– పర్యాటకశాఖమంత్రి జూపల్లి కృష్ణారావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
టూరిజం, అతిథ్య రంగంలో వస్తున్న కొత్త ధోరణులపై దృష్టి పెట్టాలని పర్యాటక శాఖమంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ (నిథమ్)లో జాతీయ క్రీడా వారోత్సవాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, అధ్యాపకులతో ఇష్టాగోష్టి నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ విద్యార్థులు, పర్యాటకులను ఆకర్షించేలా నిథమ్‌ను తీర్చిదిద్దుతామని చెప్పారు. కొత్త విద్యా కార్యక్రమాలు, స్వల్పకాలిక, నైపుణ్యాభివృద్ధి కోర్సులను ప్రవేశపెట్టడంతో పాటు విద్యాశిక్షణా పరిధిని విస్తరించి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించాలని సూచించారు. తమ ప్రభుత్వం పర్యాటక, ఆతిధ్య రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పారు. ప్రముఖ టూరిస్టు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలను కల్పించాలని నిర్ణయించిందని తెలిపారు. చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యం కలిగిన ప్రాంతాలను అభివృద్ధి చేసి, వాటికి ప్రపంచ స్థాయిలో బ్రాండింగ్, ప్రచారం కల్పించేందుకు కృషి చేస్తున్నట్టు పేర్కొన్నారు. పర్యాటక కేంద్రాలకు కనెక్టివిటీ పెంచడంతో పాటు వసతి సౌకర్యాల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఆగస్టు 28 నుంచి 31 వరకు జరిగే పర్యాటక వారోత్సవాల్లో ఆరోగ్యం, శ్రేయస్సు, సంస్థాభివృద్ధి అంశాలపై వివిధ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. పర్యాటక, ఆతిధ్య రంగంలో పెట్టుబడులకు అపార అవకాశాలున్నాయనీ, ప్రయివేట్ సంస్థలు పెట్టుబడులు విరివిగా పెట్టాలని ఈ సందర్భంగా మంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నిథమ్ డైరెక్టర్ ప్రొఫెసర్ వెంకటరమణ, శ్రీకారా హాస్పిటల్స్ వైద్యులు పీఎల్‌ఎన్. పటేల్ తదితరులు పాల్గొన్నారు.