎంఎంఎస్‌సిఎండి గ్యాస్ సుమారు రూ.1000 కోట్ల విలువైన పారిశ్రామిక పెట్టుబడిని ఆకర్షించగలదు. అంటే, కేజీ బేసిన్ గ్యాస్‌లో సగాన్ని ఉపయోగించుకున్నా మనం లక్షల కోట్ల రూపాయల విలువైన పారిశ్రామిక పెట్టుబడులను అకర్షించే వీలుంటుంది. రాష్ట్ర వాటా కోసం సిపిఎం ఇప్పటికే పలు పోరాటాలు నిర్వహించింది. తాజాగా రాజమహేంద్రవరంలో ఈ అంశంపై ఈ నెల 16న ‘కేజీ బేసిన్ గ్యాస్ సాధన సమితి’ ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు పలువురు మేధావులు, వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, మాజీ అధికారులు హాజరు కానున్నారు. గ్యాస్ కొరత నేపథ్యంలో ఈ సదస్సు ప్రాధాన్యత సంతరించుకుంది.
రాష్ట్ర అవసరాలకు గ్యాస్ కేటాయించాలి
కెజి బేసిన్ నుంచి అపారమైన చమురు, సహజవాయువు, గ్యాస్ నిక్షేపాలను వెలికితీస్తున్నారు. రాష్ట్ర అవసరాలకు కాకుండా ఈ వనరులను రిలయన్స్ సంస్థ దోచుకుపోతోంది. డి6తో పాటు డి5లో రూ.10 వేల కోట్లకుపైగా విలువైన గ్యాస్‌ను రిలయన్స్ సంస్థ దొంగిలించింది. అయినా పాలకులు మాట్లాడని పరిస్థితి. ఇక్కడి గ్యాస్‌ను గుజరాత్‌కు తరలించి, అక్కడి నుంచి విదేశాలకు అమ్ముకుని రూ.కోట్ల లాభాలను ఆర్జిస్తోంది. కేజీ బేసిన్‌లో ఉత్పత్తయ్యే గ్యాస్‌లో కనీసం 50 శాతం రాష్ట్ర అవసరాలకు కేటాయించాలి. తర్వాతే ఇతర ప్రాంతాలకు తరలించాలి. ఇందుకోసం కేజీ బేసిన్ గ్యాస్ సాధన సమితి ఆధ్వర్యంలో ఈ నెల 16న నిర్వహించే రాష్ట్ర స్థాయి సదస్సును విజయవంతం చేయాలి.
-టి.అరుణ్, సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి
తరలిపోతున్న గ్యాస్, చమురు
- Advertisement -
- Advertisement -



