నేడు అత్యధికంగా రోడ్డు ప్రమాదాల వల్లనే మృత్యువాత పడుతున్నారు
వైరా ఏసిపి సాధువుల సారంగపాణి
గ్రామాలలో తమ శక్తి మేరకు ప్రమాదాల నివారణకు కృషి
పెద్ద బీరవల్లి సర్పంచ్ చింతలచెరువు కోటేశ్వరరావు
నవ తెలంగాణ – బోనకల్
రోడ్డు భద్రత నియమాలు పాటించండి, సురక్షితంగా ఇంటికి చేరండి, కుటుంబాలను రోడ్డును పడకుండా ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని వైరా ఏసిపి సాధువుల సారంగపాణి కోరారు. గ్రామపంచాయతీ పరిధిలో తమ శక్తి మేరకు రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలలో చైతన్యం కలిగించే విధంగా కృషి చేస్తామని పెద్ద బీరవల్లి సర్పంచ్, బోనకల్ ఉపసర్పంచ్ బానోత్ కొండ అన్నారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని బోనకల్ పోలీస్ స్టేషన్ లో రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా రోడ్డు భద్రత నియమాల పై ఎస్సై పొదిలి వెంకన్న అధ్యక్షతన అవగాహన సదస్సు సోమవారం నిర్వహించారు. ఈ సదస్సులో వైరా ఏసిపి సాదుల సారంగపాణి మధిర రూరల్ సీఐ దొంగరి మధు, బోనకల్ ఎస్ఐ పొదిలి వెంకన్న మాట్లాడుతూ ఎరైవ్ – ఎలైవ్ నినాదం తో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత నియమాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు 25 మంది మృతి చెందుతున్నారని, ఇందులో కేవలం యువకులు 18 మంది ఉంటున్నారన్నారు. నెలకు 350 మంది రోడ్డు ప్రమాదంలో మృతి చెందుతున్నారని తెలిపారు. గత ఏడాది బోనకల్ మండలంలో ఆరుగురు రోడ్డు ప్రమాదాల వలన మృతి చెందారని తెలిపారు. వాహనాలు నడిపేటప్పుడు నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్తగా నడపాలని, అదేవిధంగా ఎదుటివారు ఏ విధంగా వస్తున్నారో గమనించి ప్రయాణం చేయాలని సూచించారు. నిర్లక్ష్యం, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచించారు. వాహనాల మీద ప్రయాణం చేసే వారందరూ తిరిగి ఇంటికి సుఖ సంతోషంగా రావాలన్నదే పోలీస్ శాఖ లక్ష్యం అన్నారు. ప్రజా సంక్షేమం కోసమే ప్రభుత్వం అనేక నిబంధనలను అమలు చేస్తుందని, వీటిని పాటించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. రోడ్డు ప్రమాదాలు వలన మృతి చెందిన కుటుంబాల పరిస్థితి ఎంతో దయనీయంగా ఉంటుందన్నారు.
ఇటువంటి సంఘటనలు మనం ఎన్నో చూస్తూ వస్తున్నామన్నారు. కుటుంబ పెద్ద రోడ్డు ప్రమాదంలో మృతిచెందితే ఆ కుటుంబం పరిస్థితి వీధిన పడవలసి వస్తుందన్నారు. దేశవ్యాప్తంగా ఎక్కువమంది రోడ్డు ప్రమాదాల వల్లే మృతి చెందుతున్నారన్నారు. అందువల్లే వైరా సబ్ డివిజన్ వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రోడ్డు భద్రత అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ గ్రామానికి ప్రధమ, ద్వితీయ పౌరులు అన్నారు. గ్రామం వీరి చేతులనే ప్రధానంగా కేంద్రీకృతమై, నియంత్రణలో ఉంటుందని, అందువల్లనే సర్పంచ్, ఉప సర్పంచ్ లకు ప్రత్యేకంగా ఈ అవగాహన సదస్సులు ఏర్పాటుచేసి రోడ్డు భద్రతా నియమాలను వివరిస్తున్నట్లు తెలిపారు. గ్రామాలలో సర్పంచులే ఇటువంటి వాటిని నియంత్రణ చేయాలని సూచించారు. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన వాహనదారులను విడిపించాలని పోలీసులకు సర్పంచులు కోరవద్దని కోరారు. ఈ విధంగా విడిపించటం వలన వారిలో నిర్లక్ష్యం ఏర్పడుతుందన్నారు. ఈ నిర్లక్ష్యం చివరికి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కూడా పోవచ్చునన్నారు.

ప్రతి ఒక్కరూ సురక్షిత ప్రయాణం చేయాలని సూచించారు. గ్రామాలలో ప్రజలను చైతన్యం చేయాలని సర్పంచులను కోరారు. సీపీఐ(ఎం) జిల్లా సీనియర్ నాయకులు, పెద్ద బీరవల్లి సర్పంచ్ చింతలచెరువు కోటేశ్వరరావు మాట్లాడుతూ తమ గ్రామ పరిధిలో ప్రజలలో రోడ్డు భద్రత నియమాలపై పూర్తిస్థాయిలో అవగాహన సదస్సుల నిర్వహిస్తామని తెలిపారు. తమ పరిధిలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇటీవల మండల కేంద్రంలో గల ఆర్ఓబి బ్రిడ్జి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మా గ్రామానికి చెందిన వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడని, నేటికీ ఆసుపత్రుల్లోనే వైద్య చికిత్స పొందుతున్నాడని తెలిపారు. పోలీస్ శాఖ సూచించిన విధంగా తాము అవసరమైన అన్ని చర్యలు గ్రామపంచాయతీ పరిధిలో తీసుకుంటామని తెలిపారు. చొప్పకట్ల పాలెం సర్పంచ్ కాటేపల్లి అశ్విని మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రంలో ప్రాథమిక పాఠశాలలో కొంతమంది ఆగతాయిలో మద్యం సేవించి అక్కడే మద్యం చేశాలను పగలగొట్టి చిందరవందరగా పడేస్తున్నారని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు వారిని కోరారు.
దీనివలన పాఠశాల ఆవరణ మొత్తం కలుషితం అవుతుందని తెలిపారు. బోనకల్ ఉపసర్పంచ్ బానోతు కొండ తూటికుంట్ల సర్పంచ్ తుళ్లూరు లక్ష్మీనరసయ్య, గోవిందాపురం ఎల్ గ్రామ సర్పంచ్ కారంగుల చంద్రయ్య, ముష్టికుంట్ల సర్పంచ్ పిల్లలమర్రి నాగేశ్వరరావు, చొప్పకట్లపాలెం ఉపసర్పంచ్ పల్లా కొండలరావు, ఆళ్లపాడు సర్పంచ్ తెల్లబోయిన నాగేశ్వరరావు మాట్లాడారు. ఈ సమావేశంలో చింతకాని ఎస్ఐ వీరేందర్, రావినూతల, లక్ష్మీపురం, మోటమర్రి, రామాపురం, సర్పంచ్ లు భుక్యా బద్రు నాయక్, మర్రి సురేష్, మంద మంగమ్మ, టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా కోశాధికారి తేనె వెంకటేశ్వర్లు, వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచ్ లు తదితరులు పాల్గొన్నారు.



