అమెరికా కోర్టుల రూలింగ్
వాషింగ్టన్ : లక్షలాది మంది పేదలు, అల్పాదాయ వర్గాల ప్రజలకు అందజేస్తున్న ఆహార సాయాన్ని ప్రభుత్వ షట్‌డౌన్ సాకుతో ఎలా నిలిపివేస్తారని అమెరికా కోర్టులు శుక్రవారం ట్రంప్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. ఆహార సాయాన్ని ఆపకూడదని రూలింగ్ ఇచ్చాయి. కంటింజెన్సీ నిధుల నుంచి సొమ్ము తీసుకొని ఆహార సాయాన్ని కొనసాగించాలని ఆదేశించాయి. అమెరికాలో 42 మిలియన్ల మంది…అంటే ప్రతి ఎనిమిది మంది పౌరుల్లో ఒకరు…తమ కుటుంబ ఆహార అవసరాల కోసం ప్రభుత్వ సాయంపై ఆధారపడుతున్నారు. అయితే ప్రభుత్వ షట్‌డౌన్ కారణంగా ఈ సాయాన్ని శనివారం నుంచి నిలివేయాల్సి వస్తుందని ప్రభుత్వ వర్గాలు ఇప్పటికే తెలిపాయి. బోస్టన్‌లోని అమెరికా జిల్లా జడ్జి ఇందిరా తల్వానీ, రోడ్ ఐలాండ్ జిల్లా కోర్టు జడ్జి జాన్ మెక్‌నెల్ ఒకే రోజు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రూలింగ్ ఇచ్చారు.
ఆహార సాయానికి సంబంధించిన స్నాప్ పథకానికి ఏ విధంగా నిధులు సమకూరుస్తారో సోమవారం లోగా తెలియజేయాలని ప్రభుత్వానికి ఇందిరా తల్వానీ గడువు విధించారు. ఈ కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపివేయడం చట్టవిరుద్ధమని ఆమె స్పష్టం చేశారు. డెమొక్రాట్ల పాలనలో ఉన్న ఇరవై ఐదు రాష్ట్రాలతో పాటు కొలంబియా జిల్లా దాఖలు చేసిన పిటిషన్‌ను పురస్కరించుకొని తల్వానీ ఈ ఆదేశాలు జారీ చేశారు. కాగా కంటింజెన్సీ నిధులను ఉపయోగించి స్నాప్ పథకాన్ని కొనసాగించాల్సిందేనని మెక్‌నెల్ తన రూలింగులో తెలిపారు. కోర్టులు జారీ చేసిన ఆదేశాలపై అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ కంటింజెన్సీ నిధులు వాడుకోవడం చట్టవిరుద్ధమని చెప్పుకొచ్చారు. ఇదిలావుండగా అమెరికాలో ప్రభుత్వ షట్‌డౌన్ శనివారం 32వ రోజుకు చేరింది.



