Saturday, January 31, 2026
E-PAPER
Homeబీజినెస్బంగారం, వెండి ధరల్లో కుదుపు

బంగారం, వెండి ధరల్లో కుదుపు

- Advertisement -

అంతర్జాతీయ మార్కెట్‌లో భారీ తగ్గుదల

వాషింగ్టన్‌ : గత కొంతకాలంగా రికార్డు స్థాయిలో పెరుగుతూ ప్రజలను బెంబేలెత్తిస్తున్న బంగారం, వెండి ధరలకు ఒక్కసారిగా బ్రేక్‌ పడింది. అమెరికా తదుపరి ఫెడరల్‌ రిజర్వ్‌ అధ్యక్షుడిగా కెవిన్‌ వార్ష్‌ పేరును డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించిన నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు అనూహ్యంగా తగ్గాయి. శుక్రవారం ఒక్కరోజే బంగారం ధర దాదాపు 8 శాతం మేర క్షీణించి ఔన్స్‌ ధర 4,957 డాలర్లకు చేరుకోగా, వెండి 15 శాతం, ప్లాటినం 13 శాతం చొప్పున భారీగా క్షీణించాయి.

గురువారం సెషన్‌లో బంగారం ధర 5,600 డాలర్ల వద్ద ముగిసింది. దీంతో పోల్చితే ఒక్క పూటలో భారీ తగ్గుదలనే చోటు చేసుకున్నట్లయ్యింది. ఈ పతనానికి ప్రధాన కారణం కెవిన్‌ వార్ష్‌ నియామకమేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ద్రవ్యోల్బణాన్ని కఠినంగా నియంత్రించే ‘హాక్‌’గా పేరున్న వార్ష్‌ రాకతో డాలర్‌ విలువ బలపడింది. ఇది నేరుగా బంగారం ధరలపై ఒత్తిడిని పెంచింది. మరోవైపు చైనాకు చెందిన షాంఘై ఫ్యూచర్స్‌ ఎక్స్ఛేంజ్‌ కూడా ఊహాజనిత ట్రేడింగ్‌ను అరికట్టడానికి కొన్ని ఖాతాలను నిలిపివేయడం ఈ పతనానికి ఆజ్యం పోసింది. ధరల పతనం సామాన్యులకు కొంత ఉపశమనం కలిగిం చినప్పటికీ, భారీగా పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లకు మాత్రం ఇది పెద్ద షాక్‌గా మారింది.

భారత్‌లోనూ తగ్గుదల..
అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు దిగిరావడంతో భారత మార్కెట్‌లోనూ తగ్గుదల చోటు చేసుకుంది. శుక్రవారం న్యూఢిల్లీ బులియన్‌ మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారంపై రూ.9,650 తగ్గి రూ.1,69,350కి చేరింది. 22 క్యారెట్ల పసిడిపై రూ.8,850 దిగివచ్చి రూ.1,55,250 వద్ద నమోదయ్యింది. గుడ్‌రిటర్న్స్‌ ప్రకారం.. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల ధర రూ.1,69,200గా, 22 క్యారెట్ల ధర రూ.1,55,100గా నమోదయ్యింది. 10 గ్రాముల వెండిపై రూ.200 తగ్గి రూ.4,050గా, కిలో వెండిపై రూ.20,000 దిగివచ్చి రూ.4.05 లక్షలుగా పలికింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -