Saturday, March 28, 2026
E-PAPER
Homeజాతీయంమహిళా జడ్జీల పదోన్నతిపై దృష్టి సారించాలి

మహిళా జడ్జీల పదోన్నతిపై దృష్టి సారించాలి

- Advertisement -

కోర్టుల్లో ఖాళీలను త్వరితగతిన భర్తీ చేయాలి : సీజేఐ సూర్యకాంత్‌
25 హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు లేఖ

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కోర్టుల్లో ఖాళీలను త్వరితగతిన భర్తీ చేయాలని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సూర్యకాంత్‌ పేర్కొన్నారు. ప్రధానంగా మహిళా జడ్జీల పదోన్నతిపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. ఈ మేరకు సీజేఐ గతవారం 25 హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు లేఖ రాశారని సంబంధిత వర్గాలు శుక్రవారం తెలిపాయి. న్యాయవ్యవస్థలో జడ్జీల ఖాళీల భర్తీ విషయాన్ని, ధర్మాసనాల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచాల్సిన అవసరముందని లేఖలో పేర్కొన్నారు. ముఖ్యంగా కోర్టుల్లో మహిళా జడ్జీల సంఖ్య తక్కువగా ఉందని అన్నారు. కొలీజియం సిఫారసులను ఆలస్యం చేయవద్దని, ఖాళీ కానున్నాయని తెలిసిన వెంటనే వాటిని భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవాలని ఆయన జడ్జీలకు సూచించారు. న్యాయరంగంలోని మరింత మంది మహిళలు వచ్చేలా న్యాయవ్యవస్థలో పెద్ద ఎత్తున సంస్థాగత మార్పులు చేపట్టాల్సి ఉందని మార్చి8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఒక కార్యక్రమంలో సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ తెలిపిన విషయం విదితమే.

హైకోర్టు కొలీజియంలు జడ్జీల పదవుల భర్తీ కోసం ప్రతిభావంతులైన మహిళా జడ్జీలను మినహాయించకుండా, వారిని కేటాయించడం ఒక నిబంధనగా పరిగణించాలని అన్నారు. పదోన్నతి కోసం తమ పరిశీలన పరిధిని విస్తృతం చేయాలని, తమ రాష్ట్రాల్లోని, సుప్రీంకోర్టులో న్యాయవాదులుగా ప్రాక్టీస్‌ చేస్తున్న మహిళా న్యాయవ్యాదులను కూడా చేర్చుకోవాలని హైకోర్టు జడ్జీలకు సూచించారు. ప్రస్తుతం వివిధ హైకోర్టుల్లో పలువురు మహిళలు ప్రధాన జడ్జీలుగా విధులు నిర్వహిస్తున్నారని, పంజాబ్‌, హర్యానా హైకోర్టులో 18 మంది మహిళా జడ్జీలు ఉన్నారని పేర్కొన్నారు. మద్రాస్‌, బాంబే హైకోర్టుల్లో కూడా సుమారు 12 మంది మహిళా జడ్జీలు ఉన్నారని ఆయన తెలిపారు. జిల్లా స్థాయిలో పనిచేస్తున్న న్యాయాధికారుల్లో మహిళలు సుమారు 36.3శాతం ఉన్నారని సీజేఐ పేర్కొన్నారు. ఇది ఒక సాధారణ గణాంకం కాదని, ఇది తరాల మార్పును ప్రతిబింబిస్తుందని అన్నారు. వ్యవస్థ పునాదిలోనే ఎక్కువ మహిళా భాగస్వామ్యం ఉన్నప్పుడు, అది అత్యున్నత న్యాయవ్యవస్థలో కూడా త్వరలోనే ప్రతిబింబిస్తుందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -